కబ్జా కోరల్లో కడెం చివరి ఆయకట్టు కాల్వలు..

by Sumithra |
కబ్జా కోరల్లో కడెం చివరి ఆయకట్టు కాల్వలు..
X

దిశ, లక్షెట్టిపేట : కడెం ప్రాజెక్టు చివరి ఆయకట్టు కాలువల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. రియల్టర్లు, పలుకుబడి ఉన్న బడా బాబుల భూదాహానికి కబ్జాకు గురవుతున్నాయి. చివరి ఆయకట్టు వరకు పదేళ్లుగా సరిగ్గా సాగునీరందని పరిస్థితుల్లో పిచ్చి పొదలు మొలిచి పూడిక చేరి కాలువలు పూడుకుపోయాయి. దీనిని ఆసరాగా చేసుకున్న ఆక్రమణదారులు కాలువలను వదిలిపెట్టడం లేదు. ఫిర్యాదులు వెళితేనే స్పందిస్తున్న సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులు కాలువల స్థలాలను రక్షించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట నుంచి హాజీపూర్ మండలం గుడిపేట గ్రామం వరకు ఉన్న ఉప, పిల్ల కాలువలు ఆక్రమణలతో ఆనవాళ్లు కనిపించని పరిస్థితికి వస్తున్నాయి. 63వ నెంబరు జాతీయ రహదారి వెంట లక్షెట్టిపేట మండలం నుంచి హాజీపూర్ మండలంలోని గుడిపేట వరకు కాలువల పక్కన ఉన్న భూములకు మంచి డిమాండ్ ఉండటంతో ఈ కాలువలను బడా బాబులు, రియల్టర్లు తమ వెంచర్లలో కలిపేసుకుని కబ్జా చేస్తున్నా.. నీటిపారుదల శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదీ పరిస్థితి...

నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు ప్రధాన కాలువ (ఎడమ) కడెం నుంచి దస్తురాబాద్ మండలం మీదుగా మంచిర్యాల జిల్లాలోని జన్నారం, దండేపల్లి, లక్షెట్టిపేట మండలాల మీదుగా హాజీపూర్ మండలంలోని గుడిపేట గ్రామం వరకు 73 కిలోమీటర్ల దూరం విస్తరించి ఉంది. ఎస్.డి (సబ్ డిస్ట్రిబ్యూటరీ) కాలువలుగా పిలిచే ఉప కాలువలు, ఫీల్డ్ చానల్స్ గా పిలిచే పిల్ల కాలువలు లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాల్లో ఆక్రమణదారుల చేతుల్లో ఆనవాళ్లు లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. హాజీపూర్ మండలంలోని కడెం ప్రాజెక్టు డి - 42 కాల్వకి, ఎస్ డి - 8, ఎస్ డి -9, ఎస్ డి -10, ఎస్ డి - 11, ఎస్ డి-12 ఉపకాలువలు ఉన్నాయి. 63వ నెంబర్ జాతీయ రహదారి పక్కనే కాలువలు ఉండడంతో రియల్టర్లు, బడా బాబులు ఆక్రమించి సొమ్ము చేసుకుంటున్నారు. రహదారి పక్కన భూములకు ఎకరాన రూ. కోట్లలో ధర పలుకుతుండడంతో వాటిని కొనుగోలు చేసి తమ భూముల పక్కన కాలువలు ఉంటే వాటిని ఆక్రమించి కబ్జా చేస్తున్నారు. లక్షెట్టిపేట మండలంలోని డి -37, డి -38 కింద ఉప కాలువలు, పిల్ల కాలువలు కూడా ఆక్రమణదారుల బారిన పడుతున్నాయి. కాలువలు మాయమైతే చివరి ఆయకట్టులో ఉన్న తమ సాగు భూములకు నీరు ఎలా వస్తుందని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇవీ ఆక్రమణలు..

ఎస్ డి -11, ఎస్ డి -12 ఉప కాలువలు పూర్తిగా ఆనవాళ్లు కోల్పోయే పరిస్థితి కి వచ్చాయి. ఈ ఉప కాలువల్లో కొంత భాగం గుడిపేట గ్రామ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్వాసితుల కోసం ఏర్పాటు చేసిన ఆర్ అండ్ ఆర్ కాలనీకి ప్రభుత్వం తీసుకోగా, మిగతా కొంత భాగం ఆక్రమణలు, కబ్జాలతో ఇతరుల ఆధీనంలోకి వెళ్ళిపోతున్నాయని అక్కడి స్థానికులు ఆరోపిస్తున్నారు. జాతీయ రహదారి సమీపాన తన భూమి పక్క నుంచి వెళ్తున్న ఎస్ డి - 11 కాల్వను మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు ఆక్రమించి గేటుని ఏర్పాటు చేసుకున్నాడు. తమ భూమి పక్కనుంచి వెళ్తున్న ఇదే కాల్వను మందమర్రికి చెందిన ఓ ప్రముఖ వ్యక్తి సైతం ఆక్రమించి కాంపౌండ్ వాల్ పెట్టుకోవడం గమనార్హం. ఎస్ డి -10 కాల్వను జాతీయ రహదారి పక్కన ఓ వెంచర్ నిర్వాహకుడు కాల్వను ఆక్రమించి ప్రహరీని నిర్మించగా స్థానికుల ఫిర్యాదుతో సంబంధిత అధికారులు దృష్టికి వెళ్లడంతో కాలువ పై ఉన్న ఆ ప్రహరీని కూలగొట్టించారు. దీంతో అక్కడ కాలువకు అధికారులు హద్దులు పాతించారు. అయినా తన వెంచర్ పక్క నుంచి వెళ్తున్న ఆ కాలువను ఆక్రమించుకునే యత్నాలను ఆ వెంచర్ నిర్వాహకుడు మానుకోలేదని సమాచారం. కాగా, ఉపకాల్వ మధ్య నుంచి రెండు వైపులా ఎటూ 33 అడుగుల వెడల్పుతో, అదే పిల్ల కాల్వ అయితే మధ్య నుంచి రెండువైపులా ఆరున్నర వెడల్పుతో ఉండాలి. కాలువల ద్వారా పంట పొలాలకు సాగునీరు అందడంతో పాటు రైతులు పొలాలకు వెళ్లేందుకు కట్టకు రెండు వైపులా ఉన్న ఆ స్థలం దారులుగా ఉపయోగపడతాయి. కాల్వల పై ఆక్రమణలతో కాల్వ కట్ట వెడల్పులు రాను రానూ తగ్గిపోతున్నాయి.

కొందరు రైతులు కూడా కాలువ కట్టలను చదును చేసి తమ పంట చేలలో కలుపుకొని ఆక్రమిస్తుండడం శోచనీయం. లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని పాలశీతలీకరణ కేంద్రం సమీపాన జాతీయ రహదారి పక్కన డి - 37 కాలువ కట్ట కొంత స్థలాన్ని ఓ వ్యాపారి ఆక్రమించి ఓ పెద్ద భవంతినే నిర్మించాడు. ఈ కాలువ కింద లక్షేట్టిపేట మున్సిపాలిటీ లోని గంపలపల్లి నుంచి మోదేల గ్రామానికి వెళ్లే ఉప కాలువలు, పిల్ల కాలువలు అక్కడక్కడ రియల్టర్ల బారినపడి చివరి భూములకు నీరందని పరిస్థితి నెలకొంది. అయితే ఆక్రమణలు, కబ్జాలతో కాలువలు ఆనవాళ్లు లేకుండా పోయి భవిష్యత్తులో చివరి ఆయకట్టు సాగు ప్రశ్నార్థకం కానుందనే ఆందోళన రైతుల్లో మొదలైంది. ఇప్పటికైనా సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులు కాలువల పై దృష్టి సారించి తగు చర్యలు చేపట్టి సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, కాలువల పై క్షేత్ర పరిశీలనలో ఎక్కడైనా ఆక్రమణలు ఉన్నట్లు తమకు కనిపిస్తే తగు చర్యలు చేపట్టి తొలగిస్తున్నామని కడెం ప్రాజెక్టు లక్షేట్టిపేట మండల ఏఈ రాజేందర్ తెలిపారు. అలాగే రైతులు కూడా కాలువల పై ఆక్రమణలు జరిగితే తమ దృష్టికి తీసుకువచ్చి సహకరించాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed