సోషల్ మీడియాలో దూకుడు.. BRS టార్గెట్ రేవంత్ రెడ్డి

by Disha Web Desk 4 |
సోషల్ మీడియాలో దూకుడు.. BRS టార్గెట్ రేవంత్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేసింది. ఆయన ప్రతీ సభలో కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై చేసే విమర్శలంటినీ సేకరిస్తున్నారు. సీఎంపై చర్యలకు సిద్ధమవుతూనే మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలను ప్రచారంలో ప్రధాన అస్త్రంగా మలుచుకుంటున్నారు. మహిళా, రైతు పథకాల అమలులో విఫలం అయ్యారని ప్రజాక్షేత్రంలో వివరించడంతో పాటు సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ తప్పులను మరింతగా ఎత్తిచూపేందుకు సిద్ధమవుతున్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రచార స్పీడ్ పెంచింది. కాంగ్రెస్ లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డిపై గులాబీ అధిష్టానం ప్రధాన ఫోకస్ పెట్టింది. సభల్లో బీఆర్ఎస్, పార్టీ అధినేత కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను గమనిస్తున్నారు. వాటన్నింటిని ఆధారాలుగా చేసుకొని మరోసారి ఈసీకి ఫిర్యాదు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డిపై 8 సార్లు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ విమర్శల్లో మాత్రం రేవంత్ రాజీపడటం లేదు.

కేసీఆర్ రాజకీయ చరిత్రలోనే తొలిసారిగా ఎన్నికల ప్రచారంపై 48గంటల పాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో ఒకవైపు రేవంత్ రెడ్డిపై, మరోవైపు ఈసీపై పార్టీ గుర్రుగా ఉంది. అప్పటి నుంచి కాంగ్రెస్ నాయకులు చేసే ప్రతీ విమర్శతో పాటు సభలపైనా ప్రత్యేక దృష్టిసారించారు. రేవంత్ రెడ్డిపై రివేంజ్ తీర్చుకునేందుకు అన్ని మార్గాలను గులాబీ పార్టీ వెతుకుతున్నట్లు సమాచారం. అందుకోసం ప్రత్యేకంగా ఒక టీంను సైతం నియమించినట్లు విశ్వసనీయ సమాచారం. మరోవైపు కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టి ప్రజలను బీఆర్ఎస్ వైపు మళ్లీంచే ప్రయత్నం చేస్తున్నారు. రైతులకు సాగునీరు, కరెంటు, రైతుబీమా, రైతుబంధు అంశాలను ప్రస్తావిస్తున్నారు. మహిళకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపైనా ఫోకస్ పెంచారు.

ఇదిలా ఉంటే సోషల్ మీడియా వేదికగా మరింతగా కాంగ్రెస్‌పై విమర్శలు సంధించాలని భావిస్తున్నారు. ఇప్పటికే ప్రచారంలో కాంగ్రెస్ నేతలు చేస్తున్న తప్పిదాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. కాంగ్రెస్ హామీలు, గ్యారెంటీలపై ప్రజలు నిలదీస్తే వాటిని వైరల్ చేస్తున్నారు. కాంగ్రెస్ సోషల్ మీడియాలో చేసే పోస్టులకు సైతం రీ కౌంటర్ పోస్టులు పెడుతూ సోషల్ వార్ కొనసాగిస్తున్నారు. పోలింగ్‌కు తక్కువ గడువు ఉండటంతో గత ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని వివరిస్తూ.. కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తిచూపుతున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కొంపముంచిన సోషల్ మీడియా.. ఈ లోకసభ ఎన్నికల్లో ఏ మేరకు సక్సెస్ అవుతుందో వేచిచూడాలి.

Next Story

Most Viewed