Ajay vs Ponguleti! ఖమ్మంలో హాట్ పాలిటిక్స్

by Sathputhe Rajesh |   ( Updated:2023-01-04 03:51:18.0  )
Ajay vs Ponguleti! ఖమ్మంలో హాట్ పాలిటిక్స్
X

పువ్వాడ అజయ్ వర్సెస్ పొంగులేటిగా ఖమ్మం రాజకీయాలు మారుతున్నాయా? ఇద్దరు బీఆర్ఎస్ నాయకుల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయా? కొత్త సంవత్సరం పొంగులేటి 'మా టీం రెడీ ' అంటూ హాట్ కామెంట్లు చేయగా.. 2న మంత్రి అజయ్ ఈర్లపుడిలో 'గంగిరెద్దుల వాళ్లు వస్తున్నారు' అంటూ వ్యాఖ్యానించారు. ఇద్దరి నడుమ విభేదాలు తారాస్థాయికి చేరాయని కొందరంటుంటే.. కొట్టిపడేయలేని ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం ఇవ్వనున్నదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

దిశ బ్యూరో, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ముఖ్యనేతలు పరస్పర మాటల యుద్ధానికి దిగుతున్నారు. ఒకే పార్టీలో ఉంటూనే ఎవరికి వారే అన్నట్టు సై అంటే సై అంటున్నారు. ఓ వైపు ఆధిపత్యం ప్రదర్శిస్తూనే మరో పక్క అభద్రతా భావానికి లోనవుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య వర్గ విభేదాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది.

పొంగులేటి సైతం అధికార పార్టీలోనే ఉన్నా.. ఆ పార్టీకి చెందిన కొంతమంది నేతలు మాత్రం ఆయనపై వీలు దొరికినప్పడల్లా ఎదురుదాడి చేస్తున్నారు. అధిష్టానం కూడా పట్టించుకోనట్లే ఉంటున్నది. ఈ క్రమంలోనే పొంగులేటి పార్టీ మారడం పక్కా అనిపిస్తున్నది. న్యూ ఇయర్ రోజున పువ్వాడ, పొంగులేటి ఇద్దరూ బలప్రదర్శన చేశారనే టాక్ వినిపిస్తోంది. శ్రీనివాస రెడ్డి తన టీం వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీగా ఉందని కామెంట్స్ చేయగా మంగళవారం మంత్రి అజయ్ 'గడ్డాలు నిమిరేటోళ్లు.. తలలమీద చేతులు పెట్టేటోళ్లు వస్తారు.. జాగ్రత్త' అంటూ చేసిన కామెంట్స్ ఉమ్మడి జిల్లాలో చర్చకు దారితీశాయి.

గంగిరెద్దులోళ్లు వస్తున్నారు

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడిలో ఓ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అజయ్ మాట్లాడుతూ.. 'ఎన్నికలప్పుడే కొంతమంది గంగిరెద్దులోళ్లు వచ్చి పలకరిస్తూ ఉంటారు. ఐదేళ్లకోసారి వచ్చి గడ్డాలు నిమురుతూ.. తలమీద చేతులు పెడుతూ పలకరిస్తారు.. కానీ ఖమ్మంను అభివృద్ధి చేసింది నేను.. వచ్చే ఎన్నికల్లో మీ ముందుకు వస్తా.. మళ్లీ నన్నే ఆశీర్వదించాలి.' అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలు పొంగులేటిని ఉద్దేశించి చేసినవే అంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

పొంగులేటి పార్టీ మారడం ఖాయమైనట్టేనా?

పొంగులేటి కారు దిగనున్నారనే ప్రచారం జోరందుకున్నది. కొంతకాలం నుంచి నాన్చివేత ధోరణి ప్రదర్శిస్తున్నా పార్టీ మారే టైం దగ్గర పడిందని, అతి త్వరలోనే వేరే కండువా కప్పుకోవడం తప్పదని పొంగులేటి అనుచరులు చెబుతుండడం గమనార్హం. అయితే కాంగ్రెసా? బీజేపీనా? అనే సందిగ్ధత నెలకొన్నది. బీజేపీ నుంచి ఏకంగా ఢిల్లీ పెద్దలే రంగంలోకి దిగి పలు హామీలు ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. అన్నీ బేరీజు వేసుకుని కమలం పార్టీ వైపే మొగ్గు చూపిస్తునట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా కమలం పార్టీ ఎదుగుతున్న క్రమంలో బీజేపీలో చేరితేనే తనకు తన అనుచరులకు భవిష్యత్ ఉంటుందని భావించి కాషాయ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.

ఖమ్మం నుంచే పోటీ చేస్తారా?

కొంతకాలం నుంచి శ్రీనివాసరెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీలో ఉండడం ఖాయమంటూ పలు సందర్భాల్లో చెబుతూ వస్తున్నారు. అయితే ఏ పార్టీ నుంచి? ఏ నియోజకవర్గం నుంచి? అనేది మాత్రం ఇంకా స్పష్టత లేదు. బీఆర్ఎస్‌లో ఉంటే కొత్తగూడెం నుంచి పోటీ చేస్తారని టాక్ ఇన్నాళ్లూ వినిపించినా ఇప్పుడు పార్టీ మారి ఖమ్మం నుంచి పోటీ చేస్తారనే టాక్ వినిపిస్తున్నది. అందుకే మంత్రి అజయ్ మంగళవారం ఈర్లపూడిలో జరిగిన సభలో ఆ కామెంట్స్ చేసినట్లు తెలుస్తున్నది.

ఫ్లెక్సీ చించివేత నుంచి..

అజయ్ చేసిన ఈ వ్యాఖ్యల కంటే నాలుగైదు రోజుల ముందు రఘునాథపాలెం మండలం శివాయిగూడెంలో ఏర్పాటు చేసిన కిమ్స్ హాస్పిటల్ హోర్డింగ్‌ను, దానికి ఉన్న పొంగులేటి బ్యానర్‌ను మంత్రి అజయ్ అనుచరులు చించి వేసినట్లు శ్రీనివాస్ రెడ్డి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. ఇలాంటి చర్యలు మంచివికావని పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి దయాకర్ రెడ్డి కూడా ప్రకటన విడుదల చేశాడు. ఈ నేపథ్యంలో వారం తిరగకముందే మంత్రి ఈర్లపుడిలో చేసిన కామెంట్స్ ఖమ్మంలో తీవ్ర చర్చకు దారితీశాయి.

Also Read...

కొత్త పథకాల్లేవ్! సర్కారు అనౌన్స్‌మెంట్‌పై ఉత్కంఠ

Advertisement

Next Story

Most Viewed