Good News: విద్యుత్ శాఖ ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. ప్రమోషన్లు, బదిలీలపై భట్టి కీలక వ్యాఖ్యలు

by Prasad Jukanti |   ( Updated:2024-08-08 13:19:07.0  )
Good News: విద్యుత్ శాఖ ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్..  ప్రమోషన్లు, బదిలీలపై భట్టి కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: త్వరలో విద్యుత్ శాఖలో పదోన్నతులు, బదిలీలు చేపడతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. విద్యుత్ శాఖలో 7-8 ఏళ్లుగా ప్రమోషన్లు లేవని దీని వల్ల చాలా మంది ఉద్యోగులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని చెప్పారు. ఈ విషయం సంబంధింత అధికారులు తన దృష్టికి తీసుకువచ్చారని ఈ విషయంలో చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించానన్నారు. గురువారం హైదరాబాద్ లో టీజీఎస్పీడీసీఎల్‌పై ప్రధాన కార్యలయంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయంలో చేపట్టిన ప్రాజెక్టులలోని లోపాలను కాంగ్రెస్ పైకి నెట్టే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. కాళేశ్వరంతో పాటు సుంకిశాల కూలిన పాపం బీఆర్ఎస్ దే అని ధ్వజమెత్తారు. సుంకిశాల రిటైనింగ్ వాల్ ఘటన పాపం తమపై మోపాలని బీఆర్ఎస్ చూస్తున్నదని దుయ్యబట్టారు.

నల్గొండ జిల్లాలో నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్ లో నిర్మించిన సుంకిశాల ప్రాజెక్టును 11 జూలై 2021న గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించి జూలై 2023 న టన్నెల్ సైడ్ వాల్ పూర్తి చేశారని వివరించారు. ఇన్నాళ్లు వారు నిర్మించిన కాళేశ్వరంలోని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం మాత్రమే నాసిరకం అని అనుకున్నామని కానీ సుంకిశాల ఘటనతో వాళ్లు గోదావరినే కాదు కృష్ణ నదిని కూడా వదిలిపెట్టలేదని తేటతెల్లమైందని ఆరోపించారు. ఓ పత్రిక, టీవీ చానెల్, సోషల్ మీడియా చేతిలో ఉన్నదని తప్పుడు కథనాలు రాసి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే వారికి ప్రజలు బుద్ధిచెబుతారన్నారు. సుంకిశాల ఘటనను సీరియస్ గా తీసుకోవడంతో పాటు బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాన్నారు. సుంకిశాల ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించామని, దీనిపై విచారణ జరిపి దోషులను తేలుస్తామన్నారు. బీఆర్ఎస్ హయంలోని ప్రాజెక్టు డిజైన్లు లోపభూయిష్టంగా ఉన్నాయని ఆరోపించారు.

1912 హెల్ప్ లైన్ విస్తృతంగా ప్రచారం చేయండి..

హైదరాబాద్ లో అన్ని రంగాలకు నిరంతర విద్యుత్ అందివ్వాలని ఆదేశించామని భట్టి విక్రమార్క చెప్పారు. హైదరాబాద్ నగరం భారత దేశానికే తలమానికం అని అనేక మల్టీలెవల్ సంస్థలు ఈ నగరానికి వస్తున్నాయని చెప్పారు. ఆ కంపెనీలతో పాటు ప్రజలకు అంతరాయం లేకుండా నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందివ్వాలన్నారు. అమెరికా పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబులు పెట్టుబడిదారులతో మాట్లాడుతున్నారు. వారు నాణ్యమైన విద్యుత్తు, లా అండ్ ఆర్డర్, మంచినీటి వసతి అడుగుతున్నారు. హైదరాబాద్ లో పెట్టుబడులు పెడితే సంస్థలకు ఇబ్బందులు ఉండవనేలా వారికి నమ్మకం కలిగించే బాధ్యతు సిబ్బందిపై ఉందన్నారు. నాణ్యమైన విద్యుత్తు నిరంతరాయం అందిస్తే పరిశ్రమలు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, జీడీపీ పెరుగుతుంది అన్నారు. ఉద్యోగాలు రావాలని, జీవనస్థితిగతులు మారాలని, ప్రపంచంతో పోటీ పడాలని బాధ, ఆవేదనతో కోరి తెచ్చుకున్న రాష్ట్రం తెలంగాణ అన్న విషయాన్ని విద్యుత్ సిబ్బంది గమనంలో పెట్టుకొని నాణ్యమైన సేవలు అందించాలన్నారు. వర్షాల కాలంలో విద్యుత్ స్తంభాలు ఒరిగే అవకాశం ఉందని.. అందువల్ల నిరంతరం అప్రమత్తంగా ఉంటూ తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎవరికైనా విద్యుత్ సమస్యలు తలెత్తితే టోల్ ఫ్రీ నంబర్ 1912కు తెలిపారని నగర ప్రజలకు సూచించారు. ఈ హెల్ప్ లైన్ పై విస్తృతంగా ప్రచారం చేయాలని సిబ్బందికి సూచించారు.

Advertisement

Next Story