బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సంచలన ప్రెస్‌మీట్

by Mahesh |
బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సంచలన ప్రెస్‌మీట్
X

దిశ, తెలంగాణ బ్యూరో : తాను చేసిన ఆరోపణలు పక్కా ఆధారాలతో మాట్లాడుతున్నానని, ఇది తప్పు అని ప్రూవ్ చేస్తే అక్కడే సూసైడ్ చేసుకుంటానని కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఈ సవాల్ కు రేవంత్ సిద్ధమేనా? అని ఆయన ప్రశ్నించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా పేరిట ఇండ్లు కూల్చివేశారని, కూల్చే ముందు చర్చలకు పిలవకుండా ఇప్పుడు చర్చలకు పిలుస్తున్నారని, అప్పుడు ఎందుకు పిలవలేదో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. హైడ్రా కూల్చివేతల్లో భాగంగా ఇండ్లు కోల్పోయిన వారికి సహాయం చేసేందుకు ఇప్పటి వరకు తాను తీసుకున్న జీతం మొత్తం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు కాటిపల్లి వెంకట రమణా రెడ్డి తెలిపారు. సీఎంతో పాటు ఎమ్మెల్యేలు అలా ఇవ్వగలరా? దమ్ముందా? అని ఆయన ప్రశ్నించారు. హైడ్రా పేరిట హంగామా చేస్తున్న రేవంత్ వద్ద అసలు డేటా ఉందా? అని ఆయన ప్రశ్నించారు.

హైడ్రాతో ప్రజలు సతమతమవుతున్నారని కాటిపల్లి పేర్కొన్నారు. ఇండ్లు ఎప్పుడు కూల్చుతారనే భయాందోళనలో ప్రజలు ఉన్నారని తెలిపారు. ఎన్ కన్వెన్షన్ కూల్చేస్తే చెరువులన్నీ శుద్ధి అయ్యాయా? అని కాటిపల్లి ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రజా క్షేమాన్ని కోరడం లేదని, పేదల పొట్ట కొట్టడం ప్రజా క్షేమం అవుతుందా? అని ఆయన ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైడ్రాపై 190 పేజీల రిపోర్ట్ ఇచ్చారని, హైడ్రాపై భట్టి చేసిన ప్రజెంటేషన్ క్లారిటీ లేదని ఎద్దేవా చేశారు. 20 గుంటలు, 30 గుంటలు తప్ప, ఎకరాల్లో ఆక్రమణలకు గురైన చెరువులు, కుంటలు లెక్కలు భట్టికి కనిపించడం లేదా అని నిలదీశారు. నగరంలో చాలా ఏరియాల్లో చెరువులు మాయం అయ్యాయనే విషయం ఉప ముఖ్యమంత్రికి తెలియదా అని కాటిపల్లి ప్రశ్నించారు. చెరువులు కబ్జాకు గురయ్యాయని ఉప ముఖ్యమంత్రి చెబుతున్నారని, కానీ ఎవరు కబ్జా చేశారు అనేది మాత్రం చెప్పడం లేదని ఆయన ఫైరయ్యారు.

చెరువుల ఆక్రమణలపై తాను చేస్తున్నవి వాస్తవాలని, తప్పు అని తేలితే తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని నొక్కి చెప్పారు. గత ప్రభుత్వం తప్పు చేసిందని, ఈ ప్రభుత్వం అదే తప్పు మళ్లీ మళ్లీ చేస్తోందని వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో చెరువులను సెజ్‌లుగా మార్చి, ఫీనిక్స్, స్కైల్యాండ్ లాంటి కొన్ని నిర్మాణ కంపెనీలకు అప్పజెప్పారని ఆరోపించారు. నార్సింగ్ లో 19 ఎకరాల మొక్కసానికుంటను ఫీనిక్స్, స్కై ల్యాండ్ కంపెనీకి ఎలా అప్పజెప్పారనేది చెప్పాలని ప్రశ్నించారు. ఈ నిర్మాణాలు మంత్రి భట్టి విక్రమార్కకు కనిపించడం లేదా అని కాటిపల్లి ప్రశ్నించారు. హెచ్ఎండీఏ అప్రూవల్ తో ప్రేమావతి పెద్ద చెరువు బౌండ్రీని తగ్గించి 15 ఎకరాల్లో ప్రిస్టేజ్ కంపెనీ విల్లాల నిర్మాణాలు చేపడుతోందని వెంకటరమణారెడ్డి ఆరోపణలు చేశారు.

నగర చెరువులల్లో 30 కంపెనీలు చేపడుతున్న నిర్మాణాలను కూల్చే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా? అని కాటిపల్లి ప్రశ్నించారు. తన దగ్గర మొత్తం డేటా ఉందని, పక్కా ఆధారాలున్నాయని, కూల్చే దమ్ముందా? అని కాటిపల్లి సవాల్ విసిరారు. నగర చెరువులపై ప్రభుత్వం వద్ద ఉన్న డేటాను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఉస్మాన్ కుంటను ప్రణీత్ ప్రణవ్ గ్రోవ్ ప్రాజెక్ట్ కంపెనీకి ధారాదత్తం చేశారని ఆయన ఆరోపించారు. ఉస్మాన్ కుంటను పేరు మార్చి ప్రణవ్ గ్రోవ్ ప్రాజెక్ట్ గా పేరు మార్చుకున్నట్లు వెల్లడించారు. 70 ఎకరాల భూమిని ప్రణవ్ గ్రూపునకు ఎలా వెళ్లిందని, అక్కడ నిర్మాణాలు ఎలా జరుగుతున్నాయని ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఇవన్నీ కనిపించడం లేదా? అని నిలదీశారు. తెల్లాపూర్ చెరువును ఏలియన్స్ కంపెనీకి అప్పజెప్పారని, గత ప్రభుత్వంలో కేసీఆర్ ఆక్రమణల పేరుతో పైసల పాలన సాగించారన్నారు. రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో ప్రజా పాలన అంటూ సాగిస్తున్నారని ఫైరయ్యారు. సీఎంకు దమ్ముంటే తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. తప్పు చేసిందెవరు? శిక్ష వేస్తున్నది ఎవరికని రేవంత్ ను కాటిపల్లి ప్రశ్నించారు.

కూలగొట్టిన వేస్టేజ్ పై ప్రభుత్వం వద్ద ప్రణాళిక ఉందా? అని నిలదీశారు. 30, 40 ఏండ్ల నుంచి బతుకుతున్న వారి ఇండ్లను కూల్చి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామంటే సరిపోతుందా అని ప్రశ్నించారు. బడా కంపెనీల ఆక్రమణలను ముఖ్యమంత్రి కూల్చగలరా? అని ప్రశ్నించారు. బడా ఫాంహౌజ్‌లు రేవంత్ కు కనిపించడం లేదా. వాటిని కూల్చే దమ్ము లేదా అని చురకలంటించారు. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజకీయ నేతల జీత భత్యాలతో పేదలకు ఇండ్లు నిర్మిద్దామని, దీనికి కలిసొచ్చే దమ్ముందా? అని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, కేటీఆర్, హరీష్ రావు కూడా సిద్ధం కావాలన్నారు. తనకు అక్రమ ఆస్తులున్నాయని నిరూపిస్తే వాటిని అక్కడే వదిలేస్తానని, కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు వదిలేయడానికి సిద్ధమా? అని కాటిపల్లి సవాల్ విసిరారు. రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ప్రజా పాలన లేదని విమర్శలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed