పట్టు రైతుకు చేయూత

by Sridhar Babu |
పట్టు రైతుకు చేయూత
X

దిశ, మంచిర్యాల : పట్టు పరిశ్రమ రైతులకు ఎంతో చేయూత అందిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. రైతుల ప్రయోజనం కోసం ఉద్యానవన, పట్టుపరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో రాంచీలోని సీఎస్బీ, సీటీఆర్టీఐ సహకారంతో టాసర్ రేషం కృషి మేళా నిర్వహించినట్టు, దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మంగళవారం జిల్లాలోని చెన్నూర్ మండల కేంద్రంలోని దసలి పట్టుగూళ్ల నిల్వ భవనం (గిడ్డంగి)ని ప్రారంభించారు. అనంతరం మోడల్ కొకూన్ మార్కెట్ కాంప్లెక్స్​ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జార్ఖండ్లోని రాంచీలో గల సీటీఆర్, టీఐ సంచాలకులు డాక్టర్ ఎన్.బాలాజీ చౌదరి, ఛత్తీస్ గఢ్ లోని బిలాస్పూర్లో గల బీటీఎస్ఎస్ఓ సంచాలకులు డాక్టర్ టి. సెల్వకుమార్, జిల్లా ఉద్యానవన, పట్టు శాఖ సంయుక్త సంచాలకులు ఎం. లత, వరంగల్ జిల్లా సంయుక్త సంచాలకులు జి. అనసూయలతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతుల ప్రయోజనం కొరకు 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో డీఎంఎఫ్టీ నిధుల కింద పట్టుపరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో దసలి పట్టుగూళ్ల నిల్వ భవనం (గిడ్డంగి)ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు.

రైతు శ్రేయస్సులో భాగంగా టాసర్ రేషం కృషి మేళా కార్యక్రమం నిర్వహించినట్టు చెప్పారు. టాసర్ పట్టు సాధన చేసే రైతులను ప్రోత్సహిస్తూ పట్టు నూలు తయారీ, ఫ్యాబిక్ తయారీ అభివృద్ధి చేయడం ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలను కల్పించవచ్చని అన్నారు. ప్రభుత్వం నుండి సాధ్యమైన అన్ని సహాయాలను అందించడం జరుగుతుందన్నారు. టాసర్ హోస్ట్ ప్లాంట్ కోసం పోడు భూములు, అటవీ భూములను ఉపయోగించుకోవాలని తెలిపారు. సెరికల్చర్, అటవీ శాఖల మధ్య ఉన్న భూసంబంధిత సమస్యల పరిష్కారం, టాసర్, వెదురు సాగు అభివృద్ధిపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కార్యకలాపాలను సమర్థవంతంగా చేపట్టేందుకు మహిళా స్వయం సహాయక సంఘాల అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. దేశంలో టాసర్, ముడి పట్టు ఉత్పత్తిలో గత దశాబ్ద కాలంగా సైంటిస్ట్ డి ఎం.వీ.కే. భగవానులు నేతృత్వంలోని బీఎస్ఎంటీసీ చెన్నూర్ అత్యుత్తమ సేవలను అందిస్తున్నారని అన్నారు. దేశంలోని అన్ని టాసర్ సెరికల్చర్ ప్రాక్టీస్ చేసే రాష్ట్రాలలో ఈ విత్తనానికి మంచి డిమాండ్ ఉందన్నారు, ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్లోని అస్తిత్వ మహిళా సమితి సహకారంతో స్వయం సహాయక సంఘాల ద్వారా కార్యకలాపాలను ప్రారంభించాలని తెలిపారు.

టాసర్ సిల్క్ రీలింగ్ యంత్రాలతో పాటు ప్రత్యక్షంగా యంత్ర పనితీరును ప్రదర్శించారు. అనంతరం కోకన్ ఉత్పత్తి, టాసర్ గుడ్డు ఉత్పత్తిలో ఉత్తమ రైతులతో పాటు అధికారులు, త్వరలో పదవీ విరమణ పొందనున్న సెంట్రల్ సిల్క్ బోర్డ్ చెన్నూర్ ఎంవీకే భగవానులును సత్కరించి, ధృవపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సెరికల్చర్ ఎ.డి. రాథోడ్ పార్వతి, ములుగు ఆర్.ఎస్.ఆర్.ఎస్. జి.రాఘవేంద్ర, సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story