గోల్కొండ ఖిలా కాడ గోల్‌మాల్.. రూ.300 కోట్లు విలువ చేసే స్థలంపై కన్ను!

by GSrikanth |   ( Updated:2022-09-13 04:44:58.0  )
గోల్కొండ ఖిలా కాడ గోల్‌మాల్.. రూ.300 కోట్లు విలువ చేసే స్థలంపై కన్ను!
X

గొల్కొండ కోటకు సమీపంలో సుమారు రూ. 300 కోట్లు పలికే 5.20 ఎకరాల స్థలంపై నాలుగు బడా కంపెనీల కన్ను పడింది. ఇనాం పట్టాగా పేర్కొంటూ ఆక్యుపెన్సీ రైట్స్ సర్టిఫికేట్ (ఓఆర్సీ) తీసుకోకముందే తక్కువ ధరకు కొనుగోలు చేశారు. ఇప్పుడు ఓ ఆర్సీ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఉన్నతాధికారులు సైతం ఈ జాగాను కట్టబెట్టేందుకు రెడీ అయ్యారు. అధికార పార్టీ అగ్రనేతలతో సంబంధాలున్న సదరు కంపెనీ ఫైలు హైదరాబాద్​కలెక్టరేట్లో చకచకా కదులుతున్నది. సర్కారు భూమిని కాపాడాల్సిన అధికారులు కంచే చేను మేసిన చందంగా వ్యవహరిస్తున్నారు. అడ్డొచ్చిన అధికారులపై బదిలీ వేటు వేస్తున్నారు. ఆ కంపెనీలు ఎవరివి..? వాటి వెనుక ఉన్నదెవరు..?

దిశ, తెలంగాణ బ్యూరో: ఓ వైపు చారిత్రక గోల్కొండ కోట, మరో వైపు తారామతి బారాదారి, ఇంకో పక్కన టూరిజం హోటల్.. కాస్త దూరంలోనే నార్సింగి చౌరస్తా... ఆ జాగా విలువ అక్షరాలా రూ. 300 కోట్లు.. ఈ స్థలంపై నాలుగు బడా కంపెనీల కన్ను పడింది. ఇనాం పట్టా భూమి అంటూ ఓ ఆర్సీ తీసుకోకముందే కొనుగోలు చేశాయి. ఇప్పుడు ఆక్యుపెన్సీ రైట్స్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. అత్యంత ఖరీదైన ఈ స్థలానికి హక్కులు కట్టబెట్టేందుకు సర్కారు పెద్దలు రంగం సిద్దం చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. రాజకీయ అండదండలతో సదరు కంపెనీల యజమానులు పావులు కదుపుతున్నారన్న ఆరోపణలున్నాయి. 2005వ సంవత్సరం నుంచి పెండింగ్ లో ఉన్న ఈ ఫైళ్లకు ఇప్పుడు రెక్కలొచ్చాయి. ఉన్నతాధికారుకూడా ఆ కంపెనీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. స్థానిక అధికారి మాత్రం ససేమిరా అంటున్నారు. ప్రభుత్వ భూమిని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తుండడం విశేషం. తన పై అధికారి ఆర్డీవో జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేసేందుకు ఇష్టపడలేదు. వాటిపై అప్పీల్ కు వెళ్లారు. తాము ఇచ్చిన ఆర్డర్లను అమలు చేసేందుకు కష్టమేమిటంటూ పై నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. ఇంకేముంది? ఉన్నతాధికారులకు, పెద్ద మనుషులకు అది కోపాన్ని తెప్పించింది. ఆ అధికారిపై బదిలీ వేటు పడింది. కలెక్టరేట్ కే పంపారు. అక్కడా వారి ఫైలుకు సంబంధించిన సెక్షన్ బాధ్యతలను అప్పగించారు. దాంతో మళ్లీ కొర్రీ పడుతుందని గ్రహించిన పెద్దలు అక్కడి నుంచి 20 రోజుల్లో నుంచి బదిలీ చేయించారు. మరో సెక్షన్ కి పంపడంలో సక్సెస్ అయ్యారు. ప్రభుత్వ భూమిని కాపాడాలనుకున్న సదరు తాసిల్దార్ ను బదిలీ చేయడం విస్మయానికి గురి చేసింది. ఆ అధికారి వెళ్లిన తర్వాత పనులు యుద్ధప్రాతిపదికన చేయించుకునేందుకు రూట్ క్లియర్ అయ్యింది. ఇప్పుడిక అడ్డు చెప్పే వారెవరూ లేరని హైదరాబాద్ ​కలెక్టరేట్ లో ఫైళ్లు వేగంగా కదులుతున్నాయని తెలిసింది. ల్యాండ్ బ్యాంకులో ప్రభుత్వానిదిగా పేర్కొన్నదే. ఇప్పుడెందుకు అధికారులు ఉత్సాహం చూపిస్తున్నానేది చర్చనీయాంశంగామారింది.

అప్పీల్‌కి వెళ్లిన తాసిల్దార్

హైదరాబాద్​జిల్లా గోల్కొండ మండలం ఇబ్రహీంబాగ్ రెవెన్యూ పరిధిలోని సదరు భూమి ప్రభుత్వానిదే.! చాలా ఏండ్లుగా ప్రభుత్వ ల్యాండ్ బ్యాంక్ ఖాతాలో పేర్కొన్నారు. ప్రైవేటు కంపెనీ వ్యక్తులకు అనుకూలంగా జారీ చేస్తూ హైదరాబాద్​ఆర్డీవో జారీ చేసిన 10కి పైగా ఉత్తర్వులపై గోల్కొండ తాసిల్దార్ అప్పీల్ కు వెళ్లారు. ఇక వాటిపై నాలుగు నెలలుగా వాదనలు వింటున్నారు. మార్చి 26న, ఏప్రిల్ 16న, మే 7న.. ఇలా వెంటవెంటనే కేసు టేబుల్ మీదికి రావడం గమనార్హం. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ పలుకుబడి కలిగిన వ్యక్తి ల్యాండ్ బ్యాంక్ నుంచి సదరు స్థలాన్ని తొలగించాలంటూ దరఖాస్తు చేసుకున్నారని, దానిపై వాస్తవ నివేదికను పంపాలంటూ హైదరాబాద్​ ఆర్డీవో, గోల్కొండ తాసిల్దార్ ను ల్యాండ్ ప్రొటెక్షన్ విభాగం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితికి సంబంధించిన ఫొటోగ్రాఫ్స్ తో సహా సమర్పించాలన్నారు. నగరంలో ఇనాం ఓఆర్సీ ఇవ్వడం చెల్లదని స్పష్టం చేశారు. అధికారుల ఒత్తిడి పెరిగింది. దాంతో హైదరాబాద్​ ఆర్డీవో జారీ చేసిన ఉత్తర్వులపై గోల్కొండ తాసిల్దార్ అప్పీల్ కు వెళ్లడం విశేషం. ఉన్నతాధికారులు ప్రైవేటు పార్టీకి అనుకూలంగా ఉంటే మండల స్థాయి అధికారులేమో సర్కారు స్థలాన్ని కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

కథ నడుస్తుందిలా

– హైదరాబాద్​ జిల్లా గోల్కొండ మండలం ఇబ్రహీంబాగ్ రెవెన్యూ పరిధిలోని 18 సర్వే నంబర్లలో సుమారు 5.20 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. ఇక్కడ ఎకరం ధర రూ.50 కోట్లు వేసుకున్న మొత్తం విలువ రూ.300 కోట్లు. ఇక హైరైజ్ ప్రాజెక్టు చేపడితే వచ్చే మొత్తం రూ.1000 కోట్ల పైమాటే. ఆ భూమి అంతా ఇనాం చట్టం రద్దయిన తర్వాత సర్కారు ఖాతాలోకి చేరింది. దాన్ని కొన్ని దశాబ్దాలుగా ల్యాండ్ బ్యాంకులో స్పష్టంగా పేర్కొన్నారు. అత్యంత ఖరీదైన ఈ భూములపై ఓ నాలుగు రియల్ ఎస్టేట్ కంపెనీల కన్ను పడింది.

– ఆ భూమి మొత్తం నగరంలోనే కలిసిపోయింది. అలాంటప్పుడు ఇనాం చట్టం కింద ఓఆర్సీ ఇవ్వడం కుదరదని ఏనాడో తేల్చారు. వ్యవసాయ భూమి కానప్పుడు ఇనాం పట్టాలు అంటూ ఎన్వోసీల కోసం బడా కంపెనీలు అధికారులపై ఒత్తిడి చేస్తున్నాయని సమాచారం. ఇనాం అబాలిషన్ చట్టం, 1955, సెక్షన్ 4 ప్రకారం వారి విజ్ఞప్తిని తిరస్కరించారు. అయినా విశ్రమించకుండా హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

– 2017 లో హైదరాబాద్​ఆర్డీవో జారీ చేసిన ఆర్డర్లను 2019 లోనే జాయింట్ కలెక్టర్ పక్కన పెట్టారు. అప్పటికే రెవెన్యూ రికార్డుల్లో సదరు భూముల క్లాసిఫికేషన్ మాఫీ ఇనాం, దస్తగర్దారీ, చౌతాఇనాం, సర్కారీ, అయ్యవారి ఇనాం, దర్జీ ఇనాంగా పేర్కొన్నారు. ఓ మూడు గుంటలపై మాత్రం పట్టా అని ఉంది.

ఓఆర్సీ రాకుండానే కొనుగోళ్లు

నగరంతో కొన్ని దశాబ్దాల క్రితమే కలిసిపోయింది. దాంతో ఆర్డీవో ఆర్డర్స్ ఇవ్వడం సరైంది కాదంటూ తాసిల్దార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నాన్ అగ్రికల్చర్ గా కొనుగోలు చేసి ఇనాం కింద ఆక్యుపెన్సీ రైట్స్ సర్టిఫికేట్(ఓఆర్సీ) ఇవ్వమనడం చెల్లదన్నారు. దీనికి సంబంధించి చట్టంలోని అన్ని సెక్షన్లను ఉటంకించారు. గతేడాది జనవరి, ఫిబ్రవరి నెలలో జారీ చేసిన ఉత్తర్వులను నవంబరు నెలలో సర్క్యులేట్ చేయడం విస్మయానికి గురి చేసింది. పైగా 1955లోనే ఆ ల్యాండ్ వ్యవసాయేతర పనులకు వినియోగించినట్లు ఆధారిత అధికారుల నివేదికలో స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ రక్షణలోనే ఉంది. ఏనాడూ నాన్ అగ్రికల్చర్ గా మార్చలేదు. కానీ రిజిస్ట్రేషన్లు మాత్రం నాన్ అగ్రికల్చర్ గా చేసుకున్నారు. రెవెన్యూ నుంచి ఓఆర్సీ పొందకుండానే ఇనాందార్లు అమ్మడానికి వీల్లేదని చట్టం చెబుతున్నది. ఇందులో చట్ట ఉల్లంఘనలు చోటు చేసుకున్నట్లు అప్పటి తాసిల్దార్ ఉన్నతాధికారులకు రిపోర్టు చేశారు. మరికొద్ది రోజుల్లోనే ప్రైవేటు కంపెనీలకు అనుకూలంగా ఓఆర్సీలు జారీ చేస్తారని సమాచారం. అత్యంత ఖరీదైన స్థలాన్ని కాపాడి ప్రజాప్రయోజనాల కోసం వినియోగించాల్సిన ప్రభుత్వ యంత్రాంగం ఈ అంశాన్ని పట్టించుకోవాలని నిజాయితీ కలిగిన రెవెన్యూ అధికారులు కోరుతున్నారు.

Also Read : మునుగోడులో బీజేపీ సీక్రెట్ ఆపరేషన్.. రహస్యంగా నేతల కదలికలు


Advertisement

Next Story

Most Viewed