తీరంవైపు దూసుకొస్తున్న తీవ్ర తుపాన్.. ఈ రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు

by Rani Yarlagadda |   ( Updated:2024-10-24 02:43:35.0  )
తీరంవైపు దూసుకొస్తున్న తీవ్ర తుపాన్.. ఈ రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు
X

దిశ, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుపాన్ (Cyclone Dana).. తీవ్ర తుపానుగా బలపడినట్లు ఐఎండీ (IMD) వెల్లడించింది. మరికొన్ని గంటల్లో ఈ తుపాన్ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని తెలిపింది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు దూసుకొస్తున్న తుపాన్ ప్రభావం ఒడిశా (Odisha), పశ్చిమ బెంగాల్ (West Bengal) రాష్ట్రాలపై తీవ్రంగా ఉండనుంది. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను అధికారులు హెచ్చరించారు. తీరప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే ముందుగానే పునరావాస కేంద్రాలకు తరలించాలని ప్రభుత్వాలు అధికారులను ఆదేశించాయి.

నేటి రాత్రికి లేదా రేపు ఉదయానికి భిటర్ కనిక నేషనల్ పార్క్ - ధామ్రా పోర్ట్ ల మధ్య దానా తుపాన్ తీరం దాటుతుందని వాతావరణశాఖ అంచనా వేసింది. ప్రస్తుతం ఇది పారాదీప్‌కు 280 కి.మీ, ధమర 310 కి.మీ దూరంలో.. సాగర్‌ ఐలాండ్‌కు 370 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు చెప్పింది. తీరందాటే సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు, భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా ఉత్తర ఒడిశా, దక్షిణ బెంగాల్ తీరాలపై ఈ తుపాన్ తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. ఏపీలోని అన్ని పోర్టుల్లో 2వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది.

కోల్ కతా ఎయిర్ పోర్ట్ బంద్

దానా తుపాను ప్రభావంతో కోల్ కతా ఎయిర్ పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. 15 గంటల పాటు ఎయిర్ పోర్టును మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి రేపు ఉదయం 9 గంటల వరకూ కోల్ కతా ఎయిర్ పోర్టు మూతపడనుంది. ప్రయాణికులు ఇందుకు సహకరించాలని కోరారు.

మరోవైపు దానా తుపాను ఎఫెక్ట్ తో దక్షిణ మధ్య రైల్వే మరిన్ని రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించింది. ఇప్పటికే 170 రైళ్లను రద్దు చేయగా.. ఈ నెల 27వ తేదీ వరకూ సికింద్రాబాద్, చెన్నై, బెంగళూరు నుంచి భువనేశ్వర్, హౌరా వైపు వెళ్లే రైళ్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఒడిశా విద్యుత్ శాఖ హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది. అవసరమైనవారు 8900793503, 19221, 1912 నంబర్లను సంప్రదించాలని సూచించింది. ఇప్పటికే 10 లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ తెలిపారు. 14 జిల్లాల్లోని 10,60,336 మంది ప్రజలు తుపాను ప్రభావానికి గురవుతున్నారని చెప్పారు. అన్ని విద్యాసంస్థలకు ఒడిశా, వెస్ట్ బెంగాల్ ప్రభుత్వాలు సెలవు ప్రకటించాయి.

Advertisement

Next Story

Most Viewed