Akunuri Murali: విద్యారంగంపై రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ వేళ ఆకునూరి మురళి కీలక ట్వీట్

by Prasad Jukanti |   ( Updated:2024-08-05 06:08:17.0  )
Akunuri Murali: విద్యారంగంపై రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ వేళ ఆకునూరి మురళి కీలక ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్న తరుణంలో మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి చేపట్టిన రెండు రాష్ట్రాల పరిశీలన ఆసక్తిగా మారింది. త్వరలోనే ఆయనకు విద్యా శాఖకు సంబంధించి కీలక బాధ్యతలు అప్పగించబోతున్నారనే ప్రచారం తెరపైకి వస్తున్న వేళ ఆకునూరి మురళి పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పర్యటించారు. ఈ పర్యటన వివరాలను ఆయన తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో వెల్లడించారు. గత వారంలో పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి ప్రభుత్వ బడులలో ప్రీ ప్రైమరీ, స్కూల్ ఎడ్యుకేషన్ వివరాలను తెలుసుకున్నామని తెలిపారు. ఈ రెండు రాష్ట్రాలలో ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇస్తున్న విషయం చాలా స్పష్టంగా కనపడిందని అన్ని హంగులతో, ప్రభుత్వ బడులలో మంచి వాతావరణం కనపడిందని పేర్కొన్నారు. అలాగే ఈ రెండు రాష్ట్రాలలో ప్రాథమిక విద్యకు డైరెక్టరేట్లు జిల్లా స్థాయిలో ప్రత్యేక డీఈవో ఉన్నారని తెలిపారు. నాణ్యమైన విద్యకు గురుకులాలు పరిష్కారం కాదనేది ఈ రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానం ద్వారా అర్థం అవుతున్నదని అభిప్రాయపడ్డారు. పంజాబ్ లో 11 గురుకులాలే ఉంటే హర్యానాలో కనీసం ఒక్క గురుకులం కూడా లేదని వెల్లడించారు. దీనర్థం అన్ని బడులు బాగుండాలే అని అన్నారు. ఇక బడ్జెట్ లో విద్య కోసం కేటాయింపుల్లో పంజాబ్, హర్యానాలు 12 శాతం కేటాయించాయని అదే మన తెలంగాణలో పాత బీఆర్ఎస్ ప్రభుత్వం 6.4 శాతం కేటాయిస్తే కొత్త కాంక్రెస్ ప్రభుత్వం 7.57 శాతం కేటాయించిందన్నారు. ఇది ఇంకా తక్కువే అన్నారు.

మరో వైపు ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులతో ముఖాముఖీ భేటీ అయి తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ మీ చేతులో ఉందని అని వ్యాఖ్యానించారు. గత పాలనలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు అన్యాయం, ప్రభుత్వ బడులు నిర్లక్ష్యానికి గురయ్యాయని మా ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరిస్తుందని భరోసా ఇచ్చారు. ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య తగ్గి ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థుల చేరిక పెరగాలని అందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని పిలుపు నిచ్చారు.గురుకులాల ద్వారా విద్యార్థులకు తల్లిదండ్రులకు, సమాజానికి మధ్య పెరుగుతున్న అంతరాన్ని ముఖ్యమంత్రి ఇటీవల ఓ సమావేశంలో ప్రస్తావించారు. ఈ నేఫథ్యంలో ఆకునూరి మురళి చేపడుతున్న పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోని బడులు,అక్కడ గురుకులాల నిర్వహణపై పరిశీలన ఇంట్రెస్టింగ్ గా మారింది.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story