‘నేను నీలా ఏడవను.. అక్కడే తేల్చుకుంటా’.. CM రేవంత్‌పై అమిత్ షా సెన్సేషనల్ కామెంట్స్

by Disha Web Desk 19 |
‘నేను నీలా ఏడవను.. అక్కడే తేల్చుకుంటా’.. CM రేవంత్‌పై అమిత్ షా సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల హైదరాబాద్ నియోజకవర్గ పరిధిలో రోడ్ షో నిర్వహించిన బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రవర్తన నియామవళిని ఉల్లంఘించి అమిత్ షా ప్రచారంలో చిన్నపిల్లలను ఉపయోగించారని కాంగ్రెస్ నేత నిరంజన్ ఫిర్యాదు మేరకు సుల్తాన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. అమిత్ షాతో పాటు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్, హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిని మాధవీలతపైన కేసు ఫైల్ అయ్యింది. ఈ క్రమంలో తెలంగాణలో తనపై నమోదైన కేసుపై అమిత్ షా స్పందించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ తెలంగాణలో పర్యటించిన అమిత్ షా.. సికింద్రాబాద్‌లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. ఈ మధ్య తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తనపై కేసు పెట్టించారని అన్నారు.

కానీ నేను రేవంత్ రెడ్డిలాగా ఏడవనని.. ఈ కేసుపై హైకోర్టులోనే తేల్చుకుంటానని స్పష్టం చేశారు. కేంద్ర పార్టీ ఆదేశాలతో అవినీతికి పాల్పడుతున్నావని సీఎం రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ నిన్ను వాడుకుని వదిలేస్తోందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఏటీఎంలా మార్చుకుందని, రాహుల్, రేవంత్ పేరుతో ఆర్ఆర్ ట్యాక్స్ వసూల్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏబీసీ అంటే.. అసదుద్దీన్ ఓవైసీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అని అన్నారు. ఇదిలా ఉంటే, అమిత్ షా ఫేక్ వీడియో కేసులో సీఎం రేవంత్ రెడ్డిపైన కేసు నమోదైన విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డిపై కేసు ఫైల్ చేసిన ఢిల్లీ పోలీసులు విచారణకు రావాలని నోటీసులు సైతం జారీ చేశారు. ఇదిలా ఉండగానే, తెలంగాణలో అమిత్ షాపై కేసు నమోదు కావడం.. కేసు పెట్టారని తాను రేవంత్ రెడ్డిలా ఏడవనని కేంద్ర హోం శాఖ మంత్రి అనడం పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది.

Next Story

Most Viewed