CM Serious: లగచర్ల రైతును బేడీలతో తీసుకెళ్లడంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్

by Prasad Jukanti |
CM Serious: లగచర్ల రైతును బేడీలతో తీసుకెళ్లడంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి (Lagacharla Incident) కేసులో అరెస్టు అయి సంగారెడ్డి సెంట్రల్ జైల్లో (Sangareddy Central Jail) ఉన్న రైతు హీర్యా నాయక్ ను చేతికి బేడీలతో ఆసుపత్రికి తీసుకు వెళ్లిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులను సీఎం ఆరా తీశారు. రైతుకు బేడీలు వేసి తీసుకెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై విచారణ జరిపి పూర్తి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇది ప్రజా ప్రభుత్వమని ఇలాంటి చర్యలను సహించబోమని ముఖ్యమంత్రి హెచ్చరించారు. గత నెల 11న లగచర్లలో కలెక్టర్ పై దాడి కేసులో పులిచర్లకుంట తండాకు చెందిన ఈర్యానాయక్ రిమాండ్ ఖైదీగా సంగారెడ్డి జైల్లో ఉన్నారు. అతడికి ఇవాళ గుండెపోటు లక్షణాలు కనిపించాయి. దీంతో జైలు సిబ్బంది వెంటనే అతడిని సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించాయి. అక్కడి నుంచి సెకండ్ ఒపీనియన్ కోసం గాంధీ ఆసుపత్రికి తరలిస్తామని అధికారులు చెప్పారు. కాగా ఆసుపత్రికి తరలించే సమయంలో ఈర్యా నాయక్ ను బేడీలతో తీసుకురావడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గుండెపోటు వస్తే అమానవీయంగా గొలుసులతో ఆసుపత్రికి తీసుకురావడం ఏంటని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి అధికారుల తీరుపై మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed