- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ధనార్జనే ధ్యేయం...ప్రజల ప్రాణాలతో చెలగాటం
దిశ, ఆదిలాబాద్ : సరదాగా వీకెండ్ లో కుటుంబ సభ్యులు స్నేహితులతో బిర్యాని తిందామని రెస్టారెంట్ లేదా హోటల్ కి వెళ్దాం అనుకునేవారు ఒక్క క్షణం ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. పైన పటారం లోన లొటారం అన్న చందంగా మారింది. జిల్లాలోని పలు హోటల్లు, స్వీట్ షాపుల పరిస్థితి అధికారుల తాజా తనిఖీల్లో బయటపడిన కల్తీ ఆహార పదార్థాలే దీనికి నిదర్శనం. మిరిమిట్లు గొలిపే విద్యుత్ కాంతులు,అద్దాలతో అలంకరణ, ఏ గార్డెన్, రెస్టారెంట్ చూసిన ఆకర్షించేలా వెయిటర్ డ్రెస్ కోడ్, చూసి చాలా బాగుందనుకునే వారికి కిచెన్ లో చూస్తే మాత్రం విస్తూ పోవాల్సిందే. ధనార్జనే ధ్యేయంగా నిర్వాహకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాల్సిన ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం నామ్ కే వాస్తే తనిఖీలు చేసి జరిమానాలకే పరిమితమవుతున్నారు. మామూళ్ల మత్తులో తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తూన్నారనే విమర్శలు సైతం వ్యక్తం అవుతున్నాయి.
తనిఖీల్లో విస్తుపోయే నిజాలు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గత నెలలో గడిచిన 25 రోజుల క్రితం ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారుల బృందం తనఖీ లో విస్తుపోయే కల్తీ ఆహార ఉత్పత్తులు, కాలం చెల్లిన మసాలాలు, కిచెన్ షెడ్డులో అపరిశుభ్రత వంటి ఎన్నో వాస్తవాలు బయటపడ్డాయి. అయితే ఓటల్లు, రెస్టారెంట్లు, స్వీట్ షాపుల్లో ఇలాంటి పరిస్థితి నిత్యకృతమే అయినప్పటికీ తనిఖీలు చేస్తే తప్ప వాస్తవాలు బయటపడటం లేదు. ఈ విషయాలు తెలియని ఎంతో మంది అమాయక ప్రజలు అక్కడికి వెళ్లి కల్తీ ఆహారం తిని ఆసుపత్రుల పాలవుతున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులకు గురవుతూ.. వేలకు వేలు, లక్షల రూపాయలు ఆస్పత్రుల్లో ఖర్చు చేస్తున్నారు. జిల్లా కేంద్రమే కాకుండా జిల్లాలోని దాదాపు అన్ని హోటల్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోనూ,ఉమ్మడి జిల్లా పరిధిలోని అనేక బిర్యాని హోటళ్లలో, రెస్టారెంట్ లలో ఇదే పరిస్థితి నెలకొంది. తాజాగా నిర్మల్ జిల్లాలో కేంద్రంలోని ఓ హోటల్లో మండి బిర్యాని తిన్నా 13 మంది అస్వస్థతకు గురి కావడం గమనార్హం.
ముక్కు మూసుకోవాల్సిందే
జిల్లాలో విద్యుత్ కాంతులతో మెరుస్తూ, రంగురంగుల బోర్డులతో, రంగురంగుల ఆహార పదార్థాల పోస్టర్లతో ఆకర్షింప చేస్తున్న పలు హోటల్లు, రెస్టారెంట్లకు సంబంధించిన కిచెన్ లోకి వెళ్తే మాత్రం దుర్గంధం స్వాగతం పలుకుతోంది. తినడానికి వెళ్లే ప్రజలు గుమగుమలాడే బిర్యాని వాసన వెనుక ఇంత దుర్ఘంధం ఉంటుందనే వాస్తవాన్ని ఎవరు గ్రహించలేకపోతున్నారు. ఇంతటి గుమగుమలాడే ఆహార పదార్థాలను తయారు చేసే కిచెన్ రూమ్ లోకి వెళ్తే మాత్రం ముక్కు మూసుకోవాల్సిందే. ఫ్రిజ్ లో నిల్వ ఉండే రోజుల తరబడి మాంసం...ఇతర కుళ్లిన పదార్థాలను చూస్తే ఇంకోసారి హోటల్ కి వెళ్లాలనే ఆలోచన కూడా రాదు. కుళ్ళిపోయిన అల్లం, వెల్లుల్లి..వారం,15 రోజులకు ఒకసారి తయారు చేసే మసాలా కర్రీ తో పాటు తదితర నాసిరకం పేస్టులను వినియోగిస్తున్నారు. వాటి నుంచి దుర్గంధం రాకుండా ఎప్పటికప్పుడు కెమికల్స్ చల్లుతున్నారు.
జిల్లా కేంద్రంలో గడచిన 25 రోజుల క్రితం టాస్క్ ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు హోటల్స్ మాత్రమే తనిఖీ చేయగా, ఎన్నో కల్తీ ఆహార పదార్థాల విషయాలు బయటపడ్డాయి. చాలా హోటల్లో బిర్యాని చేసిన తర్వాత మిగిలిపోతే అందులోని ముక్కలను తీసి, మరసటి రోజు వేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వాసన రాకుండా గుమగుమలాడేలా అందులో బ్లీచింగ్ పౌడర్,ఇతర రసాయనాలను కలుపుతున్నారు. ఇలాంటి భోజనం చేసేవారు క్యాన్సర్ బారిన పడే ప్రమాదం లేకపోలేదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాలో ఎందరో మంది తమకు తెలియని విధంగా క్యాన్సర్ బారిన పడుతున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు.ఇందుకు ఆదిలాబాద్ జిల్లా ఆసుపత్రిలో పదుల సంఖ్యలో.. వారికి తెలియకుండానే క్యాన్సర్ బారిన పడి బాదితులు చికిత్స పొందుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
తీపి,ఘుమ ఘుమల వెనుక కల్తీ
ఏ సంతోషాన్ని పంచుకోవాలన్నా తీపి తోనే మొదలు పెడతారు. ప్రజలు అలాంటి మిఠాయిలే కల్తీ అయితే ఇక సంతోషం కొద్దిసేపటిదేనన్న వాస్తవాన్ని వారు తెలుసుకోలేకపోతున్నారు. వీటిని తిన్నవారు.. ఆసుపత్రుల పాలవుతున్నారు. ఎందుకంటే మిఠాయిల తయారీలో వాడిన నూనెని వాడటం, రుచి కోసం కెమికల్స్ వేయడం,కల్తీ పాలు, నెయ్యి ఇతర పదార్థాలను కలుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ కల్తీ విషయం జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిపిన తాజా తనిఖీల్లో బయటపడింది.
తూతూ మంత్రంగా తనిఖీలు..
ఎప్పటికప్పుడు ప్రజల ప్రాణాలకు హాని కలవకుండా తనిఖీలు చేస్తూ హోటల్లు, ఐస్ క్రీమ్ పార్లర్లు, స్వీట్ హౌస్ లను తనిఖీలు చేయాల్సిన మున్సిపల్,జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు చేసి, మామూళ్ల మత్తులో మునిగి తేలుతున్నారు. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు రెగ్యులర్ గా తనిఖీ చేయాల్సి ఉండగా, ఏడాదికి ఒకసారి చుట్టం చూపుగా తనిఖీలు చేసి మమ అనిపిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. రెండు మూడు హోటల్లు, స్వీట్ షాపులను మాత్రమే తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారు. అధికారులు మామూలుగా వ్యవహరిస్తూ.. కఠిన చర్యలకు వెనకాడడంతో నిర్వాహకులు జంకడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఫుడ్ సేఫ్టీ కి సంబంధించిన జిల్లాలో ఒక్క ఇన్చార్జి అధికారి మాత్రమే ఉన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆ అధికారి ఆ శాఖలో పలు అదనపు బాధ్యతలతో పాటు ఫుడ్ సేఫ్టీ ఇన్చార్జి అధికారి గాను వ్యవహరిస్తుండటం గమనార్హం. ఇదివరకే ఇక్కడ పని చేసిన ఎఫ్ఎస్ఓ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకుగాను,ఆ అధికారిని మరో జిల్లాకు బదిలీ చేశారు. దీంతో ఇక్కడ తనిఖీల జాడ లేకుండా పోయినట్టు తెలుస్తోంది. వరంగల్ జిల్లాకు చెందిన ఓ అధికారికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించిన.. ఇక్కడ మాత్రం విధులు నిర్వహించేందుకు ససేమీర అంటున్నట్లు తెలుస్తోంది.
కళ్ళ ముందే కల్తీ ఫుడ్
ఆదిలాబాద్ జిల్లాలో ఎప్పటికప్పుడు రెగ్యులర్ గా హోటల్లు, బిర్యాని హౌస్ లు, ఐస్ క్రీమ్ పార్లర్లు, స్వీట్ హౌస్ లను తనిఖీలు చేసి ప్రజల ఆరోగ్యాలను కాపాడాల్సిన అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహిస్తుండడంతో ప్రజల ఆరోగ్యంతో నిర్వాహకులు చెలగాటమాడుతున్నారు. కళ్ళ ముందే కల్తీ పదార్థాలు కనబడుతున్న చర్యలు తీసుకునే వారు లేకపోవడంతో వ్యాపారస్తులు ఇష్ట రీతిగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా వాడిన వంట నూనెని వాడి వాడి వంట పదార్థాలను తయారుచేసి ప్రజలకు అంటగడుతున్నారు. ఇది తెలియనటువంటి అమాయక ప్రజలు తిని వారికి తెలియకుండానే అనారోగ్యం బారిన పడి ఆసుపత్రి పాలవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖకు రెగ్యులర్ అధికారులను నియమించి ప్రభుత్వం,జిల్లా కలెక్టర్ ప్రజల ప్రాణాలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.గడిచిన 10ఏళ్ల బి ఆర్ ఎస్ ప్రభుత్వ పాలనలో అధికారి లేకుండానే గడిచిన..కాంగ్రెస్ ప్రభుత్వం అయినా రెగ్యులర్ అధికారులను నియమించి ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా చూడాల్సిన అవసరం ఉందని పలువురు మేధావులు,విద్యావంతులు కోరుతున్నారు.