బెల్లంపల్లికి కరెంట్ కష్టాలు.. ఆగమ్యగోచరంలో కార్మికులు

by Aamani |
బెల్లంపల్లికి కరెంట్ కష్టాలు.. ఆగమ్యగోచరంలో కార్మికులు
X

దిశ,బెల్లంపల్లి: దశాబ్దాల క్రితం నుంచి సింగరేణి కార్మికుల క్వార్టర్లకు ఇస్తున్న ఉచిత కరెంటుకు ఇక కాలం చెల్లింది. పటానికి కరెంట్ కష్టాలు మొదలయ్యాయి.సింగరేణి యాజమాన్యం గత ప్రభుత్వం కార్మికులు నివసిస్తున్న క్వార్టర్లలను సొంతం చేసింది. ఈ నేపథ్యంలో బెల్లంపల్లిలో సుమారుగా సింగరేణి యాజమాన్యం 4500 పైచిలుకు క్వార్టర్లలను ప్రభుత్వానికి సరెండర్ చేసింది. ప్రభుత్వం సింగరేణి కార్మికులకు లావని పట్టాలు ఇచ్చింది. అప్పటి నుంచి సింగరేణి క్వార్టర్ల నిర్వహణ నుంచి యజమాన్యం సాంకేతికంగా, భౌతికంగా తప్పుకుంది. సరెండర్ చేసిన క్వార్టర్లలకు విద్యుత్ సదుపాయం ఎలా అన్నది ప్రధాన సమస్యగా బెల్లంపల్లి వాసులను వేదిస్తోంది.

ప్రభుత్వం నుంచి విద్యుత్ సరఫరా ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. కార్మిక వాడల్లో విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు కూడా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. ఉన్నట్టుండి సింగరేణి యాజమాన్యం ఏకపక్షంగా విద్యుత్ సరఫరాకు కొర్రీలు పెట్టడంతో కార్మికుల్లో అల్లకల్లోలం రేగుతుంది. ఒక్కసారిగా కార్మిక కుటుంబాలు ఇబ్బందుల్లో పడ్డారు. ప్రత్యామ్నాయ విద్యుత్ సదుపాయం లేక కార్మికులు అయోమయంలో పడ్డారు. కార్మికుల అవస్థలు తమకేంటన్నట్టు సింగరేణి యాజమాన్యం క్వార్టర్లకు విద్యుత్ సదుపాయం నిలిపివేత కే నిర్ణయించుకుంది.

నెల గడువుతో కరెంటు..

సింగరేణి క్వార్టర్లల్లో నివసిస్తున్న సింగరేణి కార్మికులు, రిటైర్డ్ కార్మికులు, కార్మికేతరులకు సైతం కరెంటు పునరుద్ధరణకు షరతుల ప్రాతిపదికను తెరపైకి చేస్తున్నది. కరెంటు పోయినా కార్మికులకు కూడా తిరిగి కరెంటు ఇవ్వడం లేదు. నెల గడువులో ప్రభుత్వ కరెంటును తీసుకుంటామని మరీ లెటర్ రాయించుకొని కరెంటును పునరుద్ధరిస్తున్నారు. నెల గడువు తీరగానే ఆ కార్మికునికి సింగరేణి యాజమాన్యం శాశ్వతంగా కరెంటు ను తొలగిస్తుంది. నెల రోజుల వ్యవధిలో కార్మికులు కరెంట్ పొందడం సాధ్యం కాదనే విషయం అధికారులకు తెలుసు. ఉద్దేశపూర్వకంగానే కండిషన్లు పెట్టి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారు. సింగరేణి కాలనీలో ఇప్పటికే ప్రభుత్వ విద్యుత్ సరఫరా వ్యవస్థ విస్తరించనూలేదు. కార్మిక వాడల్లో కనీసం విద్యుత్ స్తంభాల ఏర్పాటు కూడా జరగలేదు. ఈ నేపథ్యంలో నెల రోజుల్లో కార్మికులు ఎలా కరెంటు తీసుకుంటారన్నది ప్రశ్నార్ధకం. ఏదో వంకతో కార్మికులకు కరెంటు సరఫరాను నిలిపివేయడానికి యజమాన్యం కంకణం కట్టుకున్నట్టదని తెలుస్తోంది.

పథకం ప్రకారం పవర్ కట్..

ప్రభుత్వానికి సరెండర్ చేసిన సింగరేణి గృహాల కార్మికులు, ప్రజలు విద్యుత్ సౌకర్యాన్ని క్రమేణా కోల్పోతున్నారు. సింగరేణి యాజమాన్యం చాప కింద నీరులా కరెంటు తొలగింపు ప్రక్రియను చేపట్టింది. నెలరోజుల గడువు పేరిట కార్మికుల క్వార్టర్లకు కరెంటు తొలగిస్తున్నారు. కరెంటు తొలగింపుతో కార్మికులు గుడ్డిదీపాల్లోకాలం వెల్లదీస్తున్నారు. రోజురోజుకు కరెంట్ సౌకర్యం 'కోల్పోతున్న కార్మిక వాడల్లో అంధకారం తిష్ట వేస్తుంది. ఉన్నట్టుండి ప్రభుత్వ విద్యుత్ సదుపాయం పొందలేని దుస్థితి, ఇంత కాలం ఉన్న సింగరేణి కరెంటు దూరం కావడంతో కార్మిక కుటుంబాలు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. నెల గడువు విధించి కరెంటు తొలగింపు పై కార్మిక సంఘాల మౌనం పై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. యజమాన్యం కార్మిక సంఘాలు, అధికారులు, ప్రజాప్రతినిధుల సమ్మతి లేకుండానే యాజమాన్యం విద్యుత్ ను తొలగిస్తుందా ? అనే ప్రశ్న ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. యజమాన్యం కరెంటు తొలగింపుకు కఠిన నిర్ణయం వెనుక కార్మిక సంఘాల, ప్రజా ప్రతినిధుల మద్దతు ఉందన్న ఆరోపణలు లేకపోలేదు. అందుకే కాబోలు యజమాన్యం ఇంతటి సాహసోపేతమైన చర్యలకు ఒడిగడుతున్నదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

కార్మికులకు ఉచిత కరెంటు కు కత్తెర..

గత టీఆర్ఎస్ ప్రభుత్వం బెల్లంపల్లిలో సింగరేణి పురాతన ఇండ్లను కార్మికులకు అప్పగించింది. నామమాత్రపు యాజమాన్య హక్కుతో ఎస్ ఆర్ టి ఇండ్లకు పట్టా కల్పించింది. విద్యుత్ సౌకర్య కల్పనాన్ని వదిలేసింది. దీంతో బెల్లంపల్లిలో పట్టాపొందిన సింగరేణి క్వార్టర్లకు యజమాన్యం ఇంతకాలం ఇచ్చిన ఉచిత కరెంటుకు మంగళం పలుకుతున్నది. ప్రభుత్వానికి సరెండర్ చేసిన సింగరేణి క్వార్టర్ లో సర్వీస్ లో ఉన్న కార్మికులు కూడా ఉన్నారు. క్వార్టర్ల నిర్వహణ బాధ్యత నుంచి తప్పుకున్న యాజమాన్యం కార్మికులకు ఇంతకాలం ఇచ్చిన ఉచిత కరెంటుకు కత్తెర వేయడంపై విమర్శలు పెల్లుబికుతున్నాయి. దీంతో సంస్థలో పనిచేస్తూనే కార్మికులు ఉచిత కరెంటును కోల్పోతున్నారు. సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులకు యాజమాన్యం ఉచితంగా ఇచ్చే విద్యుత్తు నిలిపివేయడంపై విమర్శలు దుమారం లేపుతున్నాయి. క్వార్టర్లలకు పట్టా ఇచ్చినంత మాత్రాన కార్మికులకు ఉచిత కరెంటు సంగతేందని పలువురు ప్రశ్నిస్తున్నారు. పట్టా క్వార్టర్లలకు కరెంటు కట్ చేస్తున్న అధికారులు కార్మికులకు యాజమాన్యం మరో క్వార్టర్ అలాట్మెంట్ చేయాలి.

అలా కాకుండా పట్టా క్వార్టర్ల నివాసులకు మాదిరిగా కార్మికులకు సైతం విద్యుత్తు కనెక్షన్లను నిలిపివేయడం పారిశ్రామిక చట్టాలకు తిలోదక మివ్వడమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంస్థకు సంబంధం లేని క్వార్టర్లకు సింగరేణి పవర్ నిలిపివేయడం యాజమాన్యానికి సమంజసమే అనిపించినా పట్టాక్వార్టర్లలలో సింగరేణి కార్మికులకు విద్యుత్తు, నీటి సదుపాయం కల్పించాలి. అలా కాని యెడల సింగరేణి కార్మికులకు యజమాన్యం వేరే క్వార్టర్లను కేటాయించడం కనీస బాధ్యత. ఈ విషయాన్ని యజమాన్యం విస్మరిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. సరెండర్ చేసిన క్వార్టర్లలోని కార్మికులకు విద్యుత్ సదుపాయాన్ని నిలిపివేయడంపై కార్మిక సంఘాలు మౌనంగా ఉండడం పై విమర్శలు గుప్పుమంటున్నాయి.

ప్రత్యామ్నాయ విద్యుత్ కు గడువివ్వాలి..

బెల్లంపల్లి పట్టణ వ్యాప్తంగా విస్తరించి ఉన్న సింగరేణి సరెండర్ క్వార్టర్లకు విద్యుత్ సదుపాయానికి ఆంక్షలు సరికాదని కార్మికుల కోరుతున్నారు. పట్టా పొందిన ఇండ్లకు విద్యుత్ కోసం ప్రత్యామ్నాయ వ్యవస్థ ఇంకా ఏర్పడలేదు. అందుకోసమని సింగరేణి యాజమాన్యం వెంటనే విద్యుత్ తొలగింపును నిలిపివేయాలని పట్టా వాసులు కోరుతున్నారు. కార్మిక వాడల్లో కొన్నిబస్తిల్లోనూ ఇప్పటికీ విద్యుత్ సదుపాయానికి కనీస పనులు కూడా మొదలుకాలేదు. ఈ నేపథ్యంలో యాజమాన్యం అర్థం చేసుకొని సరెండర్ గృహాలకు విద్యుత్ సదుపాయం ఏర్పడే వరకు గడువు ఇవ్వడం కనీస ధర్మం. ఇదిలా ఉంటే సింగరేణి యాజమాన్యమే సరెండర్ చేసిన క్వార్టర్లకు సింగరేణి పవర్ ఇవ్వాలని మరో డిమాండ్ కార్మికుల నుంచి బలంగా వినిపిస్తోంది. పట్టణ వ్యాప్తంగా పటిష్టమైన పవర్ వ్యవస్థ సింగరేణి ఆధీనంలో ఉంది. సింగరేణి సంస్థనే విద్యుత్ సరఫరా చేసి మీటర్లు బిగించి బిల్లులను తీసుకోవచ్చు కదా అనే ప్రతిపాదన సింగరేణి యాజమాన్యం ముందుకు కార్మిక సంఘాలు తీసుకురావాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. ఇలా అయితే పట్టణంలో విద్యుత్ సమస్య వెంటనే తీరడంతో పాటు సింగరేణికి ఆదాయం కూడా సమకూరుతోంది. ఈ దిశగా నైనా కార్మిక సంఘాలు, ప్రజా ప్రతినిధులు యోచించాలనీ పట్టణ వాసులు కోరుతున్నారు.

Advertisement

Next Story