మరో వినూత్న కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం.. మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ప్రారంభం

by Gantepaka Srikanth |
మరో వినూత్న కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం.. మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ప్రారంభం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం(Telangana Government) మరో వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టబోతున్నది. రాబోయే కార్తీకమాసం నుంచి ‘అధికారులు ఆలయాల బాట’ ప్రోగ్రాం నిర్వహించనున్నది. దేవాదాయశాఖకు చెందిన ప్రతి అధికారి ఆలయాన్ని సందర్శించడంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కార్తీకమాసం, ధనుర్మాసంలో విధిగా ఉన్నతాధికారులు, ఆఫీసర్లు టెంపుల్స్‌కు వెళ్లేలా ఆదేశాలు ఇప్పటికే ఇచ్చినట్టు సమాచారం. వచ్చే నెల 4 నుంచి ప్రారంభం కానున్న కార్తీకమాసంలో మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. కీసర లేదా రామప్పలో తొలి కార్తీక పూజ చేయనున్నట్టు తెలిసింది. ప్రజలు, పర్యాటకులను ఆలయాలకు ఆకర్షించేందుకే కొత్త కార్యక్రమాలను చేపడుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 704 ఆలయాలు దేవాదాయశాఖ పరిధిలో ఉన్నాయి.

రెండు, మూడు మండలాల్లోని ఆలయాలకు కలిపి ఒక ఈవో ఉండగా, పెద్ద ఆలయాలకు ఒకరు ఉన్నారు. అయితే వారు ఆలయాల అభివృద్ధి‌పైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. కానీ ప్రజలు, భక్తులు, పర్యాటకులతో ఇంటరాక్ట్ కావడం లేదని.. కొంత గ్యాప్ ఉందని ప్రభుత్వం భావిస్తున్నది. దీంతో వారికి దగ్గర చేయడంతో పాటు పర్యాటకులను ఆకర్షించాలనే దానిపై కసరత్తు ప్రారంభించింది. భక్తులు ఎక్కువగా వస్తేనే ఆదాయం సమకూరుతుందని, టెంపుల్స్‌ను మరింత డెవలప్ చేయొచ్చని భావిస్తున్నది. మరోవైపు.. ఆలయాల అభివృద్ధికి సేకరించే విరాళాలు సైతం పకడ్బందీగా ఖర్చుపెట్టే ప్రణాళికలు రూపొందిస్తున్నారు. క్యూఆర్ కోడ్ సిస్టంతో పూజలు, ఆలయాల్లో అన్నదానం కార్యక్రమాలకు విరాళాలు సైతం సేకరించేందుకు కసరత్తు చేస్తున్నారు. అన్ని దేవాలయాల వెబ్ సైట్లను ఒకే గొడుకు కిందకు తీసుకురావడంతో పాటు త్వరలోనే యాప్‌ను దేవాదాయశాఖకే ప్రత్యేకంగా తయారు చేయబోతున్నారు.

Advertisement

Next Story

Most Viewed