అన్నదాతలకు అన్యాయం జరగకుండా చూడాలి : ఎమ్మెల్యే పాయల్ శంకర్

by Aamani |
అన్నదాతలకు అన్యాయం జరగకుండా చూడాలి : ఎమ్మెల్యే పాయల్ శంకర్
X

దిశ,ఆదిలాబాద్ : వానాకాలంలో అన్నదాతలు సాగుచేసిన సోయా పంట కొనుగోళ్లను శుక్రవారం ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే పాయల శంకర్ అదనపు కలెక్టర్ శ్యామల దేవి ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజారెడ్డిలు ప్రారంభించారు. కనీస మద్దతు ధర క్వింటాలకు 4892 నిర్ణయించినట్లు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ అన్నదాతలు పండించిన ప్రతి పంటను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. అదేవిధంగా పత్తిని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐ ద్వారా త్వరలో కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. అయితే మార్కెట్లో రైతులకు వారు పండించిన పంటకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరలు కల్పిస్తాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. సమస్య ఉండకుండా రైతులు ఎండబెట్టిన సోయాలనే మార్కెట్ కు తీసుకురావాలని కోరారు.కాగా మార్కెట్ కు వచ్చే రైతులకు అన్యాయం జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజారెడ్డి మాట్లాడుతూ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోయా కొనుగోళ్లను ప్రారంభించగా, ఆదిలాబాద్ లో 16 కేంద్రాలను ఏర్పాటు చేసి సోయా పంటను రైతుల నుంచి కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. ప్రైవేటు వ్యాపారస్తుల వద్ద అమ్ముకొని రైతులు నష్టపోకుండా ఉండేందుకే ముందస్తుగా ఈ కొనుగోళ్లను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. రైతుకు ఎక్కడ నష్టం జరగకుండా మార్కెట్ లో సరైన చర్యలు తీసుకుంటామని,అధికారులు సైతం పంటను విక్రయించిన రైతులకు సకాలంలో తమ ఖాతాలో డబ్బులు జమ చేసేలా చూడాలని ఆదేశించారు. ముందుగా తలమడుగు మండలంలోని కజ్జర్ల గ్రామానికి చెందిన చింతలపల్లి ప్రమోద్ రెడ్డి రైతు నుంచి తూకం వేసి ఆయన సత్కరించారు. ఇందులో భాగంగా మార్కెట్ కి వచ్చిన సోయాలను ఎమ్మెల్యే అదనపు కలెక్టర్ డిసిసిబి చైర్మన్ డిసిఒ మార్కెట్ అధికారులు కలిసి పరిశీలించారు.

Next Story

Most Viewed