ఈ సారి వారిని ఊచకోత కోయాల్సిందే.. బండి సంజయ్ సంచలన పిలుపు

by GSrikanth |
ఈ సారి వారిని ఊచకోత కోయాల్సిందే.. బండి సంజయ్ సంచలన పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం జిల్లాలో జరిగిన నవ యువ ఓటర్ల సమ్మేళనంలో పాల్గొని మాట్లాడుతూ.. ప్రజల కోసం నిర్విరామ పోరాటం చేసిన తనపై కేసీఆర్ ప్రభుత్వం వందకు పైగా కేసులు పెట్టిందని ఆవేదన చెందారు. అయినా ఎక్కడా వెనకడుగు వేయకుండా పోరాటాలు చేసి అనేకసార్లు జైలుకు కూడా వెళ్లానని గుర్తుచేశారు. కరీంనగర్ జిల్లా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చినా బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. గల్లీలో ఎవరున్నా.. ఢిల్లీలో మాత్రం ప్రభుత్వమే ఉండాలని ఆకాంక్షించారు.

దేశ ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారని తెలిపారు. మోడీ లేని భారత్‌ను ఊహించుకోలేమని, దేశ చరిత్రను మార్చే పనులన్నీ ఆగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకోసం నేటి యువత పూర్తిగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పాస్ పోర్టు కంటే విలువైన వజ్రాయుధం ఓటు-ఓటు హక్కుతో మీ తలరాతతోపాటు దేశ భవిష్యత్తును కూడా మార్చుకునే సత్తా ఉందన్నారు. కానీ నేటి యువత ఆశించిన స్థాయిలో ఓటు హక్కు నమోదు చేసుకోకపోవడం బాధాకరమన్నారు.

నవ యువత ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. 10వ స్థానంలో ఉన్న భారత్‌ను 5వ స్థానానికి చేర్చిన మోదీని మళ్లీ ప్రధానిగా ఎన్నుకోవాల్సిన అవసరం యువతపై ఉందన్నారు. మోడీ మళ్లీ ప్రధాని అయితే భారత్ ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా మారడం తథ్యమన్నారు. దేశ పునాదులు ప్రజాస్వామ్యమంపై నిలబడ్డాయని చెప్పారు. ఆ ప్రజాస్వామ్యంలో కీలకమైనది ఓటు హక్కు అని అన్నారు. ఓటు హక్కును ఉపయోగించుకోకపోవడం కరెక్ట్ కాదని.. ఓటు అనే ఆయుధంతో అవినీతి పరులను ఊచకోత కోయండి అని బండి సంజయ్ పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed