కేసీఆర్ సంజయ్ గాంధీ శిష్యుడు కాదా?: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు

by Javid Pasha |
కేసీఆర్ సంజయ్ గాంధీ శిష్యుడు కాదా?: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కిరణ్ కుమార్ శిష్యుడు అంటూ చేస్తున్న కామెంట్స్ పై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందించారు. సీఎం కేసీఆర్ సంజయ్ గాంధీ శిష్యుడు కాదా అని ఆయన ప్రశ్నించారు. ఒక విషయం గురించి నేర్చుకునేటప్పుడు ఎవరు ఎవరికైనా శిష్యుడిగా ఉండొచ్చని ఆయన వెల్లడించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్ర సీఎంల పేర్లతో సీఎం కేసీఆర్ మరోసారి పబ్బం గడిపే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణలోనే అభివృద్ధి పట్టని వ్యక్తి మహారాష్ట్రలో ఏం చేస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. మహారాష్ట్ర స్థానిక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచిన స్థానాలెన్ని అని రఘునందన్ రావు ప్రశ్నించారు. 2014 నుంచి ఇప్పటి వరకు ప్రజా సమస్యలపై చర్చించే శాసన సభను నెల రోజులు నడపకపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు.

ఈ విషయంపై తనలాంటి కొత్త సభ్యులతో చెప్పించుకోడం సిగ్గుచేటు అని విమర్శించారు. మంద బలం ఉందని విర్రవీగే కేసీఆర్ కు 30 రోజులు సభ నడిపే దమ్ము లేదా అని నిలదీశారు. సభ నడిపేందుకు ఆయనకున్న ఏంటని ప్రశ్నించారు. తమ పార్టీ నుంచి ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలకు సభలో మాట్లాడే అవకాశం ఇచ్చేందుకు కేసీఆర్ కు భయమెందుకని రఘునందన్ రావు ప్రశ్నించారు. రాష్ట్ర సమస్యలపై చర్చించేందుకు 30 రోజులు సభ నడపాలని ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. సభలో వరదల కారణంగా ఏర్పడిన నష్టంపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు. ఇదే చివరి అసెంబ్లీ సెషన్ కాబట్టి 30 రోజులు సభలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

నాంపల్లి కోర్టు మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు రఘునందన్ రావు తెలిపారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై కోర్టు కేసు నమోదు చేయాలని ఆదేశిస్తే కేబినెట్ లో ఎలా కూర్చోబెట్టుకుంటారని ఆయన ప్రశ్నించారు. నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు మరో 11 మందిపై కేసు నమోదు చేయాలని ఆదేశించిందన్నారు. మంత్రి గంగుల కమలాకర్ పై కూడా కేసు ఉందని ఆయన తెలిపారు. కేసులున్న మంత్రులను కేబినెట్ నుంచి తొలగించాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed