BIG News: పంచాయతీ ఓటరు జాబితా సిద్ధం చేయండి: కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు

by Shiva |
BIG News: పంచాయతీ ఓటరు జాబితా సిద్ధం చేయండి:  కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ (స్థానిక సంస్థలు) ఎన్నికలు సర్కారు పెద్దలు ఎప్పుడు నిర్వహిస్తారన్న విషయంలో తేదీల స్పష్టత ఇప్పటి వరకు ఏమాత్రం లేకపోయినప్పటికీ రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం ఓటరు జాబితా రూపకల్పనపై వేగంగా అడుగులు వేస్తున్నది. ఇందుకుగాను గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా ఓటర్ల జాబితా రూపకల్పనకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) గురువారం అన్ని జిల్లా కలెక్టర్లు (హైదరాబాద్ మినహా), అడిషనల్ కలెక్టర్లు (స్థానిక సంస్థలు), జిల్లా పంచాయతీ అధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారులు, అసెంబ్లీ నియోజక వర్గాల ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పార్థసారథి మాట్లాడుతూ.. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా(ఈసీఐ) తయారు చేసిన అసెంబ్లీ నియోజకవర్గాల ఓటరు లిస్టులను యథావిధిగా పరిగణలోకి తీసుకొని వార్డుల వారీగా, గ్రామ పంచాయతీ వారిగా ఓటరు లిస్టులను తయారు చేసి ముసాయిదా జాబితాను సెప్టెంబర్ 6న గ్రామ పంచాయతీలలో ప్రచురణ చేయాలని ఆదేశించారు. తర్వాత మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశము ఏర్పాటు చేసి వారి సూచనలు, సలహాలు స్వీకరించాలని తెలిపారు. ఈ ముసాయిదా జాబితాలో వార్డు వారీగా లేదా పంచాయతీ వారీగా ఓటర్లను అమర్చడములో ఏవైనా పొరపాట్లు జరిగితే సెప్టెంబర్ 13 వరకు సంబంధిత మండల పరిషత్ అధికారులకు లేదా జిల్లా పంచాయతీ అధికారులకు రాత పూర్వకంగా తెలపాలని సూచించారు.

వాటిని లోతుగా పరిశీలించి ఆ అధికారులు తగిన చర్యలు తీసుకొని సవరించిన తుది ఓటర్ల జాబితాను సెప్టెంబర్ 21న ప్రచురించాలని ఆదేశించారు. ఒకవేళ ఎవరైనా అర్హులైన ఓటర్లు తమ పేర్లను గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాలో చేర్చుకోవాలన్నా, ఎవరైనా ఓటరు పంచాయతీ ఓటరు లిస్టులో కొనసాగించడానికి ఆక్షేపణలు ఉన్నా, వారు నిర్దేశించిన ఫారంల యందు సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారికి అప్లై చేసుకోవాలని, సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గములో ఆ ఓటరు చేర్పు, తొలగింపు జరిగిన తర్వాతనే గ్రామపంచాయతీ ఓటరు లిస్టులో పరిగణలోకి తీసుకుంటారని తెలియజేశారు.

ఓటరు లిస్టుల తయారీ తర్వాత, వార్డు వారిగా పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, పోలింగ్ సిబ్బంది వివరాల సేకరణ, రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల నియామకం, పొలింగ్ సిబ్బంది శిక్షణ తదితర విషయాల గూర్చి వివరించారు. వీటన్నింటికి రాష్ట్ర ఎన్నికల సంఘం తయారు చేసిన సర్క్యులర్ తూ.చా తప్పకుండా పాటించాలని తెలియజేశారు. తర్వాత జిల్లాల వారీగా జరుగుతున్న ఓటరు లిస్టుల తయారీల పురోగతి, ఇబ్బందుల గూర్చి జిల్లా కలెక్టర్ల నుంచి వివరాలు సేకరించారు.

సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వారి సహకారంతో తయారు చేసిన ‘గ్రివెన్స్ మాడ్యూల్’ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆవిష్కరించారు. ఈ మాడ్యూల్ ద్వారా ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్న అవకతవకలు, నిబంధనల ఉల్లంఘనలపై సాధారణ పౌరులు కూడా ఫిర్యాదు చేయవచ్చని, అట్టి ఫిర్యాదుదారుడి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని, ఆ ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ స్వయంగా పర్యవేక్షించి తగిన చర్యలు తీసుకుని ఫిర్యాదుదారుడికి తెలుపుతారని వెల్లడించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఉన్నతాధికారులు లోకేష్ కుమార్, అనితా రామచంద్రన్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed