ఆ ఆరోపణల వేళ హాట్ టాపిక్‌గా సునీల్ భన్సల్‌తో బండి భేటీ

by Sathputhe Rajesh |
ఆ ఆరోపణల వేళ హాట్ టాపిక్‌గా సునీల్ భన్సల్‌తో బండి భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అధికార సాధనే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఈ క్రమంలో తాజాగా బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ బన్సల్‌తో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ భేటీ కావడం ఆసక్తిగా మారింది. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వీరిద్దరు సమావేశం అయ్యారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. జన సంపర్క్ అభియాన్, బూత్ సశక్తీకరణ్‌పై ఇరువురు చర్చించినట్లు తెలిసింది. అయితే రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇరువు భేటీ కావడం ఇటు పార్టీలోనూ అటు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిని రేపుతోంది.

ముఖ్యంగా ఇటీవల పార్టీలో చేరికలు తగ్గిపోవడం, ఈటల రాజేందర్‌తో సహా మరికొంత మంది నేతలపై ప్రచారం జరుగుతున్న క్రమంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీలో కేసీఆర్ కోవర్టులు ఉన్నారనే టాక్ సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మరో వైపు పార్టీ నేతల మధ్య సమన్వయ లోపం, ఎవరికి వారే తమ ఇష్టానుసార వ్యాఖ్యల వల్ల పార్టీకి నష్టం కలుగుతోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి తరుణంలో పార్టీలో చేపట్టాల్సిన మార్పులు, చేర్పులపై ఇరువురు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం రాష్ట్రంలో పొంగులేటి, జూపల్లి వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇద్దరిని పార్టీలోకి రావాలని ఆహ్వానించినా వారు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. వీరి విషయంలో ఈటల చేపట్టిన రాయబారం విఫలం కావడమే కాకుండా పార్టీలోకి ఆహ్వానించిన తనకే తిరిగి కౌన్సిలింగ్ ఇస్తున్నారంటూ ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈటల కామెంట్స్ ప్రభావం పార్టీ చేరికలపై పడే అవకాశాలు లేకపోలేదనే టాక్ వినిపిస్తోంది.

ఇలాంటి పరిస్థితుల్లో పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ గూటికి చేరితే బీజేపీ అనుసరించాల్సిన వ్యూహంపై కూడా ఈ ఇద్దరి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. మరో వైపు రాష్ట్రానికి బీజేపీ అగ్రనేతలైన అమిత్ షా, జేపీ నడ్డాలు రాబోతున్నారు. ఈ నెలలో బీజేపీ భారీ బహిరంగ సభలకు ప్లాన్ వేస్తోంది. ఈ సభల సక్సెస్ కోసం అనుసరించాల్సిన తీరుపై ఇరువు చర్చించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్‌ను ఎదుర్కొనే క్రమంలో కాంగ్రెస్ స్పీడప్ అవుతున్న తరుణంలో బీజేపీ ముఖ్యనేతల భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.

Advertisement

Next Story