కరిగిపోతున్న ప్రకృతి సంపద.. పట్టించుకోని అధికారులు

by srinivas |
కరిగిపోతున్న ప్రకృతి సంపద.. పట్టించుకోని అధికారులు
X

దిశ, లక్షెట్టిపేట: ప్రకృతి సంపద గుట్టలను అక్రమార్కులు వదలడం లేదు. పంది కొక్కుల్లా తోడేస్తూ వ్యాపారం చేస్తున్నారు. వారి అక్రమ వ్యాపారానికి గుట్టలు కరిగిపోతుండగా రాయల్టీ రూపేన రావాల్సిన ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని మోదేల శివారులో గువ్వల గుట్ట మట్టిని తవ్విస్తూ కొందరు వ్యాపారం చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ట్రాక్టర్లలో గుట్ట నుంచి మట్టి మొరాన్ని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గుట్టు చప్పుడు కాకుండా గుట్టకు తవ్వకాలు జరుగుతున్నా.. సంబంధిత రెవెన్యూ, మైనింగ్ శాఖ అధికారులు అటు వైపుగా దృష్టి సారించక పోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రూట్ మార్చి తవ్వకాలు

గువ్వలగుట్ట సుమారు ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉంది. మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడ ప్లాట్ల కోసం వెంచర్లు వెలిసినా, ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నా, దారుల గుంతల్లో మట్టి అవసరమైనా వ్యాపారం చేస్తున్న అక్రమార్కుల కన్ను గుట్టపైనే పడుతోంది. గుట్ట మట్టి మొరాన్ని తరలిస్తూ వ్యాపారం చేస్తున్నారు. ఒక్కొక్క ట్రాక్టర్ లోడ్ మట్టికి రూ.700 నుంచి రూ.800 వరకు అమ్ముకుంటూ అక్రమ సంపాదన చేస్తున్నారు. దూరం ఎక్కువైతే అదనంగా రూ.200 నుంచి రూ. 300 వరకు తీసుకుంటున్నారు. గతంలో జెసిబి లతో తవ్వించి తవ్వకాలు చేసిన అక్రమార్కులు ఇప్పుడు రూట్ మార్చి కూలీలతో తవ్విస్తూ ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి అక్రమంగా సంపాదిస్తున్నారు. ఈ చట్టం ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో మొరం మట్టి తవ్వాలంటే ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించాలి. మైనింగ్, రెవెన్యూ శాఖల అనుమతి తప్పనిసరిగా ఉండాలి. ఇవేవీ లేకుండానే గుట్టను కొద్ది కొద్దిగా గుల్ల చేస్తున్నారు.

మైదానంగా మారే ప్రమాదం..

ఒకప్పుడు నిండు ఆహ్లాదాన్ని పంచిన గువ్వల గుట్ట అక్రమార్కుల చర్యలతో మైదానంగా మారే ప్రమాదం కనబడుతోంది. గతంలో రాత్రి వేళల్లో గుట్టపై జేసీబీలతో మొరం మట్టిని తవ్వించి ట్రాక్టర్లలో తరలిస్తుండగా అధికారులు పట్టుకొని అక్రమార్కులపై కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అయినా వారు గువ్వల గుట్టను వదలడం లేదు. గుట్ట పై అప్పుడప్పుడు ఏదో విధంగా మొరం మట్టి తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. ఎవరైనా ఫిర్యాదులు చేస్తేనే తప్ప, రెవెన్యూ, మైనింగ్ శాఖ అధికారులు అటువైపు వెళ్లడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా గుట్ట వైపుగా దృష్టి సారించి అక్రమ తవ్వకాలు జరగకుండా ప్రకృతి సంపదను కాపాడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Next Story