వయో వృద్ధులను కాపాడుకోవలసిన బాధ్యత మనదే : కలెక్టర్ రాజర్షి షా

by Aamani |
వయో వృద్ధులను కాపాడుకోవలసిన బాధ్యత మనదే : కలెక్టర్ రాజర్షి షా
X

దిశ, ఆదిలాబాద్ : రాబోయే తరాలకు మంచి మార్గాలను బోధించే ప్రతి ఇంట్లో వృద్ధులను కాపాడుకోవడం తో పాటు వారిని గౌరవించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మహిళా శిశు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం అంతర్జాతీయ వయోవృద్ధుల సంక్షేమ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. అధికారికంగా నిర్వహించిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఆదిలాబాద్ జిల్లాలో అత్యంత వృద్ధులైన పలువురిని జిల్లా అదనపు ఎస్పీ సురేందర్ తో కలిసి పూలమాల శాలువాలతో సత్కరించి గౌరవించారు. అంతకుముందు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.ఇందులో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో వృద్ధులకు సంబంధించిన సమస్యలను తెలియజేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 14567 ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలియజేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం ను ఏడాది అక్టోబర్ 1న నిర్వహించుకుంటామని అన్నారు. పెద్దల పట్ల నేటితరం చూపిస్తున్న వ్యవహారశైలిని పరిగణనలోకి తీసుకొని అంతర్జాతీయ స్థాయిలో ఈ సమస్యపై చర్చించి వృద్ధుల దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన ఆవశ్యకతను వారికి తెలియజేయాలని కోరారు. వయో వృద్ధులకు సంబంధించిన చట్టాల పై అవగాహన కలిగి ఉండాలని,వారిని నిర్లక్ష్యం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రతి మండలం,డివిజన్,గ్రామ స్థాయిలో వయో వృద్ధుల చట్టాల పై అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. వయోవృద్ధులకు వయోభారంతో వచ్చే వ్యాధులను దృష్టిలో ఉంచుకొని హెల్త్ క్యాంప్ లు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

అదనపు ఎస్పీ సురేందర్ మాట్లాడుతూ.. జిల్లాలో నివసిస్తున్న ఒంటరి సీనియర్ సిటిజన్స్ వివరాలు ఇవ్వాలని, పోలీస్ తరఫున ఆన్ని సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వినోద్ కుమార్,డి డబ్ల్యూ ఓ సబిత, డి ఆర్ డి ఓ సాయన్న, అదనపు డి ఎం హెచ్ ఓ సాధన,వయోవృద్ధుల జిల్లా సమాఖ్య అధ్యక్షుడు డాక్టర్ దేవిదాస్ దేశ్ పాండే,తదితరులు పాల్గొన్నారు.

Next Story