BC Commission Chairman Niranjan : శాస్త్రీయ పద్ధతిలో సర్వే పూర్తి చేస్తాం..

by Aamani |
BC Commission Chairman Niranjan : శాస్త్రీయ పద్ధతిలో సర్వే పూర్తి చేస్తాం..
X

దిశ, ఆదిలాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రిజర్వేషన్లు కీలక పాత్ర పోషిస్తాయని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ అన్నారు. అందుకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లపై శాస్త్రీయ పద్ధతిలో సమగ్ర సర్వే నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. బీసీ కుల గణన చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మొదటిసారి ఏర్పాటైన కమిషన్ సభ్యులు సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చారు. ముందుగా జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కలెక్టర్లు, ఆయా అధికారులు, బీసీ కుల సంఘాల ప్రతినిధులు, ఉద్యోగుల ద్వారా బీసీ కులగణన పై వారి కులవృత్తులు, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల అదృష్ట ఎదుర్కొంటున్న ఇబ్బందులు, తదితర అనేక అంశాలపై బహిరంగ విచారణ చేపట్టారు. ఈ విచారణలు వారి దృష్టికి వచ్చిన అంశాలను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని, అనంతరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కమిషన్ చైర్మన్ నిరంజన్ వెల్లడించారు.

అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఈ సర్వే కోసం 80 నుంచి 90 వేల మంది ఎనిమరేటర్ లను నియమించడం జరిగిందని అన్నారు. డిసెంబర్ 13 లోగా రిజర్వేషన్లపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుందని తెలియజేశారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందని, ప్రస్తుతం స్థానిక సంస్థలకు పాలకవర్గం లేనందున కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోతున్నాయని, అందువల్ల ప్రజా సమస్యలు పరిష్కారం నోచుకోలేక, అభివృద్ధి కుంటుపడుతుందని పేర్కొన్నారు. బహిరంగ విచారణలు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్నా ప్రధాన డిమాండ్ తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇందులో భాగంగా బీహార్ రాష్ట్రంలో గతంలో కులగణన సమగ్ర సర్వే కోసం 500 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని, దీనిపై న్యాయస్థాన నిర్ణయం అనుకూలంగా లేకపోవడం తో వందల కోట్ల రూపాయలు వృధా అయ్యాయన్న విషయాన్ని గ్రహించమని తెలిపారు.

అలాంటి పరిస్థితి రాష్ట్రంలో రాకుండా సమగ్రంగా, శాస్త్రీయంగా, బిసి కుల గణ ను,రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసి, ప్రభుత్వానికి ఈ నివేదికలు సమర్పించడం జరుగుతుందని అన్నారు. ఇది ఇలా ఉంటే కొన్ని కులాలలో ఉన్నటువంటి ప్రతినిధులు తాము ప్రస్తుతం బీసీ లో ఉన్నామని, ఇంకా కొన్ని కులాలు ఇతర వర్గాల్లో ఉన్నందున ముస్లిం లోని ఇతర కమ్యూనిటీలను బీసీ లో చేర్చాలన్న డిమాండ్ తమ దృష్టికి వచ్చిందని స్పష్టం చేశారు. ఇలా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 90 దరఖాస్తులు వచ్చాయని.. వాటిలో ఆదిలాబాద్ జిల్లా నుంచి 63, నిర్మల్ జిల్లా నుంచి 14, ఆసిఫాబాద్ జిల్లా నుంచి 6, మంచిర్యాల జిల్లా నుంచి 7 దరఖాస్తులు చొప్పున వచ్చాయని పేర్కొన్నారు. ఈ రిజర్వేషన్ల ప్రక్రియ లో భాగంగా ముందుగా న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లి, వారి అభిప్రాయం మేరకు రిజర్వేషన్లు ప్రకటించే అవకాశం ఉంటుందని వెల్లడించారు. ఈ సర్వే కోసం నియమించిన ఒక్కో ఎనిమిరేటర్ ప్రతిరోజు 10 కుటుంబాలను పూర్తి కూలంకషంగా, అన్ని విషయాలు సేకరించి, నమోదు చేసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో బీసీ కమిషన్ సభ్యులు తిరుమలగిరి సురేందర్, రాపోలు జయప్రకాష్, బాల లక్ష్మి, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed