అణగదొక్కితే ఆగే వ్యక్తిని కాను.. T-బీజేపీ చీఫ్ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

by Satheesh |
అణగదొక్కితే ఆగే వ్యక్తిని కాను.. T-బీజేపీ చీఫ్ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తాను కార్యకర్త స్థాయి నుంచి వచ్చానని, అణగదొక్కితే ఆగిపోయే వ్యక్తిని తాను కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని ఓ హోటల్‌లో బుధవారం బీసీ మేధావుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ఎన్నికలొస్తుంటే డిక్లరేషన్ పేరుతో ఓట్లు దండుకుని మోసం చేసే పార్టీ బీజేపీ కాదని, ఆచరణ సాధ్యమయ్యే హామీలను మాత్రమే మేనిఫెస్టోలో పొందుపరుస్తామన్నారు.

అయితే అందుకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని సంజయ్ నేతలకు సూచించారు. హామీల అమలు విషయంలో అణగదొక్కితే ఆగిపోయే వ్యక్తిని తాను కాదని సంజయ్ స్పష్టంచేశారు. బీసీ సబ్ ప్లాన్, డిక్లరేషన్ పేరుతో ఓట్లు దండుకునే పార్టీలను, నాయకులను గుర్తించకపోతే బీసీలు మరింత అణగారినవర్గాల వారుగా చరిత్రలో నిలిచిపోతారన్నారు. బీజేపీ ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా 27 మంది ఓబీసీలకు కేబినెట్‌లో చోటు కల్పించిన చరిత్ర ఉందన్నారు.

పార్టీ సంస్థాగత కమిటీల్లో బీసీలకు 30 శాతం పదవులు కేటాయించకపోతే.. వాటిని ఆమోదించే ప్రసక్తే ఉండదని గుర్తు చేశారు. అణగారిన వర్గాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలే అత్యధికంగా ఉన్నారని చెప్పారు. వారిని దృష్టిలో ఉంచుకునే ప్రజా సంగ్రామ యాత్రలో ఉచిత విద్య, వైద్యం అమలు చేస్తామని, నిలువనీడ లేని వారికి ఇండ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.

అనంతరం బీజేపీ టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ సీహెచ్ విఠల్ మాట్లాడుతూ.. సమావేశంలో వ్యక్తమైన సలహాలు, సూచనలను బీసీ డిక్లరేషన్‌లో పొందుపరుస్తామని చెప్పారు. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ.. ఆత్మస్తుతి పరనింద విధానాన్ని మానుకుని బీసీల అభ్యున్నతికి సలహాలివ్వాలని కోరారు. ఎస్ కుమార్ మాట్లాడుతూ.. బూర్జువా పార్టీకి చెందిన కేసీఆర్‌కు తెలంగాణ ఉద్యమ నాయకత్వం అప్పగించడంవల్లే అణగారిన వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇచ్చిన హామీ నిలబెట్టుకునేందుకు బండి సంజయ్ నిరంతరం తపన పడుతున్నారని చెప్పారు. ఈ సందర్భంగా బీసీ కుల గణన చేపట్టాలని కోరుతూ కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని, బీసీ బడ్జెట్ కేటాయింపులను పెంచడమే కాకుండా పూర్తిగా ఖర్చు చేయాలని, బీసీల్లో అణగారిన కులాల అభ్యున్నతికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, బీసీ వ్యక్తిని సీఎం అభ్యర్ధిగా ప్రతిపాదించాలని, ముస్లిం రిజర్వేషన్లతో బీసీలు నష్టపోకుండా చూడాలని పలువులు సలహాలు ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed