బీఆర్ఎస్ లో పొత్తు దుమారం.. పార్టీ వీడనున్న మాజీ మంత్రి, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు?

by Prasad Jukanti |   ( Updated:2024-03-06 09:15:37.0  )
బీఆర్ఎస్ లో పొత్తు దుమారం.. పార్టీ వీడనున్న మాజీ మంత్రి, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు?
X

దిశ, నిర్మల్ ప్రతినిధి/ డైనమిక్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ కలిసి పోటి చేయబోతున్నాయని కేసీఆర్, ఆర్ఎస్పీ ఉమ్మడి ప్రకటన చేసిన మరుసటి రోజే ఉమ్మడి ఆదిలాబాద్ బీఆర్ఎస్‌లో ఆర్ఎస్పీ చిచ్చు రగులుతోంది. గత ఎన్నికల్లో సిర్పూర్‌లో కోనప్పపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పోటీ చేశారు. దీంతో ఓట్లు చీలడం వల్లే తమ నేత ఓడిపోయారని కోనప్ప అనుచరులు అంటున్నారు. ఈ నేపథ్యంలో తాను కేసీఆర్‌కు ఎంతో గౌరవించినా బీఎస్పీతో పొత్తు విషయంలో తనతో ఓ మాటైనా చెప్పకుండా నిర్ణయం తీసుకోవడంపై కోనప్ప మండిపడ్డారు. కేసీఆర్ తీరును నిరసిస్తూ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఇవాళ సచివాలయానికి వచ్చారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో సమావేశమయ్యారు. కాసేపట్లో సీఎం రేవంత్‌రెడ్డిని కలవనున్నారు. తన అనుచరులను హైదరాబాద్‌కు పిలిచినట్లు సమాచారం. సాయంత్రం 4 గంటలకు కోనప్ప మీడియాతో మాట్లాడనున్నారు. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు.

మాజీ మంత్రి, మరో మాజీ ఎమ్మెల్యే సైతం..!

బీఎస్పీ పొత్తు విషయంలో కేసీఆర్ నిర్ణయంపై మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ముథోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి కూడా గుర్రుగా ఉన్నాయని సమాచారం. వీరు కూడా బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతున్నది. కాగా, గతంలో ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కోనప్ప బీఎస్పీ తరపున ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం జరిగిన పరిణామాలతో వారు బీఆర్ఎస్ గూటికి చేరగా పొత్తు వ్యవహారంలో తమను సంప్రదించకుండా నిర్ణయం తీసుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీఎస్పీతో పొత్తు వ్యవహారం నచ్చక మరికొంత మంది కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెబితే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు భారీ డ్యామేజీ తప్పదనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి బీఆర్ఎస్‌లో ఆర్ఎస్పీ చిచ్చు పెట్టారనే చర్చ మొదలైంది. ఈ పరిస్థితిని బీఆర్ఎస్ అధినేత ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి మరి.

Advertisement

Next Story

Most Viewed