దానం, కడియం, తెల్లంలకు హైకోర్టులో ఎదురుదెబ్బ

by Y. Venkata Narasimha Reddy |
దానం, కడియం, తెల్లంలకు హైకోర్టులో ఎదురుదెబ్బ
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మరోసారి షాక్ తగిలింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుల అనర్హతపై హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు డివిజన్‌ బెంచ్‌ నిరాకరించింది. సింగిల్‌ బెంచ్‌ తీర్పును అసెంబ్లీ కార్యదర్శి సవాల్‌ చేయగా..తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్ట్‌ డివిజన్‌ బెంచ్‌ స్పష్టం చేసింది. ఈనెల 24న వాదనలు వింటామని చెప్పింది. ఎమ్మెల్యేల అనర్హతపై 20 రోజుల క్రితం సింగిల్‌ బెంచ్‌ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. షెడ్యూల్‌ ఖరారు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. దానం, కడియం, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని హైకోర్టును గతంలో బీఆర్‌ఎస్ ఆశ్రయించింది.

పార్టీ ఫిరాయించిన ఆ ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయ కార్యదర్శిని ఆదేశించింది హైకోర్టు ధర్మాసనం. తాము చెప్పినట్లుగా నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోకపోతే.. సుమోటోగా కేసు స్వీకరించి మళ్లీ విచారణ ప్రారంభిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టు తీర్పుతో బీఆర్ఎస్‌లో గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలలో టెన్షన్ పెరిగిపోయింది. అసెంబ్లీ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? హైకోర్టు ఎలా రియాక్ట్ అవుతుందోనని ఉత్కంఠ నెలకొంది. దీంతో మరికొన్ని రోజుల్లో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు ఎమ్మెల్యే సభ్యత్వంపై వేటు పడే ఛాన్స్‌ ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Next Story