వివేక్ అనుచరులు.. మా భూమిని కబ్జా చేశారు..

by Sumithra |
వివేక్ అనుచరులు.. మా భూమిని కబ్జా చేశారు..
X

దిశ, బెల్లంపల్లి : బీజేపీ జాతీయ నాయకుడు వివేక్ వెంకటస్వామి అనుచరులు కొందరు తమ భూమిని ఆక్రమించారని బాధితులు మువ్వ జ్యోతి ప్రకాష్, మువ్వ ఆశీర్వాదం ఆరోపించారు. బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో శనివారం కుటుంబ సభ్యులతో కలిసి వారు తమకు జరిగిన అన్యాయాన్ని మీడియాకు వెల్లడించారు. పట్టణంలోని రైల్వే రడగంబాల బస్తి పెంతుకోస్తు చర్చి సమీపంలో నాలుగు ఎకరాల 37 సెంట్లు భూమిని బీజేపీ పార్టీకి చెందిన లంబాడీ సామాజిక వర్గానికి చెందిన శంకర్, రాంబాబు తదితరులు కలిసి ఆక్రమించారని తెలిపారు.

ఆక్రమించుకున్న స్థలంలో గుడిసెలు వేసి లక్షల రూపాయలకు విక్రయిస్తున్నారని చెప్పారు. 1964 ప్రాంతంలోమా తండ్రి మువ్వ సామెల్ గురజాల సత్యనారాయణ, రామరాజుల నుంచి కొనుగోలు చేశాడని తెలిపారు. అందుకు సంబంధించిన కొనుగోలు పత్రాలు తమవద్ద ఉన్నాయని తెలిపారు. తమ భూమిని దౌర్జన్యంగా ఆక్రమించుకొని అమ్ముకుంటున్న వారి పై చర్యలు తీసుకోవాలని కోరారు. అక్రమార్కుల నుంచి తమ భూమిని ఇప్పించి న్యాయం చేయాలని రెవెన్యూ, పోలీసులకు విజ్ఞప్తి చేశారు. తమ జీవనాధారానికి ఈ భూమి ఒక్కటే ఆధారమని అది లేకపోతే తమకు ఆత్మహత్య శరణ్యమని కన్నీటి పర్యంతమయ్యారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. తమస్థలం వద్దకుకెళ్లి గుడిసెలు ఎందుకు వేస్తున్నారని అడిగితే తమను కొడుతున్నారని, చంపుతామని బెదిరిస్తున్నారని తెలిపారు. వారి నుంచి మాకు ప్రాణహాని ఉందని తెలిపారు.

Advertisement

Next Story