పైస‌లిస్తేనే ప‌ని.. లంచం ఇవ్వ‌నిదే ఫైలు క‌ద‌లదంటున్న అధికారులు

by Anjali |
పైస‌లిస్తేనే ప‌ని.. లంచం ఇవ్వ‌నిదే ఫైలు క‌ద‌లదంటున్న అధికారులు
X

దిశ‌, ఆదిలాబాద్ బ్యూరో: ఆ శాఖ‌లో పైస‌లిస్తేనే ప‌ని జ‌రుగుతుంది.. అదీ తిప్పించుకుని, తిప్పించుకుని మ‌రీ చేస్తారు. కొన్ని సంద‌ర్భాల్లో న‌మ్మ‌కం లేదు. విద్యుత్ శాఖ అధికారుల‌తో జ‌నం, ముఖ్యంగా రైతులు నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. మంచిర్యాల జిల్లాలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హరిస్తూ రైతుల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తున్నారు. ఓ ఏఈ ఏకంగా ఫోన్‌పే నంబ‌ర్ ఇచ్చి రూ. 15 వేలు ఫోన్‌పే చేయించుకున్నారు. అధికారుల‌కు ఈ విష‌యంలో ఫిర్యాదు చేసినా ఉన్న‌తాధికారులు క‌నీసం ప‌ట్టించుకోవ‌డం లేదంటే ప‌రిస్థితి అర్ధం చేసుకోవ‌చ్చు.

ట్రాన్స్ఫార్మర్స్ మరమ్మతులు చేయాలన్న, విద్యుత్ స్తంభం మార్చాలన్నా, నేల వాలిన విద్యుత్ తీగలు చక్క పెట్టాలన్న, చేతి కందే ఎత్తులో ఉన్న తీగల సమస్యలను ప‌రిష్క‌రించాల‌న్నా, విద్యుత్ పరంగా రైతన్నకు ఏ సమస్య వ‌చ్చినా రైతుల ప‌రిస్థితి ఇక అంతే. మంచిర్యాల జిల్లాలో విద్యుత్ శాఖతో ప‌నిబ‌డితే చాలు.. వేల‌కు వేలు స‌మ‌ర్పించాల్సిందే.. అయినా ప‌ని అవుతుందో లేదో కూడా తెలియ‌ని దుస్థితి. విద్యుత్ కార్యాలయంలో ఆ పనికి అంచనాలు వేసి, బేరం కుదుర్చుకొంటారు. బేరం కుదుర్చుకున్న తరువాత రైతన్న వద్ద నుండి సగం డ‌బ్బులు ముందుగానే తీసుకుంటారు. తీసుకొన్న తరువాత కాలాయాపన చేయడం, నెలలు గడపడం, పై నుండి మెటీరియల్ రాలేద‌నో..? మ‌రేదో కార‌ణం చెప్పి తిప్పించుకుంటారు.

డీడీలు క‌ట్టి ఏండ్లు అవుతున్నా..

మంచిర్యాల జిల్లాలో ప‌లు చోట్ల రైతులు డీడీలు క‌ట్టి ఏండ్లు గ‌డుస్తున్నా అధికారులు క‌నీసం ప‌ట్టించుకోవ‌డం లేదు. నాలుగు సంవ‌త్స‌రాలుగా డీడీలు క‌ట్టి తాము ట్రాన్స్‌ఫార్మ‌ర్ల కోసం ఎదురుచూస్తున్నామ‌ని అయినా అధికారులు క‌నిక‌రించ‌డం లేదంటూ ప‌లువురు రైతులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. బెల్లంప‌ల్లి డివిజ‌న్ నెన్న‌ల మండ‌లం గొల్ల‌ప‌ల్లిలో దాదాపు 30 మంది డీడీలు క‌ట్టారు. వారికి ట్రాన్స్‌ఫార్మ‌ర్లు బిగించ‌క‌పోవ‌డంతో గ‌త యాసంగి పంట ఎండిపోయింది. రైతులు దాదాపు 80 ఎక‌రాల్లో పంట న‌ష్ట‌పోయారు. అయినా అధికారుల‌కు క‌నిక‌రం క‌ల‌గలేదు. ఈ విషయంల తాము ఎన్నిమార్లు అధికారుల‌ను క‌లిసినా చ‌ర్య‌లు తీసుకోలేద‌ని రైతులు ఆవేదన వ్య‌క్తం చేస్తున్నారు. ప‌త్రిక‌లు, ఛాన‌ళ్ల‌లో ఊద‌ర‌గొట్టే అధికారులు క్షేత్ర‌స్థాయిలో త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌డం లేదంటూ రైతులు దుయ్య‌బ‌ట్టారు.

రూ. 15,000 ఫోన్ పే చేసిన రైతులు..

ఈ నేప‌థ్యంలో రైతులు స్థానిక ఏఈని క‌లిస్తే ఇప్పుడు, రేపు అంటూ సాగదీశారు. డ‌బ్బులు ఇస్తేనే ప‌ని చేస్తానంటూ డిమాండ్ చేశాడు. దీంతో రైతులు ఆ విద్యుత్ అధికారికి రూ. 10,000 ఒక‌సారి, రూ. 5,000 మ‌రోసారి ఫోన్‌పే ద్వారా లంచం ఇచ్చారు. అయినా, ఆ అధికారి స్పందించ‌క‌పోవ‌డంతో రైతులు మ‌ళ్లీ ఇబ్బందుల‌కు గురి కావాల్సి వ‌చ్చింది. దీంతో చేసేది లేక రైతులు వ‌రంగ‌ల్ సీఎండీకి లిఖిత పూర్వ‌కంగా ఫిర్యాదు చేశారు. అధికారులు హ‌డావిడిగా వ‌చ్చి విచార‌ణ నిర్వ‌హించారు. దాదాపు రెండు నెల‌లు అవుతోంది. ఆ విచార‌ణలో ఏం తెలిందో..? ఏం చేశారో..? ఉన్న‌తాధికారుల‌కే తెలియాలి. ఇలా చెప్పుకుంటూ జిల్లాలో చాలా మంది విద్యుత్ శాఖ అధికారుల‌ది ఇదే ప‌రిస్థితి. ఇప్ప‌టికైనా ఉన్న‌తాధికారులు ఈ విష‌యంలో చ‌ర్య‌లు తీసుకుని రైతుల‌కు న్యాయం చేయాల‌ని ప‌లువురు కోరుతున్నారు.

Advertisement

Next Story