జోరుగా జీరో దందా.. ఇసుక క్వారీ నిర్వాహ‌కుల ఇష్టారాజ్యం

by Shiva |
జోరుగా జీరో దందా.. ఇసుక క్వారీ నిర్వాహ‌కుల ఇష్టారాజ్యం
X

దిశ‌, ఆదిలాబాద్ బ్యూరో: ఇసుక ర‌వాణాలో పెద్ద ఎత్తున అక్రమాల‌కు పాల్పడుతున్న నిర్వాహ‌కులు, నిబంధ‌న‌లు సైతం తుంగ‌లో తొక్కుతున్నారు. తాము ఆడిందే ఆట‌.. పాడిందే పాట‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. రాత్రివేళ‌ల్లో జీరో దందా సాగిస్తూ అక్రమాలు చేస్తున్నా అధికారులు కండ్లు మూసుకుంటున్నారు. రాత్రి వెళ్లే లారీల‌కు పైలెట్ ఎస్కార్ట్ వాహ‌నాల‌తో మ‌రీ త‌ర‌లిస్తున్నారంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు. మంచిర్యాల జిల్లా చెన్నూరు రీచ్‌లో టీజీఎండీసీ నిబంధన ఒక్కటి కూడా అమ‌లు కావ‌డం లేదు. ఇక్క నిబంధ‌న‌లు అమలు చేయాల్సిన అధికారులు క‌నీసం ఇటు వైపు క‌న్నెత్తి కూడా చూడ‌టం లేదు. దీంతో క్వారీ నిర్వాహ‌కులు ఇష్టారాజ్యంగా వ్యవ‌హ‌రిస్తున్నారు. కోటపల్లి మండలం కొల్లూరు-2, కొల్లూరు-3, పలుగుల-3 (ఎర్రాయిపేట), పలుగుల-4 (పారుపల్లి) ఇసుక రీచ్‌ల‌లో అధిక నిల్వలు ఉంచి రాత్రి వేళ‌ల్లో వాటిని త‌ర‌లిస్తున్నారు.

వారానికి మూడు రోజుల పాటు ఈ వ్యవ‌హారం కొన‌సాగుతోంది. నిబంధ‌న ప్రకారం ప్రతి రీచ్‌లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. అయితే ఏ రీచ్‌లో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయకపోవడంతో వెళ్తున్న ఇసుక ఎక్కడి నుంచి తరలివెళ్తుంది అన్న విషయంపై క్లారిటీ ఉండదు. లారీ డ్రైవర్లు, క్లీనర్లు చెప్పే సమాచారంతో అధికారులు విచారించినా త‌మ రీచ్ నుంచి ఇసుక వెళ్లలేద‌ని త‌ప్పించుకునే అవ‌కాశం ఉంటుంది. ఒకవేళ అధికారులు రీచ్‌లను త‌నిఖీ చేసినా అక్కడ లారీలకు సంబంధించిన ఆనవాళ్లు కూడా ఉండవు కాబట్టి తాము సేఫ్‌గానే ఉంటామని రీచ్‌ నిర్వాహ‌కులు భావిస్తున్నారు. ఈ కారణంగానే జీరో దందాను యథేచ్ఛగా సాగిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. వాస్తవంగా రీచ్‌ల‌ నుంచి తరలివెళ్లే ఇసుక లారీల రికార్డులు కూడా ఖచ్చితంగా మెయింటెన్ చేయాల్సి ఉంటుంది. అయితే, ఇక్కడ అలాంటివి ఏమీ క‌నిపించ‌డం లేదు.

అపార్ట్‌మెంట్లతో ముందే ఒప్పందం..

ఇసుక రీచ్ నిర్వాహ‌కులు అపార్ట్‌మెంట్ క‌ట్టించే వారితో ఒప్పందాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, మంచిర్యాల ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్ క‌ట్టించే బిల్డర్లతో మాట్లాడుకున్నట్లు స‌మాచారం. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా క్వారీ చేయాల్సిన ప్రాంతం స‌రిహ‌ద్దు దాటి ఇసుక తోడుతున్నారు. రాత్రి వేళ్లలో జీరో దందా చేసే చాలా లారీలు క్వారీ య‌జ‌మానులే కావ‌డం గ‌మ‌నార్హం. అలా ముందుగా ఒప్పందం చేసుకున్న వారికి జీరో ఇసుక పంపించి కోట్లాది రూపాయ‌ల ప్రభుత్వ ఆదాయానికి ఎగ‌నామం పెడుతున్నారు. అటు నిబంధ‌న‌లు తొక్కి లారీల్లో అధిక లోడు, ఇటు లారీల వ‌ద్ద ప్రైవేటు సైన్యంతో వ‌సూళ్లు, జీరో దందాతో కోట్లాది రూపాయ‌ల ప్రభుత్వ ఆదాయం గండి కొట్టి క్వారీ య‌జ‌మానులు కోట్లు గ‌డిస్తున్నారు. మ‌రి ఇదంతా టీజీఎండీసీ అధికారుల‌కు తెలియ‌దా..? అంటే తెలిసే జ‌రుగుతోంద‌న్న ఆరోప‌ణలు ఉన్నాయి. మిగ‌తా ప్రభుత్వ విభాగాల‌కు చెందిన అధికారులు సైతం నిమ్మకు నీరేత్తిన‌ట్లు వ్యవ‌హ‌రిస్తున్నారు.

ముందు పైలెట్‌.. వెన‌క ఎస్కార్ట్‌..

రాత్రి పూట జీరో ఇసుక తీసుకువెళ్లే వాహ‌నాల‌ను చాలా జాగ్రత్తగా తీసుకువెళ్తున్నారు. ఇసుక తగలించే లారీలకు పైలెట్, ఎస్కార్ట్ వాహనాలు కూడా ఉంటాయి. ఈ వాహనాల్లో తిరిగే వారు ముందుగా పోలీసులు, విజిలెన్స్, రవాణా శాఖ అధికారులు చెకింగ్ విషయాలను గమనిస్తూ లారీలను ముందుకు నడిపిస్తుంటారు. హైదరాబాద్ చేరే వరకూ కూడా పైలెట్ ఎస్కార్ట్ వాహనాలు జీరో ఇసుక లారీలకు సెక్యూరిటీ ఇస్తుంటాయి. ఎక్కడైనా అధికారులు వాహ‌నాల త‌నిఖీలు, క‌ట్టడి చేసేందుకు చర్యలు చేపట్టారంటే ఆ విషయం వెంటనే ఇంకో టీమ్‌కు సమాచారం అందిస్తారు. లారీలను క్షేమంగా తరలించేందుకు ఎస్కార్ట్‌గా ఉండే వాహనాల్లోని వారికి సమాచారం చేరవేస్తారు. వెంటనే ఆ లారీల్లోని ఇసుక‌ ఎక్కడపడితే అక్కడ డంప్ చేసి తప్పించుకునే విధంగా స్కెచ్ వేస్తున్నారు. ఈ జీరో దందా కట్టడి చేయాలంటే రీచ్ ల వ‌ద్దనే క‌ఠిన చ‌ర్యలు తీసుకోవాల‌ని ప‌లువురు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed