ఆదివాసీ vs లంబాడా.. ఎస్టీల మధ్య రిజర్వేషన్ చిచ్చు పెట్టిన కేసీఆర్!

by GSrikanth |   ( Updated:2022-09-17 23:45:53.0  )
ఆదివాసీ vs లంబాడా.. ఎస్టీల మధ్య రిజర్వేషన్ చిచ్చు పెట్టిన కేసీఆర్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఎస్టీ రిజర్వేషన్‌ను 10 శాతానికి పెంచుతామని, వారం పది రోజుల్లోనే జీవో ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన ఆదివాసీ, లంబాడా వర్గాల మధ్య చిచ్చుపెట్టింది. ఇప్పుడు అమలవుతున్న ఎస్టీ రిజర్వేషన్‌ ఆదివాసీలకు పెద్దగా ప్రయోజనం లేకుండా పోయిందని, మరో 4% పెంచితే దాని లాభం కూడా లంబాడాలకే దక్కుతుందని ఆదివాసీ విద్యార్థులు, నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్య, ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్ ఫలాలు లంబాడాలకే లాభం చేకూరుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో శనివారం జరిగిన ఆదివాసీ-లంబాడా ఆత్మీయ సమ్మేళనంలో ఎస్టీ రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి చేసిన ప్రకటన సరికొత్త వివాదానికి దారితీసింది. మంత్రి సత్యవతి రాథోడ్ సైతం దీనిపై భిన్నంగా స్పందించారు.

రాష్ట్రంలో ఎస్టీల జనాభా దాదాపు 33 లక్షలకు పైగా ఉన్నా ఇందులో మూడింట రెండు వంతులు లంబాడాలేనని, రిజర్వేషన్ ఫలాలు వారికే ఎక్కువగా దక్కుతున్నాయన్నది ఆదివాసీ సంఘాల వాదన. ఇప్పుడు మరికొంత రిజర్వేషన్‌‌ను పెంచితే వారికే మరింత ప్రయోజనం లభిస్తుంది తప్ప ఆదివాసీలకు ఒరిగేదేమీ లేదన్నది వారి అభిప్రాయం. లంబాడాలను ఎస్టీల్లో చేర్చకముందు ఆదివాసీల కోసం నికరంగా 4% రిజర్వేషన్‌ ఉండేదని, దీన్ని ఇప్పటికైనా తు.చ. తప్పకుండా పాటించాలన్నది ఆదివాసీ సంఘాల డిమాండ్. తెలంగాణ ప్రభుత్వం ఎస్టీ రిజర్వేషన్లను పెంచుతూ అసెంబ్లీ తీర్మానం చేసి ప్రత్యేకంగా చట్టాన్ని రూపొందించి ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపినప్పుడు కూడా రాష్ట్రంలో ఆదివాసీ, లంబాడాల మధ్య తీవ్ర స్థాయిలో భేదాభిప్రాయాలు తలెత్తాయి.

తాజాగా కేసీఆర్ ప్రకటనతో మరోమారు అది తెరపైకి వచ్చింది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, ములుగు జిల్లాల్లో ఆదివాసీలు ఎక్కువగా ఉండగా మిగిలిన జిల్లాల్లో లంబాడాలు ఉన్నారు. నాలుగు ఐటీడీఏలు ఉన్నా ఆదివాసీలకు విద్యారంగంలో ఆశించిన ప్రయోజనాలు నెరవేరడంలేదన్నది విద్యార్థి సంఘాల వాదన. ఎస్టీ రిజర్వేషన్ల విషయంలో లంబాడా, ఆదివాసీల మధ్య ఎప్పటి నుంచో వివాదాలు ఉన్నాయి. తుడుందెబ్బ లాంటి ఆదివాసీ సంఘాలు మిలిటెంట్ ఉద్యమాన్నే చేపట్టాయి. ఎస్సీ వర్గీకరణను ఒక వర్గం స్వాగతిస్తుండగా, మరో వర్గం వ్యతిరేకించినట్లుగానే ఇప్పుడు ఎస్టీ రిజర్వేషన్ల విషయంలోనూ లంబాడాలు స్వాగతిస్తుండగా, ఆదివాసీలు వ్యతిరేకిస్తున్నారు.

ఈ వివాదం కొనసాగుతుండగానే రిజర్వేషన్ల విషయంలో సీఎం కేసీఆర్ ప్రకటన చేయడం తేనెతుట్టెను కదిపినట్లయింది. ఉద్యోగాల్లో సైతం సామాజికంగా ఉన్న అసమానతలతో ఆదివాసీలు వెనకబడుతున్నారని, లంబాడాలకు మాత్రమే ప్రయోజనం కలుగుతున్నదనే అభిప్రాయం దీర్ఘకాలం కొనసాగుతూ ఉన్నది. 1970వ దశకంలో లంబాడా (బంజారా)లను ఎస్టీ జాబితాలో చేరుస్తూ సమైక్య రాష్ట్రం నిర్ణయం తీసుకున్న తర్వాత పొరుగు రాష్ట్రాల నుంచి వలసలు బాగా పెరిగిపోయాయని, ఫలితంగా ఇక్కడ వారి జనాభా బాగా పెరిగిపోయిందని ఆదివాసీ సంఘాల నేతల వాదన. కర్నాటకలో ఎస్సీ జాబితాలో, మహారాష్ట్రలో బీసీ జాబితాలో ఉన్నందున రిజర్వేషన్ ఫలాల కోసం భారీ స్థాయిలో ఇక్కడకు వలస వచ్చారని, క్రమంగా వారి జనాభా ఊహకు అందని తీరులో పెరిగిందని గుర్తుచేశారు.

గడచిన ఐదు దశాబ్దాల్లో ఆదివాసీల జనాభా 9 లక్షల నుంచి 13 లక్షలకు పెరిగితే లంబాడాలు మాత్రం దీనికి దాదాపు నాలుగు రెట్లు పెరిగిందని ఆదివాసీ విద్యార్థి సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. ఐఏఎస్‌లు మొదలు ప్రభుత్వ విభాగాల్లో ఉన్నత స్థానంలో ఆదివాసీ అధికారులే లేరని, మంత్రివర్గంలోనూ అంతేనని గుర్తుచేస్తున్నారు. ఆదివాసీ జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు కూడా లంబాడాలే కావడంతో చాలా మంది తల్లిదండ్రులు వారి పిల్లల్ని పంపడానికి కూడా ఇష్టపడలేదని పేర్కొన్నారు. ఇప్పటికీ ఐటీడీఏ పరిధిలోని చాలా ప్రాంతాల్లో విద్యకు ఆదివాసీ పిల్లలు దూరంగానే ఉన్నారని, ఇందుకు కారణం లంబాడాలతో పోటీ పడలేకపోవడమేనని పేర్కొన్నారు.

రిజర్వేషన్లు పెంచినా లాభం లేదు

"లంబాడాలు మొదటి నుంచీ ఎస్టీ జాబితాలో ఉన్న తెగ కాదు. అప్పటికి ఆదివాసీలు మాత్రమే ఎస్టీలుగా గుర్తింపు ఉండేది. కానీ 1970వ దశకంలో వచ్చిన గెజిట్ కారణంగా లంబాడాలు కూడా ఎస్టీ జాబితాలో చేరారు. ఇతర రాష్ట్రాల నుంచి వలసలు పెరిగాయి. ఇప్పుడు ఎస్టీల జనాభాలో సుమారు 70% లంబాడాలు ఉండడానికి కారణం అదే. తొలుత సమైక్య రాష్ట్రంలో అమలైన 4% రిజర్వేషన్ ఆదివాసీలకే ఎక్కువగా వర్తించేది. అప్పటికి లంబాడాలు లేరు. ఇప్పుడు మేం డిమాండ్ చేస్తున్నది కూడా మా 4% వాటాను మాకు మాత్రమే ప్రత్యేకంగా ఉంచేయాలని. ప్రస్తుతం అమలవుతున్న ఆరు శాతంలో 2%, సీఎం కొత్తగా పెంచాలనుకుంటున్న 4% కలిపి మొత్తంగా 6% లంబాడాలకు ఇచ్చినా మాకు నికరంగా ఉండే 4% దక్కితే చాలు. లేదా ఆదివాసీల భవిష్యత్తు దెబ్బతినకుండా కొత్తగా పెంచాలనుకున్న రిజర్వేషన్‌లో స్పెషల్ క్లాజ్ పెట్టాలి". = బట్ట వెంకటేశ్వర్లు, ఆదివాసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు

"ఎస్టీ రిజర్వేషన్లను పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని కొంతమంది వక్రీకరిస్తున్నారు. ప్రభుత్వం దృష్టిలో ఆదివాసీలు, బంజారాలు వేర్వేరు కాదు. రెండు వర్గాలూ సామాజికంగా వెనకబడినవారే. ఆర్థిక, అభివృద్ధి అంశాల్లో మిగిలిన వర్గాలతో పోటీ పడలేకుండా ఉన్నవారే. ఎస్టీ రిజర్వేషన్ల విషయంలో సీఎం కేసీఆర్‌కు స్పష్టమైన అవగాహన ఉన్నది. రిజర్వేషన్ ఫలాలు లంబాడాలకే ఎక్కువగా ప్రయోజనమనేది కొద్దిమందికి ఉన్న అభిప్రాయం మాత్రమే. ఎస్టీ జాబితాలోని అన్ని వర్గాలకూ ఈ ఫలాలు అందాలన్నది ప్రభుత్వ భావన. రిజర్వేషన్ల విషయంలో వక్రీకరణలు చేసేవారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ రిజర్వేషన్లను పెంచాలని తీసుకున్న నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలి. లేకుంటే కారణాలను ప్రధాని మోడీ వివరించాలి". = మంత్రి సత్యవతి రాథోడ్

Advertisement

Next Story