Collector : క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సీఎం కప్

by Kalyani |
Collector : క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సీఎం కప్
X

దిశ, ఆదిలాబాద్ : ప్రతిభ ఉన్న వెలుగులోకి రాని అనేక మంది క్రీడాకారులు ఉన్నారని, అలాంటి వారిని క్రీడల్లో ప్రోత్సహించేందుకు సీఎం కప్ 2024 నిర్వహిస్తున్నట్లు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజార్షి షా అన్నారు. సీఎం కప్ 2024 కార్యక్రమంలో భాగంగా సోమవారం స్థానిక ఇందిరా ప్రియదర్శిని మైదానం నుంచి కలెక్టరేట్ చౌక్ వరకు టార్చ్ ర్యాలీని నిర్వహించారు. ముందుగా ఇందిరా ప్రియదర్శిని మైదానంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్, జిల్లా ఎస్పీ గౌస్ ఆలం, తో కలిసి ఆయన టార్చ్ ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీలో యువ క్రీడాకారులతో పాటు అనేక మంది యువకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులు, చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లా వ్యాప్తంగా అనేక మంది క్రీడాకారులు ఎన్నో క్రీడల్లో రాణించేందుకు ఉత్సాహంతో ఉన్నారని తెలిపారు. అయితే అలాంటి వారిలో ప్రతిభ ఉన్నప్పటికీ దానిని వెలికి తీసి అవకాశం రావడం లేదని పేర్కొన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో పట్టణంలోని క్రీడాకారులతో సమానంగా గ్రామీణ క్రీడాకారులు కూడా అన్ని రంగాల క్రీడల్లో రాణిస్తూ తమ ప్రతిభను కనబరుస్తున్నారని తెలియజేశారు. అయితే అలాంటి వారికి సరైన గుర్తింపు లేక అవకాశాలు రాక వెలుగులోకి రాలేకపోతున్నారని తెలిపారు.

అలా ప్రతిభ ఉండి వెలుగులోకి రాని వారిని గుర్తించి క్రీడల్లో ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రవ్యాప్తంగా సీఎం కప్ 2024 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ అవకాశాలను ప్రతిభ ఉన్న క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే పాయల శంకర్ మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులతో పాటు పట్టణ క్రీడాకారులకు క్రీడల్లో రాణించేందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తూనే, క్రీడాభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు వెనకడుగు వేయకుండా అవకాశాలను అందిపుచ్చుకొని, క్రీడల్లో రాణించి జిల్లాకు ఎంతో గుర్తింపు తీసుకురావాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed