ఆ అంశంలో మీకు, కేసీఆర్ ప్రభుత్వానికి పోలికా.. సీఎంకు మాజీమంత్రి సబిత కౌంటర్

by Ramesh Goud |
ఆ అంశంలో మీకు, కేసీఆర్ ప్రభుత్వానికి పోలికా.. సీఎంకు మాజీమంత్రి సబిత కౌంటర్
X

దిశ, వెబ్ డెస్క్: మహిళల శాపనార్థాలు ముఖ్యమంత్రికి వినపడటం లేదా అని, మహిళల అంశంలో కేసీఆర్ ప్రభుత్వానికి (KCR Government), మీకు నక్కకు నాగాలోకానికి ఉన్నంత తేడా ఉంటుందని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత సబితా ఇంద్రారెడ్డి (BRS Leader Sabitha Indrareddy) అన్నారు. మహిళ దినోత్సవం (Womens Day) సందర్భంగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన వ్యాఖ్యలకు సబితా ఇంద్రారెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. సీఎంకు కౌంటర్ (Counter) ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె.. నాడు మిషన్ భగీరథ ద్వారా ఆడబిడ్డల నీటి కష్టాలు తీర్చిన కేసీఆర్ ప్రభుత్వంతో.. నేడు ప్రభుత్వ కార్యాలయాల ముందు మళ్ళీ మొదలైన మహిళల ఖాళీ బిందెల ప్రదర్శనతో మీరు పోటీ పడుతున్నారా? అని ప్రశ్నించారు. అలాగే తులం బంగారం హామీని తుంగలో తొక్కిన మీరు, ఆడబిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ లాంటి విన్నూత్న పథకాల సృస్తికర్తతో మీ పోటీనా అని ఎద్దేవా చేశారు. వివాహాలు ఆపి అమ్మాయిల ఉన్నత విద్యకు బాటలు వేసి, దాదాపు అన్ని యూనివర్సిటీలలో బాలికలే అధికంగా ఉండటం నిజం కాదా అని నిలదీశారు.

మహిళ విద్యకు బాటలు వేసింది కేసీఆర్ కాదా..?

కేసీఆర్ కిట్, అమ్మవడి, న్యూట్రిషన్ కిట్, జిల్లాకోక సఖి సెంటర్ పెట్టి భరోసా కల్పించి, ఆడపిల్ల పుడితే 13 వేలు ఇచ్చి అండగా నిలిచిన కేసీఆర్ ప్రభుత్వంతో మీ పోటీనా అని అడిగారు. అంతేగాక కేవలం అమ్మాయిల కోసం 690 గురుకుల పాఠశాలలు, 1000 కి పైగా జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్, 80 డిగ్రీ మహిళ కళాశాలలు, ఇందులో కేవలం ఎస్సి, ఎస్టీ బాలికలకు 50 కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాలలు, పీజీ, న్యాయ కళాశాల పెట్టి అమ్మాయిల చదువులో దేశానికే ఆదర్శంగా కేసీఆర్ నిలిస్తే, ఫుడ్ పాయిజన్, ఇతర కారణాలతో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడటంలో మీరు మొదటి స్థానంలో ఉన్నారా? అని దుయ్యబట్టారు. ఇక స్వయం సహాయక మహిళలు చిరు వ్యాపారాల నుండి పెద్ద స్థాయి సంస్థలు స్థాపించేలా ప్రోత్సాహకాలు ఇచ్చింది నాటి ప్రభుత్వం కాదా అంటూ.. వీ హబ్ ఏర్పాటు చేసి మహిళ పారిశ్రామిక వేత్తలకు పెద్ద ఎత్తున పరిశ్రమలు స్థాపించేలా అనేక రాయితీలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వమే కదా అని వివరించారు.

కేసీఆర్ ఉచిత బస్సులు ప్రారంభించింది మర్చిపోవద్దు..

ఆశా వర్కర్లు, అంగన్ వాడి వర్కర్లు, మెప్మా అర్పీలు, వీఓఏలు మధ్యాహ్నం భోజనం కార్మికులకు జీతాలు పెంచిన ఘనత గత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. మహిళల భద్రత విషయంలో షీ టీం లు తెచ్చి దేశానికి ఆదర్శంగా నిలిచిన నాటి ప్రభుత్వంతో.. భద్రత ఆటకెక్కి రోజుకొక్క చోట మహిళల పట్ల అఘాయిత్యాలు, హత్యలు ఈ ప్రభుత్వం సాధించిన ప్రగతా అని మండిపడ్డారు. ఉచిత బస్ ప్రయాణం అంటూ ఉదరగొడుతున్న మీరు హైటెక్ సిటీ లాంటి ప్రాంతంలో అమ్మాయిలు, మహిళల కోసం వివిధ కంపెనీల సహకారంతో నాడే ఉచితంగా షీ షటిల్ బస్ (She Shuttle Buses) లు ప్రారంభించిన విషయం మర్చిపోవొద్దని హితవు పలికారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించి రాష్ట్రంలో సగానికి పైగా జడ్పీ చైర్మన్ లను చేసింది బీఆర్ఎస్ పార్టీ (BRS Party) కాదా అని, నామినేటెడ్ పదవుల్లో 50 శాతం మహిళలకు కేటాయించిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ దేనని చెప్పారు.

వారితో పోటీ మహిళలకా? మీకు, మీ మంత్రులకా..?

కేవలం మహిళల కోసం యూనివర్సిటీని ఏర్పాటు చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా అని అడిగారు. పెద్ద ఎత్తున డబుల్ బెడ్ రూమ్ లు నిర్మించి పేద, మధ్యతరగతి ప్రజలకు గూడు కల్పిస్తే, వరుసగా బుల్లోజర్లు పెట్టి కూల్చుతున్న మీకు మహిళలలు పెడుతున్న శాపనార్థాలు వినపడటం లేదా అని, వారంతా మీ గ్రహణం ఎప్పుడు విడుతుందా అని ఎదురుచూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక అదానీ, అంబానీలతో పోటీ మీకు, మీ మంత్రులకా? లేక మహిళలకా? అని విమర్శలు చేశారు. అలాగే మనల్ని మనం కరెక్ట్ అనుకోవడంలో ఏమాత్రం తప్పులేదు కానీ, మన స్వార్థం, ద్వేషం, ఈర్ష్య, చేతకాని తనం కోసం ఎదుటి వాళ్ళని తప్పుగా చిత్రించకూడదు అని, ప్రజలు అన్నీ గమనిస్తుంటారు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే (BRS MLA) రాసుకొచ్చారు.

Next Story