BIG News: కమర్షియల్ ట్యాక్స్ స్కామ్‌.. త్వరలో సోమేశ్ కుమార్‌కు నోటీసులు..!

by Shiva |
BIG News: కమర్షియల్ ట్యాక్స్ స్కామ్‌.. త్వరలో సోమేశ్ కుమార్‌కు నోటీసులు..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్‌కు త్వరలో పోలీసులు నోటీసులు జారీ చేయనున్నారు. ఇందుకు అవసరమైన కసరత్తు మొదలైంది. ఎంక్వయిరీకి హాజరుకావాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొనడంపై ఇన్వెస్టిగేషన్ టీమ్ ఆలోచనలు చేస్తున్నది. నోటీసులు ఎప్పుడు జారీ అవుతాయనే స్పష్టతను పోలీస్ ఆఫీసర్లు వెల్లడించకపోయినా ఏ రోజైనా ఇచ్చే అవకాశమున్నదనే మాటలు వినిపిస్తున్నాయి. కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ రవి కానూరి గత నెల 26న పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనను ఏ-5గా చేరుస్తూ ఎఫ్ఐఆర్ నమోదైంది. ఐపీసీలోని 406, 409, 120-బి సెక్షన్లతో పాటు ఐటీ యాక్టులోని సెక్షన్ 65 కింద ఆయన మీద అభియోగాలను నమోదు చేశారు. ప్రాథమిక విచారణ చేపట్టిన ఇన్వెస్టిగేషన్ టీమ్ నోటీసులు ఇచ్చి ఆయన నుంచి వాంగ్మూలాన్ని రికార్డు చేసే అవకాశమున్నదని పోలీసుల సమాచారం.

ఖజానాకు నష్టం వాటిల్లేలా నిర్ణయాలు

జీఎస్టీ రిటర్న్స్ విషయంలో కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ హోదాలో ఉన్న అప్పటి చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్ ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ఖజానాకు నష్టం చేకూర్చే తరహాలో నిర్ణయాలు తీసుకున్నారని ఆయనపై జాయింట్ కమిషనర్ ఫిర్యాదు చేశారు. దాదాపు రూ.1,400 కోట్ల మేర ఖజానాకు నష్టం వాటిల్లిందని పేర్కొనడం గమనార్హం. సోమేశ్ కుమార్‌తో పాటు కమర్షియల్ ట్యాక్స్ విభాగంలో పనిచేస్తున్న అడిషనల్ కమిషనర్ ఎస్వీ కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ శివరామ్‌ప్రసాద్, సాఫ్ట్‌వేర్ రూపొందించిన హైదరాబాద్ ఐఐటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్‌బాబు, సాఫ్ట్‌వేర్‌ను మెయింటెనెన్స్ చేసే ప్లియాంటో టెక్నాలజీస్ ప్రతినిధులను ఏ-1 నుంచి ఏ-4గా పోలీసులు ఆ ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. సోమేశ్‌కుమార్‌తో పాటు వీరందరికీ పోలీసులు త్వరలో నోటీసులు జారీచేసి వివరణ తీసుకునే అవకావమున్నది.

కంపెనీలను హిడెన్ లిస్టులో పెట్టి వ్యవహారం

దాదాపు 75 కంపెనీలను సాఫ్ట్‌‌‌‌‌వేర్ ద్వారా హిడెన్ లిస్టులో పెట్టి అవి సమర్పించాల్సిన జీఎస్టీ రిటర్న్స్ వివరాలు అధికారులకు అందుబాటులో లేకుండా చేసే పథకంలో సోమేశ్ కుమార్ ప్రమేయం ఉన్నదని, ఆయన ఆదేశాల మేరకే ఈ మార్పులు చేసినట్టు శోభన్‌బాబుతో సహా కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు పేర్కొన్నట్టు ఎఫ్ఐఆర్‌లో పోలీసులు ఉదహరించారు. ఆ వివరాలు సాఫ్ట్‌వేర్‌లో కనిపించకపోవడంతో కమర్షియల్ ట్యాక్స్ విభాగంలోని సంబంధిత అధికారులు నిర్దిష్ట గడువులోగా ఆ కంపెనీల నుంచి పన్నును వసూలు చేయలేకపోయారని, ఫలితంగా ఖజానాకు రూ.1,400 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు అసిస్టెంట్ కమిషనర్ రవి కానూరి ఆ ఫిర్యాదులో పేర్కొన్న విషయాన్ని ఎఫ్ఐఆర్‌లో పోలీసులు ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చి పెట్టాల్సిన బాధ్యతల్లో ఉన్న సోమేశ్ కుమార్ ఆర్థిక అవకతవకలకు పాల్పడి ఖజానాకు నష్టం చేకూర్చినందున పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఆసక్తికరంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed