- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
BIG News: ధరణి అప్లికేషన్లు మాయం..! పోర్టల్‌లో టెక్నికల్ ఇష్యూస్
దిశ, తెలంగాణ బ్యూరో: పాస్‌బుక్‌లో భూ విస్తీర్ణం తక్కువగా వచ్చిందని, సరి చేయాలంటూ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడులో ఓ పట్టాదారుడు రెండేళ్ల కింద ధరణిలో అప్లయ్ చేసుకున్నాడు. ఎన్నో నెలలకు పహాణీలు, ఆర్వోఆర్ రికార్డులు వెరిఫై చేసిన తహసీల్దార్.. ‘ఆర్ఎస్ఆర్‌లో ఎలాంటి తేడా లేదు.. ఆయన సేల్ డీడ్స్ కూడా కరెక్టుగానే ఉన్నాయి. ఆయనకు రావాల్సిన విస్తీర్ణం పాసుబుక్‌లో చేర్చాలి’ అంటూ రికమెండ్ చేశారు. కొన్ని నెలల తర్వాత ఆర్డీవో కూడా పరిశీలించి రికమండ్ కూడా చేశారు. ఇక అప్లికేషన్ అదనపు కలెక్టర్ దగ్గరికి వెళ్లగా ఇప్పుడు ఆ ఫైల్ మాయమైంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం బాకారం జాగీర్‌లో ఓ రైతు తన భూమిని పీవోబీలో పెడితే రెండేళ్ల క్రితం దరఖాస్తు చేసుకున్నాడు. తన పట్టా భూమికి అవసరమైన అన్ని పత్రాలు సమర్పించాడు. ఇక సమస్యకు పరిష్కారం లభిస్తుందనుకుంటుండగా అప్లికేషన్ మాయమైంది
ధరణి లో సాంకేతిక సమస్యల కారణంగా ఇలా అనేక అప్లికేషన్లు మాయమవుతున్నాయి. టెక్నికల్ ఇష్యూస్ తో దరఖాస్తులు కనిపించకుండా పోతున్నాయి. అప్లయ్ చేయక ముందు ఉన్న పరిస్థితే వెబ్‌సైట్‌లో కనిపిస్తోంది. ట్రాన్సాక్షన్ స్టేటస్‌లో పెండింగ్ అని కాకుండా ఖాళీగా చూపిస్తుంది. దానికి తామేం చేయాలని అధికారులు నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారు. మరోవైపు సమస్య పరిష్కారానికి ఏండ్లుగా అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న దరఖాస్తుదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రాబ్లమ్ సాల్వ్ కావడానికి ఇన్నాళ్లు చేసిన శ్రమ అంతా వృథా అవుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మళ్లీ మొదటికేనా?
సమస్య పరిష్కారానికి దరఖాస్తుదారులు రెండేండ్లుగా అధికారుల చుట్టూ తిరిగారు. ఖర్చు పెట్టుకున్నారు. రికార్డులన్నీ చూసి వారి పాసు బుక్ లో మిస్సయిన విస్తీర్ణం, సర్వే నంబర్ల గురించి రిపోర్ట్ రాయించుకున్నారు. ప్రభుత్వ భూమి కాదని, సీలింగ్ భూమితో సంబంధం లేదని తేలినా.. అధికారులు దాటవేత ధోరణిని అవలంభించారు. ఇప్పుడు దరఖాస్తులు మాయం అవుతుండంతో మళ్లీ అప్లయ్ చేయాల్సి వస్తుందేమోనని బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్య ప్రధానంగా రంగారెడ్డి జిల్లాలోనే అధికంగా కనిపిస్తున్నది. ప్రస్తుతానికి కొందరే తమ అప్లికేషన్లు ఉన్నాయా? లేవా? అని చెక్ చేసుకోగా ఈ విషయం బయటపడింది. దీంతో అసలు ఎంత మంది దరఖాస్తులు మాయమయ్యాయో అంతు చిక్కడం లేదు.
అధికారులకు లేని స్పష్టత
కనిపించకుండా పోయిన దరఖాస్తుల గురించి రెవెన్యూ అధికారులకూ స్పష్టత లేకుండాపోయింది. టెక్నికల్ ఇష్యూస్ అంటున్నారే తప్ప నిర్దిష్టంగా పరిష్కారమేమి చూపించడం లేదు. దీనిపై రంగారెడ్డి జిల్లా అధికారులను సంప్రదిస్తే ‘ఎవరి ఫైళ్లు వెబ్ సైట్ లో కనిపించడం లేదో, వారు అప్లయ్ చేసుకున్న మీ సేవ కేంద్రానికి వెళ్లాలి’ అని దరఖాస్తుదారులకు సమాచారమిస్తున్నారు. అక్కడికి వెళ్తే ‘అది టెక్నికల్ ఇష్యూ.. మా దగ్గర ఏముండదు’ అని వారు సమాధానమిస్తున్నారు. దీంతో మళ్లీ అధికారులను అడిగితే టెక్నికల్ నిపుణులతో చర్చించి టీఎం33 లో బీ ఆప్షన్ కింద అప్ లోడ్ చేస్తే ఫైల్ యథావిధిగా కలెక్టర్ లాగిన్ కి వచ్చేస్తుందంటున్నారు. అధికారుల సూచనలు పాటించినా లాగిన్ లోకి రావడం లేదు. సరైన గైడ్ చేయకుండా దరఖాస్తుదారులను అధికారులు ఇబ్బంది పెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
రికమండేషన్‌కి ససేమిరా
రాష్ట్ర వ్యాప్తంగా రికమండెడ్ ఫైళ్ల సంఖ్య 10 శాతం కూడా లేదని సమాచారం. తహశీల్దార్లు, ఆర్డీవోలు రికమండ్ చేస్తూ ఫైల్ అదనపు కలెక్టర్లు, కలెక్టర్లకు పంపినా వాళ్లు వాటిని పరిశీలించడం లేదు. రెండేండ్ల క్రితం రికమండ్ చేస్తూ పంపిన ఫైళ్లపైనా అండర్ వెరిఫికేషన్ అని చూపించింది. ఇప్పుడేమో అసలు కనిపించడం లేదు.
పెండింగ్‌లో పెట్టడంతోనే..
సమస్యను అప్పటికప్పుడు పరిష్కరించకుండా పెండింగ్ లో పెట్టడంతోనే ఇలాంటి పరిస్థితి ఎదురవుతున్నదని దరఖాస్తుదారులు వాపోతున్నారు. తహశీల్దార్, ఆర్డీవో స్థాయి అధికారులు రికార్డులు వెరిఫై చేసి, రికమండ్ చేస్తూ రిపోర్ట్ పంపినా.. అనేక అప్లికేషన్లను కలెక్టర్, సీసీఎల్ఏ స్థాయిలో పెండింగులో ఉంచారు. స్పెషల్ రెవెన్యూ డ్రైవ్ లోనూ రికమండ్ ఫైళ్లకు మోక్షం కలగలేదు. డ్యాష్ బోర్డు క్లియర్ చేసి, నాలుగు నెలల్లో లక్షకు పైగా దరఖాస్తులు పరిష్కరించినట్లు డేటా పంపారు. నిజానికి వాటిలో సింహభాగం తిరస్కరించినవే కావడం విశేషం. ఇప్పటికీ ఎన్ని దరఖాస్తులకు పరిష్కారం చూపారన్న వాస్తవ లెక్కలు అధికారుల దగ్గర లేకపోవడం గమనార్హం.