- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ సారూ..దశాబ్దపు హామీలకు దారి చూపుతారా..!
దిశ ప్రతినిధి, నిర్మల్ : డియర్ కేసీఆర్ సార్..మీరు తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన నాటి నుంచి ప్రత్యేక రాష్ట్రం సాధించేదాకా మీ వెన్నంటి నడిచిన జిల్లాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పెట్టింది పేరు. కేసీఆర్ పిలుపునిస్తే చాలు..అన్నట్టుగా ఏ ఉద్యమమైనా ఎంతటి నిర్బంధమైనా తట్టుకుని పోలీసు లాఠీలను లెక్కచేయక ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన అడవుల జిల్లా మాది. ఆదిమ గిరిజనులు పోడు సేద్యం చేస్తున్న ఆదివాసీలు.. వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులు.. అహర్నిశలు కార్మిక క్షేత్రంలో చెమటోడ్చే కార్మికులు.. ఇలా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నలుమూలల సబ్బండవర్ణాలు మీ వెంట నడిచిన సంగతి మీకు బాగా ఎరుక. చంద్రబాబు వైఎస్ఆర్ల పాలనలో భయంకరమైన నియంతృత్వ పోకడలను ఎదిరించి మీ వెంట నడిచిన మాకు ఆశించిన స్థాయిలోనే ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావమైంది. ప్రత్యేక రాష్ట్రం వస్తే ఏమవుతుందో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాలను కలియతిరిగి బంగారు భవిష్యత్తు ఉంటుందని అన్ని వర్గాలను ఊరడించారు. నీళ్లు నిధులు ఉపాధి ఉద్యోగాలు సహా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మరో కాశ్మీరంగా మారుతుందని చెబితే... కల కాబోదు నిజం అవుతుందని ఆశించాం. అయితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఎంతోకొంత అభివృద్ధి సాగుతున్నప్పటికీ ఆశించిన స్థాయిలో మా జిల్లాకు అభివృద్ధి ఫలాలు అందడం లేదన్నది వాస్తవం. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈనాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా వెనుకబడి ఉన్న జిల్లా ఉందా అంటే ముమ్మాటికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నే అనేది వాస్తవం. మీరు తెలంగాణ ఉద్యమాన్ని నడిపినంత కాలం మీతో నడిచిన మాకు మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండో పర్యాయంతో దశాబ్ద కాలం గడుస్తున్న సందర్భంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ నేపథ్యంలోనే మీరు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ పర్యటనకు వస్తున్న సందర్భంగా గతంలో ఉమ్మడి జిల్లా అభివృద్ధికి మీరు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తున్నాం.
భీమ్ గడ్డ మరో కాశ్మీరం ఉత్తదేనా..
దేశ విదేశాల నుంచి కాశ్మీర్ చూసేందుకు పర్యాటకులు వస్తుంటారు. అలాంటి మరో కాశ్మీరం మన ఆదిలాబాద్ జిల్లాలోని ఉందని మీరు చెప్పిన విషయం గుర్తుందా సార్. నైజాంతో పోరుసలిపిన గోండు బిడ్డ కొమురం భీం పుట్టిన గడ్డ జోడెన్ ఘాట్ ను 100 కోట్లతో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఆసిఫాబాద్ జిల్లాలో విస్తరించి ఉన్న సహ్యాద్రి పర్వతశ్రేణులను 1000 కోట్లు ఖర్చు చేసైనా మరో కాశ్మీరంలా మారుస్తానని దేశంలోనే గొప్ప పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాస్త కాలేశ్వరం ప్రాజెక్టుగా మార్చిన తర్వాత కాంగ్రెస్ హయాంలో తుమ్మిడి హెట్టి వద్ద ప్రారంభించిన పథకాన్ని ఆ జిల్లాలో విస్తరిస్తానని హామీ ఇచ్చారు. కెరమెరి మండలం సహా శీతల ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాల్లో భారీగా ఆపిల్ తోటలు పెంచుతామని అందుకు ప్రభుత్వమే గిరిజన రైతులకు పెట్టుబడి సాయం చేస్తుందని సైతం హామీ ఇచ్చారు. ఏ ఒక్కటి నెరవేరకపోతుండడం పట్ల ఆ జిల్లా ప్రజలు నిరాశతో ఉన్నారు.
ఆదిలాబాద్లో సిమెంట్ ఫ్యాక్టరీ ?
వలస పాలన కారణంగా మూతపడిన ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని తాము అధికారంలోకి రాగానే రాష్ట్ర బడ్జెట్ లోనే సొంత ఖర్చులతో ఫ్యాక్టరీని పునరుద్దరిస్తామని ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ కాస్త ఇప్పుడు రాజకీయమై కేంద్రం రాష్ట్రం అంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. పెన్ గంగ నదిపై నిర్మించిన చనాక కొరాట ప్రాజెక్టు ఫలాలు సహా మత్తడి వాగు ప్రాజెక్టు ఫలాలు ఇప్పటిదాకా రైతాంగానికి అందడం లేదు. ఏజెన్సీ కేంద్రమైన ఉట్నూరులో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు హామీ బుట్టదాకలైంది ఆ యూనివర్సిటీ ఉమ్మడి వరంగల్ జిల్లాకు తరలిపోతోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
నిర్మల్ జిల్లా సమస్యలు
తెలంగాణ ఉద్యమంలో రాజకీయంగా ఎన్నో కార్యక్రమాలకు వేదికగా నిలిచిన నిర్మల్ జిల్లాలో ఇంకా సమస్యల నీడలు వెంటాడుతూనే ఉన్నాయి. గడ్డెన్న వాగు ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురైన గ్రామాల పరిహారం సమస్య ఇప్పటికీ తీరలేదు. నిర్మల్ జిల్లాలో కాలేశ్వరం ప్రాజెక్టు కింద చేపట్టిన 27 28 ప్యాకేజీల పనులు దశాబ్ద కాలంగా నత్తనడకనే నడుస్తున్నాయి. గోదావరి నదిపై ఇటు నిర్మల్ జగిత్యాల జిల్లాలకు సాగునీరు అందించే ప్రాజెక్టుగా నిర్మిస్తున్న సదర్ మార్ట్ ప్రాజెక్టు నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. నిర్మల్ మున్సిపాలిటీలో 100 కోట్లతో నిర్మిస్తామన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం హామీ కాగితాల్లోనే ఉంది. ఒకప్పుడు వెలుగు వెలిగిన నిర్మల్ పీజీ కళాశాల ఇప్పుడు మూతపడింది. నిర్మల్ కొయ్యబొమ్మల పరిశ్రమకు భారీ ప్యాకేజీ ప్రకటిస్తామని ఇచ్చిన హామీ కూడా ఆచరణలో నెరవేరలేదు.నిర్మల్ జిల్లాలో వేల సంఖ్యలో ఉన్న బీడీ కార్మికుల జీవన భృతి సహా కూలీల పెంపు విషయంలో ఇచ్చిన హామీలు ఇంతవరకు నెరవేరలేదు.
మంచిర్యాలకు మొండిచేయి
పారిశ్రామికపరంగా ఎంతో అభివృద్ధి చెందాల్సిన మంచిర్యాల జిల్లా ఇంకా ఆశించిన స్థాయిలో అభివృద్ధి సాధించలేదు. అధికారంలోకి రాగానే ఓపెన్ కాస్ట్ మైనింగ్ పూర్తిగా మూసివేసి ఉపరితల బొగ్గు గని ఉత్పత్తికి ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు. ఆచరణలో సాధ్యం కాకపోగా మరిన్ని ఓపెన్ కాస్ట్ మైన్లు పెరిగిపోతున్నాయి. సింగరేణి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం రెండో ఫేజ్ ఇంకా పూర్తి కాలేదు బెల్లంపల్లిలో ఏర్పాటు చేస్తామన్న మైనింగ్ కళాశాల ఊసే లేదు. ఇంకా ఇలాంటి ఎన్నో సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండా ఉమ్మడి జిల్లా ప్రజలను వేధిస్తున్నాయి. చాలాకాలం తర్వాత జిల్లాకు వస్తున్న మీరు ఇకనైనా హామీలు గుర్తుతెచ్చుకొని పరిష్కరించేందుకు దారి చూపుతారని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులుగా మేము విశ్వసిస్తున్నాం.
Read More: ట్రాన్స్‌ఫర్‌కు రూ.లక్షకు పైనే వసూలు.. కేజీబీవీ బదిలీల్లో జోరుగా పైరవీల దందా!
వీక్లీ ఆఫ్ లేదు.. టైంకు జీతం రాదు.. ఇదీ తెలంగాణలో పోలీసుల పరిస్థితి!