- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భయమా..? సంకోచమా!? పీఎం ప్రోగ్రామ్స్‌కు కేసీఆర్ డుమ్మా వెనుక రీజన్ ఇదేనా?
దిశ, తెలంగాణ బ్యూరో: ఏడాది కాలంగా ప్రధాని మోడీ అఫీషియల్ ప్రోగ్రామ్స్‌కు సీఎం కేసీఆర్ ఎందుకు దూరంగా ఉంటున్నారు.? రాష్ట్రానికి వచ్చినప్పుడు కనీసం రిసీవ్ చేసేందుకు కూడా ఎందుకు వెళ్లడం లేదు.? ఆ ప్రొటోకాల్ బాధ్యతలు మంత్రులకు ఎందుకు అప్పగిస్తున్నారు.? మోడీ ప్రోగ్రామ్స్‌కు కేసీఆర్ డుమ్మా కొట్టడం వెనుక కారణాలు ఏమై ఉంటాయి.? భయమా..లేక సంకోచమా..ఇదే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్నది. మోడీని నేరుగా కలిసేందుకు కేసీఆర్ జంకుతున్నారా? మొఖం చూపెట్టలేకనా? లేక ప్రధానిని చూడడం ఇష్టం లేకనా? ఫేస్ టు ఫేస్ ఎదురు కాకపోవడానికి అసలు రీజన్ ఏమై ఉంటుందన్న చర్చలు పొలిటికల్ సర్కిళ్లలో జరుగుతున్నాయి.
మమత, స్టాలిన్‌లకు లేని భయం కేసీఆర్‌కు ఎందుకు?
రాజకీయాల్లో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం సహజం. అభివృద్ధి విషయంలో పాలిటిక్స్‌ను పక్కన పెట్టి అప్పటి వరకు తిట్టుకున్న లీడర్లు ఒకే వేదికపై కూర్చున్న ఘటనలనూ అనేకంగా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ.. పీఎం మోడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మోడీ కూడా మమత ప్రభుత్వంపై అదే స్థాయిలో ఫైర్ అయ్యారు. కానీ ఆ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ప్రోగ్రామ్స్‌కు మమత హాజరయ్యారు.
అలాగే తమిళినాడు సీఎం స్టాలిన్ కూడా మోడీ పాల్గొన్న అధికారిక కార్యక్రమాలకు అటెండ్ అయ్యారు. గతేడాది నవంబర్‌లో మోడీ చెన్నయ్‌లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఆ ప్రోగ్రామ్‌కూ వెళ్లిన స్టాలిన్ తమకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వెంటనే విడుదల చేయాలని మోడీ సమక్షంలోనే డిమాండ్ చేశారు. మరి కేంద్ర ప్రభుత్వ ప్రోగ్రామ్స్‌కు మోడీ వస్తున్నారంటే సీఎం కేసీఆర్ ఎందుకు దూరంగా ఉంటున్నారు? అనే చర్చ జరుగుతున్నది.
సికింద్రాబాద్ ప్రోగ్రామ్‌కూ కేసీఆర్ దూరం
ఈనెల 8న హైదరాబాద్‌కు ప్రధాని రానున్నారు. సికింద్రాబాద్‌లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్‌లో జరిగే పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొననున్నారు. ప్రొటోకాల్ ప్రకారం అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి రావాలని సీఎంకు రైల్వే శాఖ ఆహ్వానం పంపింది. అయితే కేసీఆర్ రాలేరని, స్థానిక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, లోకల్ ఎమ్మెల్యే పద్మారావు హాజరవుతారని పీఎంవోకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినట్టు తెలిసింది.
ఏడాది నుంచి ఇదే తీరు
గతేడాది ఫిబ్రవరి 5న జరిగిన సమతా మూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమం నుంచి పీఎం మోడీ టూర్లకు కేసీఆర్ దూరంగా ఉంటున్నారు. విగ్రహావిష్కరణకు మోడీ వస్తున్నారనే రీజన్‌తోనే కేసీఆర్ అక్కడికి వెళ్లలేదు. ఆ సమయంలో సీఎంకు జ్వరం వచ్చిందని, జలుబు చేసిందని ప్రగతిభవన్ వర్గాలు లీకులు ఇచ్చాయి. మళ్లీ మేలో ఇండియన్ బిజినెస్ స్కూల్ స్నాతకోత్సవానికి పీఎం వచ్చారు.
ఈ ప్రోగ్రామ్‌కూ కేసీఆర్ వెళ్లలేదు. నవంబర్‌లో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని మోడీ జాతికి అంకితం చేశారు. దీనికి కేసీఆర్‌ను ఆహ్వానించినా, ఆయన తరఫున స్థానిక మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను పంపించారు. గతేడాది ఆగస్టులో పీఎం అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి కూడా కేసీఆర్ డుమ్మా కొట్టారు. నీతి ఆయోగ్ వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదని విమర్శించి, ఆ మీటింగ్‌ను బహిష్కరిస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు.
అప్పుడు పొగడ్తలు.. ఇప్పుడు విమర్శలు
ఎన్డీఏ–1 కాలంలో పీఎం మోడీని సీఎం కేసీఆర్ పొగిడినంతగా బీజేపీ సీఎంలు కూడా కీర్తించలేదు. జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు, కరోనా అంశాల్లో ఓపెన్‌గా సపోర్ట్ చేశారు. మిషన్ భగీరథ ప్రాజెక్టును మోడీ చేతుల మీదుగా ప్రారంభించారు. ఆ సమయంలో కేసీఆర్.. మోడీని ఉద్దేశించి మాట్లాడుతూ ‘కేంద్రం నుంచి ఎలాంటి నిధులూ అవసరం లేదని.. మీ ఆశీస్సులు ఉంటే చాలు.’ అన్నట్టు మాట్లాడారు.
కానీ రెండోసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మెల్లమెల్లగా కేంద్రంతో గ్యాప్ పెరుగుతూ వచ్చింది. హుజూరాబాద్ బై ఎలక్షన్‌లో బీజేపీ గెలిచిన తర్వాత ఇరు పార్టీల మధ్య విమర్శలు తీవ్ర స్థాయికి చేరాయి. చాలా సార్లు మోడీపై కేసీఆర్ వ్యక్తిగత విమర్శలు చేసిన సందర్భాలూ ఉన్నాయి. రాష్ట్రంలోని పలు వ్యాపార సంస్థలపై ఈడీ, ఐటీ సోదాల తర్వాత ఆ విమర్శలు వేడి మరింత పెరిగింది.