మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరిక వెనుక మరో అంశం

by Mahesh |   ( Updated:2023-04-12 09:43:25.0  )
మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరిక వెనుక మరో అంశం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే ఎన్నికల హడావుడి కనిపిస్తుంది. పార్టీల మధ్య పోరు రోజు రోజుకు ఉధృతం అవుతుంది. గెలుపే లక్ష్యంగా నాయకులు మాటల పిరంగిలు పేల్చుతున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరడం హాట్ టాపిక్ అయింది. ఇటీవలే ఢిల్లీలో కాషాయ తీర్థం పుచ్చుకున్న నల్లారి.. కాంగ్రెస్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఇంతవరకు బాగానే ఉన్నా కిరణ్ కుమార్ రెడ్డి తో బీజేపీకి కలిసి వచ్చే లాభం ఏంటనేది ప్రధాన చర్చగా మారింది. ఆయన బీజేపీ కండువా కప్పుకునే సమయంలో కేంద్ర మంత్రులు మాట్లాడుతూ కిరణ్ కుమార్ సేవలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌లో ఉపయోగపడతాయని కితాబిచ్చారు. విభజన బిల్లుకు మద్దతు ఇచ్చిన బీజేపీకి ఏపీలో సమైక్యవాదిగా కిరణ్ కుమార్ రెడ్డి చరిష్మా ఉపయోగపడవచ్చునేమో కానీ తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడిన కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ బీజేపీ ఎలా ప్లస్ అవుతారనేది చర్చ మొదలైంది.

అయితే కిరణ్ కుమార్ రెడ్డి విషయంలో మరో ఆసక్తికర అంశం తెరపైకి వస్తోంది. తెలంగాణలో ఎలాగైనా గెలిచి తీరాలని చూస్తున్న బీజేపీకి కిరణ్ కుమార్ రెడ్డి ఓ విధంగా కలిసిరాబోతుందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతోంది. రాష్ట్రం విడిపోవడానికి ముందు కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఎంఐఎం పార్టీ కీలక నేతలు ఒవైసీ బ్రదర్స్ ను జైలుకు వెళ్లడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఒవైసీలను జైలుకు పంపిన వ్యక్తిగా కిరణ్ కుమార్ రెడ్డిపై ముద్ర పడింది.

ప్రస్తుతం రాష్ట్రంలోనూ హిందుత్వ సెంటిమెంట్ క్రమక్రమంగా బలపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ తమ ప్రత్యర్థి పార్టీలైన బీఆర్ఎస్, ఎంఐఎంపై పదే పదే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నది. ఒవైసీ బ్రదర్స్ చెప్పినట్లుగా కేసీఆర్ తలాడిస్తున్నారని అనేక సందర్భంగాలో బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గతంలో ఒవైసీ బ్రదర్స్‌ను జైలుకు పంపించారనే ముద్ర కలిగిన కిరణ్ కుమార్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడం వల్ల ఓటర్లను మరింత ఆకర్షించే అవకాశం ఉందనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. మరి ప్రచారం జరుగుతున్నట్లుగా కిరణ్ కుమార్ రెడ్డి ఆ మేరకు ఓటర్లను ఆకర్షిస్తారా లేదా అన్నది కాలమే నిర్ణయించనుంది.

ఇవి కూడా చదవండి: బీజేపీలో ఎందుకు చేరాడో చెప్పిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి

Advertisement

Next Story

Most Viewed