ముదురుతున్న "ఇథనాల్" వివాదం..!

by Nagam Mallesh |
ముదురుతున్న ఇథనాల్ వివాదం..!
X

దిశ, ప్రతినిధి నిర్మల్ః నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండల కేంద్రానికి సమీపంలో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిరసిస్తూ గ్రామస్తులు చేస్తున్న ఆందోళన ఉధృతం అవుతున్నది. గత 23 రోజులుగా శాంతియుతంగా నిరసనలు చేపడుతున్న గ్రామస్తులు సోమవారం నిర్మల్ బైంసా జాతీయ రహదారిపై వంటవార్పు కార్యక్రమాన్ని చేపట్టారు అయితే రాస్తారోకో కార్యక్రమానికి అనుమతి లేకపోవడంతో రోడ్డుకు ఒకవైపు సహపంక్తి భోజనాలు చేసి నిరసన తెలిపారు. తాజాగా భారీ ఎత్తున దిలావర్పూర్ సహా పలు గ్రామాల ప్రజలు కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చి జిల్లా కలెక్టర్ ను కలిసే ప్రయత్నం చేశారు. అయితే జిల్లాలో పోలీస్ 30 యాక్ట్ అమలులో ఉండడంతో నిరసన కారులను పోలీసులు సముదాయించే ప్రయత్నం చేశారు.

గ్రామస్తులపై కేసు నమోదు...

నిర్మల్ లో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉండగా అనుమతి లేకుండా ధర్నా నిర్వహించిన దిలావర్పూర్ గ్రామస్తులపై కేసు నమోదు చేసినట్టు నిర్మల్ పట్టణ పోలీస్ ఇన్ స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. గ్రామస్తులు వారి ప్రాంతం లో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ కి వ్యతిరేకంగా కలెక్టర్ ఆఫీస్ కి గుంపుగా వచ్చి ముందస్తు అనుమతి లేకుండా కలెక్టర్ ఆఫీస్ గేటు ముందు ధర్నా నిర్వహించారు. వారికి నచ్చచెప్పిన పోలీసుల మాట వినకుండా ఆఫీస్ కి వెళ్ళే ఉద్యోగుల విధులకు, కార్యాలయానికి వచ్చే సామాన్య ప్రజలకు ఆటంకం కలిగించారన్న ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామానికి చెందిన అనిల్ కుమార్, వీరేష్, సాయన్న తో పాటు మరికొంతమందితో పాటు గ్రామస్తులను కలెక్టర్ ఆఫీస్ కి తీసుకు వచ్చిన 20 ఆటోలపైన కేసు నమోదు చేశారు.

దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వండి

ఇథనాల్ ఫ్యాక్టరీ వలన ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో దిలవార్ పూర్, గుండం పెల్లి గ్రామస్థులు ఫ్యాక్టరీ నిలిపివేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇథనాల్ ఫ్యాక్టరీ వనల ప్రజలకు ఇబ్బందులు కలిగించే ఎటువంటి పనులనైనా ప్రోత్సహించబోమని తెలిపారు. ఫ్యాక్టరీ నిర్మాణ ప్రదేశంలో ఆర్డీవో, తహసిల్దార్ ల బృందం దర్యాప్తు జరిపి నివేదికను సమర్పించవలసిందిగా ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు కలెక్టర్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed