ఇకపై ప్రతి ఏటా ‘ప్రొఫెసర్ జయశంకర్ సాహిత్య జాగృతి పురస్కారం’: నవీన్ ఆచారి

by Satheesh |
ఇకపై ప్రతి ఏటా ‘ప్రొఫెసర్ జయశంకర్ సాహిత్య జాగృతి పురస్కారం’: నవీన్ ఆచారి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 12, 13 తేదీల్లో భారత జాగృతి సాహిత్య సభలు నిర్వహిస్తున్నామని, అలాగే ఇక నుంచి ప్రతి ఏటా ‘ప్రొఫెసర్ జయశంకర్ సాహిత్య జాగృతి పురస్కారం’ అందజేయనున్నట్లు భారత జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న సంస్థ భారత జాగృతి అని ఆయన అన్నారు. భారత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిర్ణయం మేరకు హైదరాబాద్‌లో రెండు రోజులపాటు సాహితీ సభలను నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.

వచ్చే నెల 12, 13 తేదీల్లో హైదరాబాద్‌లోని సారస్వత పరిషత్ ప్రాంగణంలో జరగనున్న ఈ సాహిత్య సభల్లో తెలుగు సాహిత్యంలోని అన్ని ప్రక్రియలపై రెండు రోజుల పాటు లోతైన సమాలోచనలు, పత్ర సమర్పణలు ఉంటాయన్నారు. జూన్ 12న ‘స్వరాష్ట్రంలో సాహితీ వికాసం’ పేరుతో సామావేశం ప్రారంభించనున్నట్లు ఆయన చెప్పారు. ఆరు సెషన్లలో అంశాలవారీగా జరిగే ఈ సభల్లో వివిధ రంగాలపై సాధికార అవగాహన కలిగిన, అధ్యయనం, పరిశోధన చేసిన సాహితీ మూర్తుల ప్రసంగాలు ఉంటాయని వెల్లడించారు.

13వ తేదీ సాయంత్రం ముగింపు సమావేశంతో సాహిత్య సభలు ముగుస్తాయన్నారు. ఈ సాహితీ సభల్లో భాగంగా తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసే రచనలు చేసిన ఒక సాహితీ మూర్తికి ‘ప్రొఫెసర్ జయశంకర్ సాహిత్య జాగృతి పురస్కారాన్ని’ అందజేయనున్నట్లు రంగు నవీన్ ఆచారి తెలిపారు.

Advertisement

Next Story