బీఆర్ఎస్, కాంగ్రెస్ బీసీలను ఓటు బ్యాంకుగానే చుశాయి.. బీజేపీ నేతలు జితేందర్ రెడ్డి, విజయశాంతి

by Javid Pasha |
బీఆర్ఎస్, కాంగ్రెస్ బీసీలను ఓటు బ్యాంకుగానే చుశాయి.. బీజేపీ నేతలు జితేందర్ రెడ్డి, విజయశాంతి
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు బీసీలను ఓటు బ్యాంకు గానే చూశాయని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్ రెడ్డి విమర్శించారు. వారి పాలనలో బీసీల అభివృద్ధి, సంక్షేమం గురించి పట్టించుకోలేదని ఆరోపించారు. వెనుకబడిన వర్గాలకు మేలు చేసేలా బీజేపీ తెలంగాణ శాఖ బీసీ డిక్లరేషన్ ప్రకటించడం సంతోషదాయకమని గురువారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. బీసీల అభివృద్ధి పట్ల బీజేపీ చిత్తశుద్ధికి ఇది మరో ఉదాహరణ అని పేర్కొన్నారు. ఎంతో మంది ఓబీసీ విద్యార్థులు ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థిక వనరులు లేక విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే అవకాశాలు కోల్పోతున్నారని, వారికి భరోసానిచ్చేలా ఈ డిక్లరేషన్ ఉందన్నారు.

రాష్ట్రంలో యాభై శాతానికి పైగా బీసీ జనాభా ఉందని, బీఆర్ఎస్ సర్కార్ వారి సంక్షేమం కోసం బడ్జెట్ కేటాయిస్తున్నది మాత్రం రెండు, మూడు శాతమే అని విమర్శించారు. జనాభా ఆధారంగా బీసీలకు బడ్జెట్ కేటాయింపులు జరుపుతామనడం వారికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడమే అని తెలిపారు. బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా ఇస్తామనడం వెనకబడిన వర్గాలకు బలం చేకూర్చడమేనన్నారు. వచ్చే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు ఓబీసీలు గట్టి బుద్ధి చెప్పాలని పిలపునిచ్చారు.

వెనుకబడిన వర్గాలకు కేసీఆర్ వెన్నుపోటు: విజయశాంతి

వెనుకబడిన వర్గాలకు కేసీఆర్ వెన్నుపోటు పొడిచారని, ఓబీసీలు వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించి కేసీఆర్‌కు చెంపపెట్టు లాంటి తీర్పునివ్వాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పనులు మానుకొని కుల వృత్తులు, సబ్బండ వర్గాలు పోరాడితే తెలంగాణ వచ్చిందని, రాష్ట్రం వచ్చాక గద్దెనెక్కిన కేసీఆర్ కుల వృత్తులకు తీరని అన్యాయం చేశారని విమర్శించారు. ఓబీసీ రిజర్వేషన్లు తగ్గిస్తూ రాజ్యాంగ విరుద్ధమైన మత రిజర్వేషన్లు అమలు చేశారని తెలిపారు. బీసీ కమిషన్ కు కోరలు లేకుండా చేశారని, బీసీ సంక్షేమానికి అత్తెసరు నిధులే కేటాయిస్తున్నారని తెలిపారు. తెలంగాణలో అన్యాయమవుతోన్న బీసీలకు న్యాయం చేసేలా బీజేపీ బీసీ డిక్లరేషన్ ఉందన్నారు.

Advertisement

Next Story

Most Viewed