Sarpanch Elections: తెలంగాణ సర్పంచ్ ఎన్నికలు మరింత ఆలస్యం!

by Prasad Jukanti |   ( Updated:2024-11-16 13:26:34.0  )
Sarpanch Elections: తెలంగాణ సర్పంచ్ ఎన్నికలు మరింత ఆలస్యం!
X

దిశ, తెలంగాణ/ డైనమిక్ బ్యూరో: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను నిర్దేశించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ (Dedicated Commission) చైర్మన్ బూసాని వెంకటేశ్వరరావు (busani venkateswara rao) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు 3 ఉమ్మడి జిల్లాల్లో పర్యటించి బీసీ రిజర్వేషన్ల (BC Reservations) పై ప్రజాభిప్రాయాలు, అర్జీలు స్వీకరించామని, జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని చెప్పారు. అయితే నివేదిక ఇచ్చేందుకు గడువు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. ఇవాళ ఓ టీవీ చానల్‌తో మాట్లాడిన ఆయన పై వ్యాఖ్యలు చేశారు. కాగా, హైకోర్టు తీర్పును అనుగుణంగా ఈ నెల 4వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం విశ్రాంత ఐఏఎస్ బూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. నెల రోజుల్లో అధ్యయనం పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అయితే, నివేదిక ఇచ్చేందుకు కమిషన్ ప్రభుత్వాన్ని కోరితే ఆ ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ డిసెంబర్‌లోనే సర్పంచ్ ఎన్నికలు (Sarpanch elections) నిర్వహిస్తామని వచ్చే సంక్రాంతి నాటికి అన్ని గ్రామాల్లోకి కొత్త సర్పంచులు వస్తారని ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) వెల్లడించారు. అయితే రిజర్వేషన్ల పెంపు కోసం ఏర్పాటైన డెడికేటెడ్ కమిషన్ గడువు పెంపు ప్రతిపాదనను తెరమీదకు వస్తుండటంతో ప్రభుత్వం భావిస్తున్నట్లుగా సర్పంచ్‌ల ఎన్నికలు సంక్రాంతిలోపే పూర్తవుతాయా లేక మరికొంత కాలం ఎదురు చూపులు తప్పవా అనే చర్చ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

Advertisement

Next Story

Most Viewed