పచ్చని చేలల్లో గడ్డి ‘విషం’.. దీనిపై దృష్టి సారించాలని కోరుతున్న రైతన్నలు

by Anjali |   ( Updated:2024-07-08 02:43:56.0  )
పచ్చని చేలల్లో గడ్డి ‘విషం’..  దీనిపై దృష్టి సారించాలని కోరుతున్న రైతన్నలు
X

దిశ‌, మంచిర్యాల: గడ్డి, కలుపు మొక్కల నివారణకు వాడే మందులు ఏకంగా పంటలనే నాశనం చేస్తున్నాయి. పొలాలు దుక్కి దున్ని నాట్లు వేసుకున్నప్పటి నుంచి పంటల దిగుబడి వచ్చేవరకు కలుపు సమస్య తీరడం లేదు. ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో కూలీల సమస్య అధికంగా ఉండటంతో రైతులు కలుపు నివారణ కోసం మందులపై ఆధారపడుతున్నారు. మ‌రీ ముఖ్యంగా గ్లైఫోసెట్‌ను ఆశ్ర‌యిస్తున్నారు. ఈ మందుతో గడ్డి వెంట‌నే చ‌నిపోతుండ‌టంతో రైతులు పూర్తిగా దీనిపైనే ఆధార‌ప‌డుతున్నారు. ఈ గ‌డ్డిమందుపై దృష్టి సారించి చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అధికారులు నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

వేలాది లీటర్ల గ్లైఫోసెట్ ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాకు చేరుతోంది. ఈ నిషేధిత మందు విక్రయం జోరుగా సాగుతోంది. వానాకాలం సీజన్లో ప్రభుత్వ ఆదేశాలతో ఈ ఏడాది నిషేధిత, గుర్తింపు లేని పత్తి విత్తనాలు కొంతవరకు పట్టుకుని కేసులు నమోదు చేశారు. కానీ సరఫరాను పూర్తిస్థాయిలో అడ్డుకోలేకపోయారు. ప్రస్తుతం కలుపు మందు సరఫరాను నియంత్రించకపోవడంతో అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. రెండేళ్ల కింద‌ట ఇదే సీజన్లో పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టి వందల లీటర్ల గ్లైఫోసెట్ పట్టుకుని కేసులు నమోదు చేశారు. ఈ ఏడాది తనిఖీలు లేవు.. పట్టుకున్నదీ లేదు. దీంతో గ్లైఫోసెట్ బహిరంగంగానే చెలామణి అవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు పంట ఎదుగుదల దశకు చేరుకుంది. కలుపు మొక్కలు కూడా పెరిగిపోవడంతో ప్రస్తుతం కలుపు నివారణ పనులు సాగుతున్నాయి. రైతులు కలుపు నివారణ కోసం నిషేధిత గడ్డి మందును ఆశ్రయిస్తున్నారు. దీంతో అక్రమార్కులు గుర్తింపు లేని పత్తి విత్తనాలు చేరవేసినట్లుగానే కలుపు నివారణకు గ్లైఫోసెట్ సరఫరా చేస్తున్నారు.

మహమ్మారిలా గ్లైఫోసెట్‌

కలుపు మొక్కలు, గడ్డి నివారణకు వాడే గ్లైఫోసెట్‌ మందు రైతుల పాలిట మహమ్మారిలా తయారైంది. దీంతో అప్పట్లో గడ్డిమందు పేరుతో అమ్ముడయ్యే గ్లైఫోసెట్‌ను నిషేధించినట్లు ప్రకటించినా ఆ తర్వాత ఆంక్షలతో కూడిన అనుమతులు ఇచ్చారు. గ్లైఫోసెట్‌ మందు మాత్రం ఖరీఫ్‌ సీజన్‌(జూన్‌-అక్టోబరు)లో మాత్రమే అమ్మాలనే నిబంధనలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత గ్లైఫోసెట్‌కు బదులు రకరకాల గడ్డిమందులు మార్కెట్లోకి వచ్చాయి. అసలు ఈ గడ్డి మందు వల్ల జరిగే ప్రమాదకర పరిణామాల విషయంలో వ్యవసాయశాఖ ఏం పట్టనట్లుగా వ్యవహరించడం పలు విమర్శలకు తావిస్తోంది. వ్యవసాయశాఖ అధికారులు ఎరువులు, మందుల దుకాణాదారులతో కుమ్మక్కవడంతో నిషేధిత నాణ్యతలేని, నకిలి ఎరువులు, పురుగు మందులు రైతులకు అంటగడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

పర్యావరణానికి ముప్పు

పంటచేలల్లో వాడే గడ్డి, కలుపు నివారణ మందు ప్రభావానికి పంటలే కాకుండా మానవాళికి, పర్యావరణానికి తీవ్రహానికరం. సాగు భూములు సారం కోల్పోయి పనికిరాకుండా పోతాయి. ఇక మనుషుల్లో కేన్సర్‌ లాంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలోని అంతర్జాతీయ కేస్సర్‌ పరిశోధన సంస్థ(ఏఐఆర్‌సీ) 2015లో నిర్ధారించింది. అధిక దిగుబడుల కోసం రైతులు విచ్చలవిడిగా ఎరువులు, చీడపీడ నివారణ, కలుపు మొక్కల నివారణకు మందులు వాడుతుండటంతో భూమిలో సారం, పోషకాలు తగ్గిపోతున్నట్లు శాస్త్రవేత్తలు, వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.

రూ.కోట్లలో వ్యాపారం

మంచిర్యాల‌, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో సాగ‌వుతున్న ప‌త్తిలో 50 శాతం వరకు నిషేధిత గ్లైసిల్ విత్తనాలే ఉండడం గమనార్హం. వారంద‌రికీ గుట్టుచప్పుడు కాకుండా గ్లైఫోసెట్ మందును రైతులకు అందిస్తున్నారు. మహారాష్ట్ర నుంచి ఉమ్మడి జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్నగర్ మీదుగా జిల్లాలోని తాండూర్, భీమిని, వేమనపల్లి, బెల్లంపల్లి, నెన్నెల, కాసిపేట మండలాలకు, మరోవైపు మహారాష్ట్ర నుంచి సిరొంచ, అర్జునగుట్ట మీదుగా జిల్లాలోని చెన్నూర్, కోటపల్లి, భీమారం, జైపూర్, మందమర్రి మండ‌లాలకు వేలాది లీటర్లు తరలిస్తున్నారు. రాత్రికి రాత్రే ప్రైవేటు వాహనాల్లో జిల్లాకు తరలించి అటవీ, ప్రాంతం, చేన్ల వద్ద ఉంచి గుట్టుచప్పుడు కాకుండా అమ్మకాలు సాగిస్తున్నారు. తెల్లవారే సరికి మారుమూల గ్రామాలు, పత్తిచేన్ల వద్దకు తరలిస్తున్నారు.

పెరుగుతున్న డిమాండ్‌..

గ‌తంలో లీటర్ రూ. 600 నుంచి రూ.800 చొప్పున అమ్మేవారు. ఇప్పుడు వీటిపై నిఘా పెరిగింద‌న్న నెపంతో అక్ర‌మార్కులు లీట‌ర్ రూ. 1,000 నుంచి రూ. 1,800 వ‌ర‌కు అమ్ముతున్నారు. అయినా రైతులు వీటివైపే మొగ్గుచూపుతున్నారు. ఈ గ్లైఫోసెట్ ద్రావ‌ణం 5, 10, 20 లీటర్ల క్యాన్లలో విక్రయిన్నారు. గ‌తంలో ఈ గ్లైఫోసెట్ మందుపై దృష్టి పెట్టిన పోలీసులు, వ్య‌వ‌సాయ శాఖ అధికారులు చ‌ర్య‌లు తీసుకున్నారు. కేసులు సైతం పెట్టారు. కానీ, ఈ సీజన్లో అధికారులు దాడులు చేసిందీ లేదు. పట్టుకున్నదీ లేదు. దీంతో పెద్ద ఎత్తున రైతుల చేన్ల వద్దకే నేరుగా చేరుతోంది. గైసిల్ విత్త‌నాలు అమ్మిన వ్యాపారులే నిషేధిత గ్లైఫోసెట్ గడ్డి మందు కూడా అమ్ముతున్నా ప‌ట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు.

నిషేధిత మందు వల్ల ఎన్ని న‌ష్టాలో..

నిషేధిత గ్లైఫోసెట్‌ వంటి కలుపు నివారణ మందును విచ్చలవిడిగా వినియోగించడం వల్ల క్యాన్సర్‌తో పాటు చర్మ సంబంధిత జబ్బులకు గురయ్యే ప్రమాదం అధికంగా ఉందని పరిశోధనల్లో వెల్లడైంది. పంట పొలంలో కలుపు నివారణ మందు పిచికారి చేస్తే సాధారణంగా వారం రోజుల్లో ఆ మందు శక్తిని కోల్పోతుంది. తద్వారా పంటకు, ప్రజలకు నష్టం ఉండదు. అయితే.. నిషేధిత కలుపు మందు 30-45 రోజులకు పైగా భూమిలో అలాగే ఉంటుంది. ఎక్కువ కాలం భూమి పొరల్లో నిషేధిత మందు ప్రభావం ఉండడం వల్ల భూమి నిస్సారం అవుతుంది. తద్వారా పంట దిగుబడులపై ప్రభావం చూపుతుంది. భూమి సారాన్ని పెంచేందుకు ఎరువుల రూపంలో అదనపు ఖర్చు భరించాల్సి వస్తుంది. భూమిలో పంటకు మేలు చేసే జీవరాశులు, సూక్ష్మజీవులు, పోషకాలు ఉంటాయి. ఎక్కువ కాలం భూమి పొరల్లో నిషేధిత కలుపుమందు అవశేషాలు ఉండడంతో పైరుకు మేలు చేసే పోషకాలు, సూక్ష్మజీవులు, జీవరాశులు నశించిపోతాయి. వాతావరణం కలుషితమై.. ఆ గాలి పీల్చిన రైతులు, ప్రజలు వివిధ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుందని సీనియర్‌ శాస్త్రవేత్త ఒకరు వివరించారు.

Advertisement

Next Story

Most Viewed