కాంగ్రెస్ ప్రభుత్వంపై బండి సంజయ్ తీవ్ర విమర్శలు

by GSrikanth |   ( Updated:2024-04-02 05:55:24.0  )
కాంగ్రెస్ ప్రభుత్వంపై బండి సంజయ్ తీవ్ర విమర్శలు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం కరీంనగర్‌లోని ఆయన ఎంపీ ఆఫీసులో ‘రైతు దీక్ష’కు దిగారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అమలుకు సాధ్యం కానీ, అనేక హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం గుప్పించిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని అన్నారు. ముఖ్యంగా ఆరు గ్యారంటీలు అంటూ నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు.

అకాల వర్షాల కారణంగా పంటనష్టం జరిగినా పట్టింపులేనట్లు ప్రవర్తిస్తున్నారని అన్నారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.20 వేల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమాను కూడా అమలు చేయకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని గుర్తుచేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లతో ప్రజలు విసిగిపోయారని అన్నారు. ప్రజల ఆవేదన మొత్తం ఓటు రూపంలో రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో చూపిస్తారని కీలక వ్యాఖ్యలు చేశారు. మోడీకి ఓటేయాలని దేశం మొత్తం ఎదురుచూస్తోందని అన్నారు. రాష్ట్రంలో మెజార్టీ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Next Story