BIG News: ‘తుమ్మలకుంట’ మాయం! చెరువును మింగేసిన వెంచర్

by Shiva |
BIG News: ‘తుమ్మలకుంట’ మాయం! చెరువును మింగేసిన వెంచర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీ సర్దార్ నగర్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏకంగా ఓ చెరువునే మాయం చేశారు. వెంచర్ చేసి ప్లాట్లుగా అమ్మేశారు. తమ పొలాలకు నీటి సదుపాయం లేకుండా చేశారంటూ సర్దార్ నగర్ ప్రజలు, చెరువును సైతం ప్లాట్లుగా చేసి అమ్మేశారంటూ మాజీ ప్రజాప్రతినిధులు ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకునే వారు కరువయ్యారు. నీటి పారుదల, రెవెన్యూ శాఖలకు పలుమార్లు లిఖితపూర్వకంగా అర్జీ పెట్టుకొని, న్యాయం చేయాలని కోరినా అధికారులెవరూ స్పందించలేదు. దీంతో తుమ్మల చెరువులో ఉండాల్సిన వరద నీరు సమీపంలోని పంట పొలాల్లోకి వెళ్తున్నది. భూగర్భ జలాలు సైతం పడిపోతున్నాయంటూ గ్రామస్తులు వాపోతున్నారు. హైడ్రా దృష్టి సారించి చెరువును పునరుద్ధరించాలని కోరుతున్నారు.

ఆనవాళ్లే లేకుండా..

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం సర్దార్ నగర్ సర్వే నం.2, 3 లో సాయి జ్యోతి హౌజింగ్ ప్రైవేటు లిమిటెడ్ పేరిట లే అవుట్ వేశారు. సర్వే నంబర్ 2లో ఏడెకరాల విస్తీర్ణంలో తుమ్మలకుంట చెరువు ఉండేది. ఇప్పుడు దానిని ఆనవాళ్లు లేకుండా చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా పక్కనే మంఖల్ రెవెన్యూ సర్వే నం.131లో 60 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీంతో వారి ల్యాండ్ కు దారి లేదని, మంఖల్ రెవెన్యూ పరిధిలోని రెండెకరాల ప్రభుత్వ భూమిలో దర్జాగా 40 ఫీట్ల రోడ్డు వేశారు. ఈ విషయాల్లో కాలనీవాసులు నాలుగేండ్లుగా ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేస్తూనే ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. 131లోని ప్రభుత్వ భూమిని సర్వే చేయడం ద్వారా ఎంత ఆక్రమణకు గురైందన్న విషయం తెలుస్తుందని సర్దార్ నగర్ మాజీ సర్పంచ్ తాళ్ల రాకేశ్ గౌడ్ అభిప్రాయపడ్డారు. ప్రజేంద్ర వెంచర్, కింగ్ అయో టౌన్ షిప్ వంటివి కూడా పక్కపక్కనే ఉన్నాయి. వీటిపైనా సమగ్ర దర్యాప్తు చేయడం ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయంటున్నారు. సుమారు రూ.10 కోట్ల విలువైన స్థలం మాయమైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

చెరువు ఉన్నట్టు చెబుతున్నా..

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మంఖాల్, సర్దార్ నగర్ భూ సంబంధ కేసు విషయంలో నీటి పారుదల శాఖ ఈఈ కె.బన్సీలాల్ హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. అందులో మంఖల్ సర్వే నం.131 ప్రభుత్వ భూమిలో నుంచి రోడ్డు వేసినట్లు చెప్పారు. అలాగే సర్దార్ నగర్ సర్వే నం.1, 2, 3లో ఫీడర్ చానల్ ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ చానల్ రావిర్యాల పెద్ద చెరువుకు వెళ్తుందని రాశారు. రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులు సంయుక్తంగా విచారణ చేసి రుజువు చేసినట్లుగా ప్రస్తావించారు. అలాగే సర్వే నం.2లో చెరువు ఉందన్నారు. ఇవన్నీ రాళ్లు, డెబ్రిస్ తో నింపేసినట్లుగా 2020 డిసెంబరులోనే గుర్తించారు. కానీ ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకోకుండా చోద్యం చూశారు. దాంతో లే అవుట్ వేసి అమ్మేశారు.

‘ఇరిగేషన్’ ఇన్ఫర్మేషన్ ఇలా..

సర్దార్ నగర్ తుమ్మల చెరువు

బేసిన్: మూసీ, కృష్ణా

ఎఫ్టీఎల్ ఏరియా: 7.59 ఎకరాలు

ట్యాంక్ బండ్ పొడవు: 211 మీటర్లు.

ట్యాంక్ బండ్ వెడల్పు: 3.10 మీటర్లు.

చెరువును పునరుద్ధరించాల: తాళ్ల రాకేశ్ గౌడ్, మాజీ సర్పంచ్, సర్దార్ నగర్

మేం తుమ్మల చెరువు, ప్రభుత్వ భూమిని కాపాడేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాం. ఎవరూ పట్టించుకోలేదు. ప్రభుత్వ ల్యాండ్ లో రోడ్డు వేశారని గుర్తించినా ఎవరూ చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉంది. ఆ ల్యాండ్ పక్కనే మా పొలాలు ఉన్నాయి. ఇప్పుడా చెరువు లేకపోవడం వల్ల మాకు భూగర్భ జలాలు పడిపోతున్నాయి. ఇప్పుడు చెరువులను కాపాడేందుకు రంగంలోకి దిగిన హైడ్రా.. మా చెరువు, ప్రభుత్వ భూమిని కాపాడేందుకు సైతం చర్యలు తీసుకోవాలి.

Advertisement

Next Story

Most Viewed