భైంసాలో నకిలీ వైద్యుడి గుట్టురట్టు

by Shiva |   ( Updated:2023-04-11 11:45:16.0  )
భైంసాలో నకిలీ వైద్యుడి గుట్టురట్టు
X

చదివింది సాధారణ కోర్స్.. చేసేది ఎంబీబీఎస్ వైద్యం

దిశ, బైంసా: బైంసా పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నకిలీ వైద్యుడు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ వైద్య వృత్తికే కలకం వచ్చేలా వ్యవహరిస్తున్నాడు. చదివింది సాధారణ కోర్సే అయినా.. ఎంబీబీఎస్ రేంజ్ లో ట్రీట్ మెంట్ చేస్తూ.. రోగులను బోల్తా కొట్టిస్తున్నాడు. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న అశ్విని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను డాక్టర్ ధన్ రాజ్, ఇతర వ్యక్తులు నిర్వహిస్తున్నారు. ఆ ఆసుపత్రిలో జనరల్, ఈ.ఎన్.టీ, స్కిన్, సర్జికల్ సేవలందిస్తామని జనాలను బురిడీ కొట్టిస్తున్నారు.

ఈ క్రమంలోనే మంగళవారం ఓ యువకుడు చర్మ సమస్యతో సదరు హాస్పిటల్ లో ఓపీ రాయించుకున్నాడు. తన సమస్యను తెలిపేందుకు స్కిన్ స్పెషలిస్ట్ వైద్యుడు డాక్టర్ రాజేష్ ఉన్నారా.. అని ప్రశ్నించగా వారు ఉన్నారంటూ సమాధానం చెప్పారు. సదరు యువకుడు ఓపీ స్లిప్ తీసుకోని లోపలికి వెళ్లి తన సమస్య గురించి చర్చిస్తుండగా.. ఆ యువకుడికి అనుమానం వచ్చింది. స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ స్థానంలో వేరొకరు ట్రీట్ మెంట్ ఇస్తుండడంతో అతను అవాక్కయ్యాడు. దీంతో అప్రమత్తమైన యువకుడు బీ.ఎం.ఎల్.టీ, బీఈఎంఎస్ లాంటి కోర్సులు చేసిన వ్యక్తి... చర్మ వ్యాధులకు సంబంధించి ఎంబీబీఎస్ వైద్యుడు చేసే ఎలా చేస్తాడంటూ ప్రశ్నించాడు.

ఈ క్రమంలో సదురు వైద్యుడి పేర అడగ్గా.. తన పేరు ధన్ రాజ్ అంటూ సమాధానమిచ్చాడు. అతని మీరెందుకు వైద్యం చేస్తున్నారంటూ దబాయించి అడగ్గా డాక్టర్ రాజేష్ వారం లేదా నెలలో కొన్ని రోజులు మాత్రమే తమ ఆసుపత్రిని విజిట్ చేస్తారని, తాను అందుబాటులో లేనప్పుడు చర్మ సంబంధిత వ్యాధులకు తానే ట్రీట్ మెంట్ ఇస్తానంటూ ధనరాజ్ సమాధానం చెప్పాడు. దీంతో సదరు యువకుడు షాక్ అయ్యాడు. ఓపీ స్లిప్ లలో పెద్ద వైద్యుల పేర్లు వేసి.. చికిత్సకు వచ్చే సరికి ఇలా ఎంబీబీఎస్ చేయని వారు కూడా చికిత్స చేస్తుండడంతో అక్కడున్న వారు ముక్కున వేలేసుకున్నారు. కనీసం ఓపీ స్లిప్ లో తాను నేర్చుకున్న కోర్సులకైనా.. సర్టిఫికెట్ ఉందా అని వైద్యుడు ధన్ రాజ్ ను యువకుడు ప్రశ్నించగా.. కోర్స్ పూర్తయింది కానీ.. సర్టిఫికెట్ రావడానికి సమయం పడుతుందంటూ దాటవేశాడు.

అధికారుల మొద్దు నిద్ర..

పట్టణంలో ఇంత జరుగుతున్నా.. సంబంధిత అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. అశ్వినీ ఆసుపత్రికి ఇప్పటికీ తాత్కలిక రిజిస్ట్రేషన్ తో కొనసాగుతున్నా అటు వైపు వైద్య శాఖ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. కనీస అర్హతలు ఉన్న వైద్యుడు వైద్య సేవలు అందించాల్సి ఉండగా ప్రథమ చికిత్స చేయాల్సిన వైద్యుడు ఎంబీబీఎస్ ట్రీట్ మెంట్ చేయడం సంబంధిత శాఖ అధికారులకు కనబడటం లేదా అంటూ మండిపడుతున్నారు.

ఆసుపత్రులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి: డీ.ఎం.హెచ్.వో ధన్ రాజ్

ప్రతి ప్రైవేటు ఆసుపత్రి ఎట్టి పరిస్థితుల్లోనూ రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి, లేని పక్షంలో ఆ ఆసుపత్రులపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటాం. రిజిస్ట్రేషన్ లేని ఆసుపత్రుల్లో సర్జరీలు చేయడం నేరం. మామూలు కోర్సులు చేసి ఎంబీబీఎస్ ట్రీట్ మెంట్ చేయడం ముమ్మాటికి తప్పే. సదరు అశ్విని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం, వైద్యులపై విచారణ చేపట్టి చట్టరీత్య చర్యలు తీసుకుంటాం.

Advertisement

Next Story