అంగన్వాడీలను ఇంటికి పంపించే నిర్ణయం సరైంది కాదు..: సీఐటీయూ

by Aamani |
అంగన్వాడీలను ఇంటికి పంపించే నిర్ణయం సరైంది కాదు..: సీఐటీయూ
X

దిశ,ఆదిలాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 24 నుంచి అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ కు అత్యంత తక్కువ డబ్బులు చెల్లించి ఇంటికి పంపించే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం సరైనది కాదని సీఐటీయూ నాయకులు ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో శనివారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అంతకుముందు సిఐటియు కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు పెద్ద ఎత్తున అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు ర్యాలీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు, అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్షురాలు మాట్లాడుతూ గతంలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు సమ్మె చేసిన సందర్భంగా గత ప్రభుత్వ మిచ్చిన హామీల ప్రకారం టీచర్స్ కు రెండు లక్షలు, హెల్పర్స్ కు ఒక లక్ష చెల్లించాలని, వీఆర్ఎస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో 65 సంవత్సరాలు పూర్తయిన అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ సుమారు పదివేల మంది పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఉద్యోగుల సమస్యలతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలని, 2023 సెప్టెంబర్ 11 నుంచి అక్టోబర్ 4 వరకు రాష్ట్రంలో 24 రోజులు అంగన్వాడీ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేశారని గుర్తు చేశారు. ఈ సమ్మె సందర్భంగా గత ప్రభుత్వమిచ్చిన హామీలను వెంటనే నెరవేర్చడం తో పాటు వారి సమస్యలను పూర్తిగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత, జిల్లా అధ్యక్షురాలు వెంకటమ్మ, నాయకులు సునీత, రత్నమాల, సుభద్ర, ముక్త,కుషవర్త ,విజయ, పద్మ ,పంచపుల, అనసూయ, లక్ష్మి, పార్వతి, సిఐటియు నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed