Metro Rail : హైదరాబాద్ మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ లో మరో ముందడుగు

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-11-16 11:16:00.0  )
Metro Rail : హైదరాబాద్ మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ లో మరో ముందడుగు
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ మెట్రో రైల్(Hyderabad Metro Rail) సెకండ్ ఫేజ్(second phase)లో మరో ముందడుగు పడింది. ఎంజీబీఎస్-చాంద్రాయణగుట్ట వరకు చేపడుతున్న 7.5 కిలోమీటర్ల మెట్రో మార్గానికి కావాల్సిన భూ సేకరణకు గ్రీన్ సిగ్నల్ లభించింది. హైదరాబాద్ మెట్రో సంస్థ ఇప్పటికే భూసేకరణ కోసం నోటీసులు ఇచ్చింది. ఈ రూట్‌లో రోడ్డు విస్తరణ, స్టేషన్ల నిర్మాణానికి కీలకంగా మారిన ఆస్తుల సేకరణ(Declaration of Acquisition of Assets)కు సంబంధించిన డిక్లరేషన్ కు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిషెట్టి శనివారం ఆమోదం తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు చేపట్టిన మెట్రో ఫేజ్ 2 కారిడార్ ఎంజీబీఎస్ నుంచి చంద్రాయణ్ గుట్ట మార్గంలో 200 ఆస్తులకు సంబంధించిన (100 LHS, 100 RHS) డిక్లరేషన్ ఆమోదించారు. కొత్త సంవత్సరం జనవరిలో మెట్రో రైలు పనులు ప్రారంభం కానున్నాయి. మెట్రో రెండో దశ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ. 24.269 కోట్లు. అందులో 30 శాతం అంటే రూ.7313 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం..18 శాతం అంటే రూ. 4,230 కోట్లు కేంద్ర ప్రభుత్వం వెచ్చించనుంది. 52 శాతం నిధులను రుణాలతో పాటు పీపీపీ విధానంలో సమకూర్చుకునేలా ప్రభుత్వం డిపిఆర్ సిద్ధం చేసి ఆమోదం తెలిపింది.

రెండో దశలో నిర్మించబోయే 76.4 కిలో మీటర్ల మార్గానికి రూ.24,269 కోట్లు కేటాయిస్తూ జీవో. 196 పేరుతో పరిపాలన అనుమతుల ఉత్తర్వులు జారీ చేసింది. రెండో దశలో ప్రభుత్వం ఐదు కొత్త కారిడార్‌లు ప్రతిపాదించింది. నాలుగో కారిడార్ నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు (36.8 కి.మీ).. ఐదో కారిడార్ రాయదుర్గ్ టూ కోకాపేట్ నియోపొలిస్ వరకు (11.6 కి.మీ), ఆరో కారిడార్ ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయన్ గుట్ట వరకు (7.5 కి.మీ), ఏడో కారిడార్ మియాపూర్ నుంచి పటాన్‌చెరు వరకు (13.4 కి.మీ), ఎనిమిదో కారిడార్ ఎల్‌బీనగర్ టూ హయత్ నగర్ వరకు (7.1 కి.మీ.). ప్రస్తుతం మెట్రోలో రోజుకు దాదాపు 5 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. రెండో దశ మెట్రో రైల్ అందుబాటులోకి వస్తే సిటీలో రోజుకు మరో 8 లక్షల మంది ప్రయాణించే అవకాశం ఉంది.

Advertisement

Next Story