నిధులివ్వలేదనడం మూర్ఖత్వం.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌ పై బండి సంజయ్ ఘాటు విమర్శలు

by Prasad Jukanti |
నిధులివ్వలేదనడం మూర్ఖత్వం.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌ పై బండి సంజయ్ ఘాటు విమర్శలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు మొండిచేయి చూపారంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని, అది వారి మూర్ఖత్వమని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. అబద్ధాలు, దొంగ హామీలతో పబ్బం గడపాలనుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పిన సంగతిని మర్చిపోయి కేంద్రంపై విషం కక్కడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఇవాళ బండి సంజయ్ ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో రైల్వే, రోడ్ల నిర్మాణాలతోపాటు ఇతర రంగాల అభివృద్ధికి కేంద్రం బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. వివిధ శాఖల వారీగా బడ్జెట్ పూర్తి కేటాయింపుల తర్వాత వాస్తవాలు ప్రజల ముందుకు వస్తాయని స్పష్టం చేశారు.

నాడు వంతపాడింది కేసీఆర్ కాదా?

దేశంలో తెలంగాణ సహా వెనుకబడిన 150 జిల్లాల అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయించబోతున్నదని బండి సంజయ్ వెల్లడించారు. తెలంగాణ ప్రాజెక్టుల అంశాన్ని ప్రస్తావించకుండా ఉన్నప్పుడు నాటి యూపీఏ ప్రభుత్వానికి వంత పాడింది కేసీఆర్ అనేది వాస్తవం కాదా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేసి తీరుతుందని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ పదేళ్లలో ఏ సాధించారో సమాధానం చెప్పాలన్నారు. వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్కును ఎప్పుడో ప్రకటించడంతో పాటు నిధులు కేటాయించిన తర్వాత మళ్లీ దీనిపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లో తెలంగాణలోని 210 కి.మీల భాగం ఉందని తెలిపారు. రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసిన సంగతిని మర్చిపోయి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని ప్రస్తావించడం సిగ్గు చేటన్నారు.

ఇది దేశ హిత బడ్జెట్..

వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.1.50 లక్షల కోట్లకు పైగా నిధులు కేటాయించడం రైతుల పట్ల, వ్యవసాయం రంగం పట్ల మోడీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని బండి సంజయ్ పేర్కొన్నారు. ఇది దేశ హిత బడ్జెట్ అని పేర్కొన్నారు. బడ్జెట్‌లో ఏకంగా రూ. 11.50 లక్షల కోట్లను మౌలిక రంగాల అభివృద్ధికి కేటాయించడం గొప్ప విషయమని అన్నారు. విద్యారంగానికి అత్యధిక నిధులు కేటాయించి పెద్దపీట వేశారన్నారు. మహిళలు, బాలికలకు లబ్ధి చేకూర్చే పథకాలకు రూ. 3 లక్షల కోట్ల మేర ప్రతిపాదనలు చేయడం గొప్ప విషయమని పేర్కొన్నారు. 4 కోట్ల మంది యువతకు ఉపాధి కల్పించేలా బడ్జెట్‌లో ప్రతిపాదించడం సంతోషంగా ఉందన్నారు.



Next Story