ఆ జిల్లాలో యథేచ్ఛగా రేష‌న్ బియ్యం దందా.. చేతులెత్తేసిన ఉన్నతాధికారులు

by srinivas |
ఆ జిల్లాలో యథేచ్ఛగా రేష‌న్ బియ్యం దందా.. చేతులెత్తేసిన ఉన్నతాధికారులు
X

దిశ‌, ఆదిలాబాద్ బ్యూరో: పేద‌ల‌కు రెండు రూపాయ‌ల‌కు కిలో బియ్యం అందించే ల‌క్ష్యంతో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న స‌మ‌యంలో నిర్ణయం తీసుకుని దానిని అమ‌లు చేశారు. ఇప్పటి వ‌ర‌కూ ప్రభుత్వాలు ఆ రేష‌న్ బియ్యం స‌ర‌ఫ‌రా అలాగే కొన‌సాగుతున్నాయి. చాలా మంది పేద‌లు రేష‌న్‌బియ్యం తిని త‌మ జీవ‌నం సాగిస్తున్నారు.

ఆయ‌న పేరుతోనే ఏర్పడిన కాల‌నీ. జిల్లా కేంద్రలోనే ఉంటుంది.. కానీ అదే కాల‌నీ నుంచి పెద్ద ఎత్తున అదే రేష‌న్ బియ్యం అక్రమంగా ర‌వాణా అవుతున్నాయి. కాల‌నీలో నివ‌సించే కొంద‌రు రేష‌న్‌బియ్యం దందా సాగిస్తున్నారు. పోలీసులు దీనిపై దృష్టి సారించి ఆ బియ్యం దందా ఆపాల‌ని చూసినా ఎలాంటి ఫ‌లితం లేకుండా పోతోంది. మంచిర్యాల జిల్లా కేంద్రంగా రేష‌న్ బియ్యం అక్రమ ర‌వాణా జోరుగా సాగుతోంది. పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేస్తున్నా అక్రమార్కుల్లో మార్పు రావడం లేదు. స్థానిక అధికారుల అండదండలు, రాజకీయ నాయకుల సహాయ సహకారాలతోనే బియ్యం దందా యథేచ్ఛగా కొనసాగుతున్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బియ్యం రవాణా చేస్తూ పట్టుబడుతున్న వారిపై కేసులు నమోదవుతున్నా అక్రమ బియ్యం దందా మాత్రం ఆగడం లేదు. అక్రమార్కులు వివిధ మార్గాల్లో రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. కొంతమంది వ్యాపారులు ప్రత్యేకంగా రేషన్‌ బియ్యం కొని వాటిని విక్రయించడమే వృత్తిగా పెట్టున్నారు.

ఎన్టీఆర్ న‌గ‌ర్‌ నుంచి రేషన్ బియ్యం దందా

ఈ కాల‌నీలో నివ‌సించే కొంత మంది ఈ రేష‌న్ బియ్యం దందా య‌థేచ్ఛగా కొన‌సాగిస్తున్నారు. వారు త‌మ వాహ‌నాల ద్వారా చుట్టు ప‌క్కల ప్రాంతాల్లో లబ్ధిదారుల నుంచి రేషన్‌ షాపు వద్దనే కొంటున్నారు. మ‌రికొంద‌రు గ్రామాల్లోకి వెళ్లి వారి వ‌ద్ద బియ్యాన్ని కొనుగోలు చేసుకుని వ‌స్తున్నారు. వీట‌న్నింటిని డంప్ చేసుకుని మ‌హారాష్ట్రలోని సిర్వంచ వ‌ద్ద ఉన్న డాన్ ఆదేశాలు రాగానే వాహ‌నాల ద్వారా రేష‌న్ బియ్యం అక్ర‌మంగా స‌ర‌ఫ‌రా చేస్తున్నారు. కిలో బియ్యాన్ని రూ. 10 నుంచి రూ.12కు కొనుగోలు చేసి మహారాష్ట్రలో రూ.20 కు వరకు విక్రయిస్తున్నారు.

అధికారులు, నేత‌ల అండ‌దండ‌లు..

కొంద‌రు అధికారులు, నేత‌ల అండ‌దండ‌ల‌తో ఈ రేష‌న్ బియ్యం అక్రమ ర‌వాణా జోరుగా సాగుతోంది. దాదాపు ప‌దేండ్లకు పైగా ఈ వ్యవ‌హారం సాగుతున్నా అధికారులు క‌నీసం ప‌ట్టించుకోవ‌డం లేదు. దీనికి నేత‌ల అండ‌దండ‌లు సైతం ఉండ‌టంతో ఎవ‌రూ అటువైపుగా క‌న్నెత్తి చూడ‌టం లేద‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇక్కడి నుంచి వెళ్లే వాహ‌నాలు ఎవ‌రూ ప‌ట్టుకోరు. ఒక‌వేళ ఎవ‌రైనా ప‌ట్టుకున్నా మ‌హారాష్ట్రలోని సిర్వంచ‌లో ఉన్న డాన్ చెబితే వాటిని వ‌దిలేస్తున్నారు. ఇక కొంద‌రు నాయ‌కులు సైతం త‌మ ప‌లుకుబ‌డి ఉపయోగించి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. మ‌హారాష్ట్రలోని సిర్వంచ‌కు త‌ర‌లివెళ్లే బియ్యంలో 30 శాతం స‌రుకు ఇక్కడ నుంచే వెళ్తుందంటే ప‌రిస్థితి అర్ధం చేసుకోవ‌చ్చు.

క‌ట్టడి చేయాల‌ని ప్రయ‌త్నించినా ఫ‌లితం లేదు..

కొంద‌రు అధికారులు వీరి తీరు మార్చేందుకు ప్రయ‌త్నాలు చేశారు. అయినా ఎలాంటి ఫ‌లితం లేకుండా పోయింది. అదే స‌మ‌యంలో వారిపై కేసులు కూడా పెట్టారు. పోలీసు అధికారులు వారిని పిలిపించి కౌన్సెలింగ్ సైతం నిర్వహించారు. అయినా మార్పు లేద‌ని ప‌లువురు చెబుతున్నారు. ఈ వ్యాపారంలో పెద్ద ఎత్తున లాభం ఉండ‌టంతో దాని వైపే మొగ్గు చూపుతున్నార‌ని ప‌లువురు స్పష్టం చేస్తున్నారు. ఆ కాల‌నీలోనే చాలా మంది ఈ రేష‌న్ దందా ఆపేందుకు సైతం ప్రయ‌త్నించినా వారిలో మార్పు రాలేదు. ఈ నేప‌థ్యంలో ఏం చేయాలో అర్ధం కాక పోలీసు ఉన్నతాధికారులు సైతం చేతులెత్తేశారు. ఇప్పటికైనా ఈ విష‌యంలో క‌లుగ‌చేసుకుని బియ్యం అక్రమ ర‌వాణా ఆపాల‌ని ప‌లువురు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed