Bhu Bharathi: ‘భూ భారతి’తో ‘పార్ట్-బీ’కి సొల్యూషన్..! ‘సర్కారీ’గా నమోదైన పట్టా ల్యాండ్స్

by Shiva |
Bhu Bharathi: ‘భూ భారతి’తో ‘పార్ట్-బీ’కి సొల్యూషన్..! ‘సర్కారీ’గా నమోదైన పట్టా ల్యాండ్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షలాది ఎకరాలను పార్ట్-బీ కింద చేర్చింది. కొత్త పాస్ పుస్తకాలు జారీ చేయలేదు. ధరణిలోనూ అప్ లోడ్ చేయలేదు. సమస్య పరిష్కారానికి దరఖాస్తు చేసుకున్నా.. ఐదేళ్లుగా పెండింగులోనే ఉన్నాయి. ఈ సమస్యను భూభారతి ద్వారా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అంతేకాకుండా సాదాబైనామా, కాస్తుకాలమ్ పునరుద్ధరణ, ఇతర పెండింగ్ అప్లికేషన్లను త్వరితగతిన క్లియర్ చేసేందుకు రెడీ అవుతున్నది. పెండింగులో ఉన్న లక్షలాది అప్లికేషన్లు, లక్షలాది ఎకరాలకు సంబంధించిన భూ సమస్యల పరిష్కారానికి భూభారతిలో ప్రభుత్వం పరిష్కారమార్గాలను పేర్కొన్నది.

రికార్డుల్లో ఎక్కని 18.45 లక్షల ఎకరాలు..

భూ రికార్డుల ప్రక్షాళన సందర్భంగా ప్రతి గ్రామంలోనూ వివాదాల కారణంగా పదుల సంఖ్యలో పార్ట్-బీ భూములుగా ప్రకటించారు. కొన్నేమో భూ వివాదాలు ఉన్నాయని, మరి కొన్నేమో సర్వే నంబర్ల, రికార్డుల్లోని విస్తీర్ణానికి మధ్య వ్యత్యాసం ఉందంటూ నిలిపివేశారు. ధరణి పోర్టల్ అమలులోకి వచ్చాక.. వివిధ కారణాలు చూపి ఏకంగా 18.45 లక్షల ఎకరాల భూమిని రికార్డుల్లోకి ఎక్కించలేదు. ఐదేండ్ల నుంచి పెండింగులో ఉంచడం వల్ల 18 లక్షల ఎకరాలకు సంబంధించిన ఇష్యూస్ ఎటూ తేలడం లేదు. అందులో సుమారు 5 లక్షలకు పైగా పట్టా భూములు ఉన్నాయి. వాటి పరిష్కారానికి ఎలాంటి మార్గాన్ని చూపలేదు. ఇప్పటికే ఉన్న కేసుల పరిష్కారానికి ప్రత్యేక ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కానీ ఆచరణలో కనిపించలేదు. వారంతా వివిధ మాడ్యూళ్ల కింద దరఖాస్తు చేసుకున్నా న్యాయం జరగడం లేదు. ఇలా 1.40 లక్షల ఖాతాదారులు అంటే.. అన్ని కుటుంబాలు భూమి హక్కులు పొందలేకపోయారు.

పార్ట్-బీ ల్యాండ్స్

కారణం విస్తీర్ణం(ఎకరాల్లో)

ఆధార్ ఉండి బయోమెట్రికల్ లేనిది - 24,942

ఆధార్ తప్పులు - 29,712

ఆధార్ఇవ్వనిది - 2,59,515

ఆధార్లేకుండా..(ఎన్ఆర్ఐ, కంపెనీలు) - 28,392

విస్తీర్ణం తక్కువ/ఎక్కువ - 49,328

ఇనాం కింద సెటిల్ కానిది - 14,619

భూదాన్ ల్యాండ్ - 2,932

ఎండోమెంట్ - 15,994

వక్ఫ్ ల్యాండ్ - 9,632

ఫారెస్ట్(రెవెన్యూ రికార్డుల్లో) - 34,612

ఫారెస్ట్. సరిహద్దు వివాదాలు - 21,673

ప్రభుత్వ భూమి - 93,308

గవర్నమెంట్ అసెట్. కంప్లీట్ సర్వే నంబర్ - 8,018

గవర్నమెంట్ అసెట్. పార్టిలీ సర్వే నంబర్ - 4,381

ఫుల్ సర్వే నంబర్ అక్వయిర్డ్ - 4,447

పార్టిలీ సర్వే నంబర్ అక్వయిర్డ్ - 1,822

అనధికారిక కబ్జా - 16,879

సివిల్ కోర్టు కేసులు - 34,755

విరాసత్ లో వివాదాలు - 29,651

ఎల్ టీఆర్ కేసులు - 31,155

పీవోటీ కేసులు - 78,543

రెవెన్యూ కోర్టు కేసులు - 27,880

సాదాబైనామా కేసులు - 1,04,859

సోల్డ్ అవుట్ - 1,37,475

నాలా కంప్లీట్ సర్వే నంబర్లు - 1,38,139

రీజన్ నాట్ స్పెసిఫైడ్ - 5,07,091

విపక్షాల అభ్యంతరాలు

భారతిలోని వివిధ అంశాలపై బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. పార్ట్-బీ దరఖాస్తులను పరిశీలించి క్లియర్ చేయొద్దంటూ శాసనమండలిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు. అవి ప్రభుత్వ భూములని గుర్తించిన తర్వాతే తాము వాటిని పార్ట్-బీ కింద నమోదు చేసి పాసు పుస్తకాలు జారీ చేయకుండా నిలిపివేశామని సమర్థించుకున్నారు. ఇప్పుడు వాటిని పరిష్కరించే ప్రక్రియ మొదలుపెడితే ఇబ్బందులు అంటూ పేచీ పెట్టారు. మరోవైపు భూదార్, స్వమిత్వ వంటి పథకాలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినవే కాగా, ఇక్కడి బీజేపీ ఎమ్మెల్యేలు దానిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని, ఆ పేరుతో రైతుల్లో గందరగోళం సృష్టిస్తున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వ భూమి నిర్వచనంలో ప్రతి సందర్భంలోనూ వక్ఫ్ అనే పదాన్ని చేర్చాలంటూ ఎంఐఎం పార్టీ సలహా ఇస్తున్నది. అంతేకాకుండా సర్వేయర్లకు సబ్ డివిజన్ చేసే అధికారం, సాదాబైనామాల దరఖాస్తుల క్లియరెన్స్, కాస్తు కాలమ్ పునరుద్ధరణ, అప్పీల్ వ్యవస్థలపైనా విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే కొత్త ఆర్వోఆర్ చట్టంపై విపక్షాల అభ్యంతరాలకు భూ భారతి రూపకర్త, రెవెన్యూ చట్టాల నిపుణుడు ఎం.సునీల్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీ, మండలిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా సమాధానాలిచ్చారు.

ప్రతి పనికీ టైం లిమిట్ ఉండాలి

ప్రతి పనిని నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తి చేయాలన్న నిబంధనలు ఉండాలి. ఇదే అంశాన్ని బీఆర్ఎస్, బీజేపీలు వాదిస్తున్నాయి. న్యాయమైన డిమాండ్. లేదంటే అధికారులు వచ్చిన దరఖాస్తులను ఎంత కాలమైనా వారి లాగిన్ లోనే ఉంచుకొని కాలయాపన చేసే అవకాశాలు ఎక్కువ. భూ భారతి బిల్లులో ఈ అంశం ఉంది. ఐతే ప్రిస్క్రైబ్డ్ టైం అనే మాటతో ముగించారు. ఏ పని ఎంత కాలంలో చేయాలి? ఎవరు చేయాలి? ఇవన్నీ రూల్స్ లో వస్తాయంటున్నారు.

అనుమానాలు.. జవాబులు

1. సర్వేయర్లు సర్వే చేసి సబ్ డివిజన్ చేసే అధికారం లేదు. అలాంటప్పుడు అధికారాన్ని ఎలా కట్టబెడతారు?

2006 లో వీకే అగర్వాల్ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం చేయొచ్చు. సబ్ డివిజన్ చేయడానికి అవకాశం ఉంది. సర్వే మ్యాప్, సబ్ డివిజన్ చట్టం అమల్లోకి రాగానే ఆ నిబంధన అమల్లోకి రాదు. ప్రిస్క్రైబ్డ్ డేట్ అని పేర్కొన్నారు. అంటే దానికి సంబంధించిన వ్యవస్థ రూపకల్పన తర్వాతే అమలవుతుంది.

2. మ్యుటేషన్ ఆర్డర్ జారీ చేయనప్పుడు.. అంటే అంతా ఆన్ లైన్ లోనే జరుగుతున్నప్పుడు అప్పీల్ కి ఎలా వెళ్లాలి?

ఆర్వోఆర్-1971 చట్టం ప్రకారం కూడా ఆర్డర్ కాపీ లేకపోయినా రికార్డుల్లో చోటు చేసుకున్న మార్పులపై అప్పీల్ కి వెళ్లొచ్చు. అలాగే ఆన్ లైన్ రికార్డుల్లో మార్పు జరిగినప్పుడు స్పీకింగ్ ఆర్డర్ కాపీ లేకపోయినా అప్పీల్ కి వెళ్లొచ్చు. డిజిటల్ కాపీతోనూ ఉన్నతాధికారులను న్యాయం కోసం ఆశ్రయించే వీలుంది.

3. అప్పీల్ కంటే సివిల్ కోర్టులే బెటర్. ఇన్ని స్థాయిల్లో అప్పీల్ ఉండడం వల్ల అవినీతి పెరుగుతుంది?

రాజ్యాంగం ప్రకారం లేదా సహజ న్యాయ సూత్రాల ప్రకారం ఎక్కడైనా అన్యాయం జరిగిందని భావిస్తే అప్పీల్ చేసుకునే సదుపాయం ఉండాలి. ప్రతి సామాన్యుడు కోర్టుకే వెళ్లాలనడం చట్ట విరుద్ధం. అందుకే ఇందులో రెండంచెల అప్పీల్ వ్యవస్థనే ఉంది. తహశీల్దార్ చేస్తే ఆర్డీవోకు, ఆర్డీవో చేస్తే కలెక్టర్ కి అప్లయ్ చేసుకోవాలి.

4. ఆబాదీకి ప్రత్యేక రికార్డు అంటే ఆ ల్యాండ్స్ కొట్టేయ్యడానికేనని బీఆర్ఎస్ ఆరోపణ..

ఆబాదీలకు ప్రత్యేక రికార్డు నిర్వహించాలని, ప్రతి స్థలానికి ప్రాపర్టీ కార్డు (స్వమిత్వ) ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నిబంధన. ల్యాండ్ రికార్డులు ఎప్పుడైనా రెవెన్యూ శాఖ చూస్తుంది. అక్కడ ఇంటి అనుమతులు, ట్యాక్స్ కలెక్షన్లు స్థానిక సంస్థలు (పంచాయతీలు/మున్సిపాలిటీలు/కార్పొరేషన్లు) చేపడతాయి. ప్రాపర్టీ కార్డులు జారీ చేయడం ద్వారా వ్యాల్యూ పెరుగుతుంది. వాటి ద్వారా రుణాలు పొందేందుకు కూడా ఉపయోగపడుతాయి.

5. సాదాబైనామా దరఖాస్తులను పరిశీలించొద్దు. బీఆర్ఎస్, ఎంఐఎంల అభ్యంతరం.

నిజమే. సాదాబైనామాల కింద దరఖాస్తులను ఆహ్వానించేటప్పుడే అప్పటి ప్రభుత్వం ఆలోచించాలి. అవకాశం కల్పించిన బీఆర్ఎస్ నేతలే వాటిని పెండింగులోనే ఉంచాలని సూచిస్తున్నారు. మరి 9 లక్షల దరఖాస్తుదారులకు ఏం సమాధానం చెప్పాలన్నది ప్రశ్న. ఇప్పుడు రిజిస్ట్రేషన్ కే వెళ్లాలంటూ తిరస్కరిస్తే పరిస్థితులు ఎంత ప్రతికూలతకు దారి తీస్తుందో అంచనా వేయాలి. మరోసారి చాన్స్ లేకుండా కేవలం పెండింగ్ దరఖాస్తుల వరకే క్లియరెన్స్ కి చాన్స్ ఇస్తున్నట్లు భూ భారతి బిల్లులో స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed