హైదరాబాద్ వాసులకు అలర్ట్.. మరో 3 గంటలపాటు భారీ వర్షం!

by Satheesh |   ( Updated:2023-04-29 02:15:04.0  )
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. మరో 3 గంటలపాటు భారీ వర్షం!
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. శనివారం తెల్లవారుజూమున మొదలైన వర్షం ఎడతెరిపి లేకుండా పడుతోంది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం నగరాన్ని జలమయం చేసింది. నగరంలోని బంజరాహిల్స్, పంజాగుట్ట, జూబ్లిహిల్స్, ఖైరతాబాద్, నారాయణ గూడ, హిమాయత్ నగర్, ఈసీఐఎల్, ఉప్పల్, ఎల్బీ నగర్, దిల్‌సుఖ్ నగర్, మలక్ పేట్, కుషాయిగూడ, నాచారం, ఏఎస్ రావు నగర్, నాగారం, కీసర, చర్లపల్లి, హబ్సిగూడ, తార్నక, సికింద్రాబాద్, నాంపల్లి, లక్డీకపూల్, మాసబ్ ట్యాంక్, మెహదీపట్నం, టోలీచౌకి, మణికొండతో పాటు పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది.

ఈ వర్షం ధాటికి నగరంలోని రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో పలు ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో ఇండ్లలోకి వర్షపు నీరు చేరింది. ఇక, భారీ వర్షం నేపథ్యంలో హైదరాబాద్‌కు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరో మూడు గంటలపాటు హైదరాబాద్‌లో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరో రెండు గంటల పాటు నగరంలో కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Advertisement

Next Story